పుస్తకాలు ఇస్తానంటూ.. ఇంటికి పిలిపించుకుని..
ABN, First Publish Date - 2021-12-07T15:25:21+05:30
చాక్లెట్లు, పెన్సిళ్లు ఇస్తానని..
చారిటీ ముసుగులో కామలీలలు!
పుస్తకాలు ఇస్తానంటూ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన
ఇంటికి పిలిపించుకుని వికృత చేష్టలు
చితక్కొట్టిన విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు
పోలీసుల అదుపులో నిందితుడు
మల్కాపురం (విశాఖపట్నం): చాక్లెట్లు, పెన్సిళ్లు ఇస్తానని ఆశ చూపి చిన్నారులను ఇంటికి పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కామాంధుడిని స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాపురం శివారు అంబేడ్కర్ కాలనీకి చెందిన దోమాన చిన్నారావు (48).. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా మల్కాపురం జీవీఎంసీ ప్రాథమిక, ఉన్నత పాఠశాల 4, 5, 6 తరగతి విద్యార్థినులతో పరిచయం పెంచుకుని తన ఇంటికి వస్తే చాక్లెట్లు, పెన్సిళ్లు, పుస్తకాలు ఇస్తానని ఆశ చూపేవాడు.
చిన్నారులు అతని ఇంటికి వెళితే వికృత చేష్టలకు పాల్పడేవాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం కూడా పిల్లలను ఇంటికి పిలిపించుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో ఓ విద్యార్థిని ఏడుస్తూ బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆరా తీస్తే మొత్తం 12 మంది బాలికల పట్ల చిన్నారావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు తేలింది. దీంతో సోమవారం ఉదయం బాధిత బాలికల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎం కుమార్‌కు ఈ విషయం చెప్పారు. చిన్నారావును హెచ్‌ఎం పాఠశాలకు పిలిపించారు. అక్కడ వేచి ఉన్న విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు ఒక్కసారిగా దూసుకువెళ్లి చిన్నారావును రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి చితకబాదారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ శిరీష విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2021-12-07T15:25:21+05:30 IST