రూ.15 కోట్ల విలువైన ఆలయ భూములు స్వాధీనం
ABN, First Publish Date - 2021-06-29T13:39:25+05:30
నగర శివారు ప్రాంతమైన జమీన్‌పల్లావరం సమీపంలో అన్యాక్రాంతమైన రూ.15 కోట్ల విలువైన రెండెకరాల విస్తీర్ణం కలిగిన ఆలయ భూములను హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు సమక్షంలో ఆ
చెన్నై: నగర శివారు ప్రాంతమైన జమీన్‌పల్లావరం సమీపంలో అన్యాక్రాంతమైన రూ.15 కోట్ల విలువైన రెండెకరాల విస్తీర్ణం కలిగిన ఆలయ భూములను హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు సమక్షంలో ఆ శాఖ ఉన్నతాధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. చెంగల్పట్టు జిల్లా పల్లావరం తాలూకా పరిధిలోని క్రోంపేట నెమిలిచేరి అరుళ్‌మిగు ఆనందవల్లి సమేత అగస్తీశ్వర ఆలయానికి చెందిన 2.02 ఎకరాల భూములను వాణిజ్య అవసరాల నిమిత్తం 11 మంది ఆక్రమించుకున్నారు. ఈ విషయం తెలియగానే 2017లో హిందూ దేవాదాయ శాఖ చట్టం 78 సెక్షన్ ప్రకారం ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 2018లో ఆ భూములను ఆక్రమించుకున్నవారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇటీవల హైకోర్టు అన్యాక్రాంతమైన ఆలయభూములను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, ఆ శాఖ కమిషనర్ జె.కుమారగురుబరన్, జిల్లా కలెక్టర్ ఎఆర్. రాహుల్‌నాఽథ్, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి దామో అన్బరసన్, పల్లావరం శాసనసభ్యుడు ఇ. కరుణానిధి సమక్షంలో ఆ భూములలోని దురాక్రమణలను తొలగించారు. ఆ తర్వాత ఆ భూములకు సంబంధిం చిన పత్రాలను ఆలయ నిర్వాహకులకు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి పీకే శేఖర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... ఆక్రమణలకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోమని ముఖ్యమంత్రి స్టాలిన్ ఉత్తర్వు జారీ చేశారని, హైకోర్టు కూడా ఇదే విధంగా ఆదేశించిందని తెలిపారు. స్థానిక వడపళని మురుగన్ ఆలయానికి చెందిన 7.5 ఎకరాల భూములు, తిరుపోరూరు ఆలయానికి చెందిన నాలుగు ఎకరాల భూములు, తిరుప్పూరులో ఎకరా విస్తీర్ణం కలిగిన భూములు, శివ గంగలో 10 ఎకరాల భూములు సహా ఇప్పటివరకూ రూ.500 కోట్ల విలువైన 79 ఎకరాల ఆలయభూముల దురాక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. శివగంగ జిల్లాల్లో 132 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిలో 10 ఎకరాల భూములను మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, తక్కిన భూములను కూడా త్వరలో స్వాధీనపరుచుకుంటామని పీకే శేఖర్‌బాబు తెలిపారు.
Updated Date - 2021-06-29T13:39:25+05:30 IST