ఈ మూడు సూత్రాలు పాటిస్తే చాలు.. సులభంగా బరువు తగ్గొచ్చు..!
ABN, First Publish Date - 2021-08-31T17:29:39+05:30
అధిక బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించడంతో పాటు మెరుగైన జీవనశైలిని అలవరుచుకోవాలి. కేవలం తాత్కాలికంగా బరువు తగ్గడం మీద దృష్టి పెట్టకుండా, దీర్ఘకాలం తగ్గిన బరువును అదుపులో ఉంచుకోగలిగే..
ఆంధ్రజ్యోతి (ఆగస్టు 30): అధిక బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించడంతో పాటు మెరుగైన జీవనశైలిని అలవరుచుకోవాలి. కేవలం తాత్కాలికంగా బరువు తగ్గడం మీద దృష్టి పెట్టకుండా, దీర్ఘకాలం తగ్గిన బరువును అదుపులో ఉంచుకోగలిగే ఆరోగ్యకరమైన జీవనశైలి మీదే దృష్టి పెట్టాలి. ఇందుకోసం తోడ్పడే మూడు కీలక ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అవేంటంటే..
జీవనశైలిలో ఆహారం పాత్ర
చాలా మందికి ఆహార నియమం అనేది ఓ గమ్యం. అలాకాకుండా దాన్ని ఓ ప్రయాణంలా భావించాలి. తీసుకునే పోషకాహారం ఓ ట్రెండ్ లేదా తాత్కాలిక ఫలితాన్నిచ్చే ఓ ఆయుధంలా కాకుండా దాన్ని జీవనశైలిగా మార్చుకోవాలి. ఆహారపుటలవాట్లను సరిదిద్దుకుని, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లతో కూడిన పోషకాహారాన్ని ఎంచుకోగలిగితే, కొవ్వును కరిగించే ప్రయాణం మొదలు పెట్టినట్టే! అలాగే చక్కని డైట్ ప్లాన్‌ను క్రమశిక్షణతో పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ప్రతి రోజూ తీసుకోవాలి. అదే ఆహారాన్ని ప్రతి రోజూ తినవలసివచ్చినా దారి తప్పకూడదు. అదే ఆహారాన్ని మసాలాలు, ఇతర పదార్థాలతో రుచిని పెంచుతూ ఆహార నియమాలకు కట్టుబడి ఉండాలి.
వర్కవుట్ ఇలా...
ఒకేసారి భారీ వర్కవుట్ చేయలేకపోతే, తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలను క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేయాలి. ఎవరికి వారు వారికి సూటయ్యే వ్యాయామాన్ని ఎంచుకోవాలి. కొందరికి జిమ్‌కి వెళ్లడం ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటివాళ్లు జాగింగ్, రన్నింగ్ లేదా సైక్లింగ్ ఎంచుకోవచ్చు. మరికొందరికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ నచ్చవచ్చు. అయితే ఎలాంటి వ్యాయామం ఎంచుకున్నా క్రమం తప్పకూడదు. ఫిట్‌నెస్, మెటబాలిజం.. ఈ రెండింటినీ వ్యాయామం ప్రభావితం చేస్తుంది. కేవలం క్యాలరీలను కరిగించడమే ధ్యేయంగా కాకుండా, శరీరాన్ని ఓ పాజిటివ్ స్ట్రెస్‌కు లోను చేయడం అలవాటు చేసుకోవాలి.
నిద్ర, హైడ్రేషన్
నిద్రకు మనమిచ్చే ప్రాధాన్యం తక్కువే! నిద్రను చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. శరీరం రికవర్ అవడానికి, బింజ్ ఈటింగ్‌ను ప్రభావితం చేసే కార్టిసాల్ హార్మోన్ సక్రమ పనితీరుకు కంటి నిండా నిద్ర అవసరం. శరీరం తనకు తాను ఆరోగ్య వ్యవస్థల్లోని పొరపాట్లను సరిదిద్దుకుని, ఒత్తిడిని తగ్గించుకునే వెసులుబాటు నిద్రలోనే పొందుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రకు కొరత రానివ్వకూడదు. అలాగే పోషకాలు శరీరమంతటా ప్రసరించడానికి తోడ్పడే నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. శరీరంలో నీరు నిల్వ ఉండిపోకుండా ఉండడానికీ, కలుషితాల విసర్జనకూ కూడా సరిపడా నీరు అవసరం. దాహార్తికీ ఆకలికీ మధ్య తేడా విషయంలో శరీరం అయోమయానికి లోనవుతూ ఉంటుంది. కాబట్టి అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుకోకుండా ఉండాలంటే దాహం వేసే లోపే నీళ్లు తాగుతూ ఉండాలి.
Updated Date - 2021-08-31T17:29:39+05:30 IST