యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ నినాదం ఇదే!
ABN, First Publish Date - 2021-08-06T18:23:29+05:30
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో జాతీయవాదం ప్రాతిపదికపై
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో జాతీయవాదం ప్రాతిపదికపై పోరాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ శుక్రవారం చెప్పారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాలం నుంచి తమకు ఇదే ప్రధానాంశమని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల్లో పోరాటానికి జాతీయవాదం ప్రధానాంశమైనపుడు కుల సమీకరణాలను ఎందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారని అడిగినపుడు స్వతంత్ర సింగ్ దేవ్ మాట్లాడుతూ, బీజేపీ చరిత్రను పరిశీలించాలని కోరారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ నుంచి ప్రారంభించి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్‌పాయి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు బీజేపీకి జాతీయవాదమే ప్రధానాంశమని తెలిపారు.
వరుసలో చిట్టచివర ఉన్న వ్యక్తిని సైతం అభివృద్ధి చేయాలనేదే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆదర్శమని తెలిపారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం, ఉజ్వల యోజన, సౌభాగ్య యోజన వంటి పథకాలు అణగారిన వర్గాలను, నిరుపేదలను అభివృద్ధి చేయడానికేనని చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారని అడిగినపుడు బదులిస్తూ, తమ పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచామని స్వతంత్ర దేవ్ తెలిపారు. పోలింగ్ బూత్ కమిటీలను బలోపేతం చేశామన్నారు. ఐదు పోలింగ్ బూత్‌లను పర్యవేక్షించేందుకు ఒకటి చొప్పున శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Updated Date - 2021-08-06T18:23:29+05:30 IST