సెకండ్ వేవ్‌పై.. కేంద్రం నిర్లక్ష్యం!
ABN, First Publish Date - 2021-05-02T08:16:17+05:30
కరోనా సెకండ్‌వేవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించిందా? మే నెలలో కరోనా సునామీ రానుందని మార్చి మొదటి వారంలోనే తెలిసినా.. పెద్దగా పట్టించుకోలేదా? రాబోయే ముప్పు...
- ముందుగానే కేంద్ర కమిటీ హెచ్చరిక
- మార్చి మొదటి వారంలోనే నివేదిక
- ఈ నెల 4 నుంచి ఉధృతమని వెల్లడి
- రోజుకు 4 వేల మరణాలంటూ వెల్లడి
- పట్టింపే లేని ధోరణిలో మోదీ సర్కారు
- ఖండించిన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ
న్యూఢిల్లీ, మే 1: కరోనా సెకండ్‌వేవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించిందా? మే నెలలో కరోనా సునామీ రానుందని మార్చి మొదటి వారంలోనే తెలిసినా.. పెద్దగా పట్టించుకోలేదా? రాబోయే ముప్పు ముందే తెలిసినా.. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌పై దృష్టి పెట్టకుండా.. సాగు చట్టాలు, విద్యుత్తు చట్టం, ఎన్నికలపైనే ఫోకస్ చేసిందా? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19పై నియమించిన సూపర్ మోడల్ త్రిసభ్య కమిటీ నివేదిక అవుననే చెబుతోంది. మార్చి మొదటి వారంలోనే ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మే 4 నుంచి దేశవ్యాప్తంగా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ‘‘రోజుకు 3.8 లక్షల నుంచి 4.4 లక్షల కేసులు ఉంటాయి. మే ప్రథమార్ధానికి క్రియాశీలక కేసులు 35 లక్షలకు చేరుకుంటాయి. రోజుకు 4 వేల మరణాలు ఉంటాయి’’ అని అంచనా వేసింది. అయితే.. ప్రస్తుత పరిస్థితులు ఆ కమిటీ ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నాయి. ఈ అంచనాలు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కమిటీ ఏయే తేదీల నుంచి వైరస్ విజృంభిస్తుందో స్పష్టంగా పేర్కొంది. సూపర్ మోడల్ కమిటీ ప్రాథమికంగా హెచ్చరికలు చేసిన కొన్ని రోజులకే.. అంటే మార్చి 7-9 తేదీల్లో మహారాష్ట్రలో సెకండ్‌వేవ్ మొదలైంది. ఇంత స్పష్టంగా.. రెండు నెలల ముందే హెచ్చరికలు వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. నిజానికి కేంద్రం అప్పుడే మేల్కొని, వైరస్ కట్టడికి ఒక విధానాన్ని రూపొందించి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కమిటీ నివేదిక ప్రకారం.. వచ్చే వారం భారత్‌లో కరోనా సునామీ రానున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, సెకండ్ వేవ్‌కు కుంభమేళా, ఎన్నికల ర్యాలీలే కారణమా? అనేదాన్ని విభేదిస్తున్న ఈ కమిటీ.. ‘‘కొవిడ్ ప్రొటోకాల్ పట్ల ప్రజల నిర్లక్ష్యమే సెకండ్‌వేవ్‌కు కారణం. అది ఏరూపంలోనైనా జరిగి ఉండొచ్చు’’ అని పేర్కొంటోంది.
మరి కేంద్రం ఏం చేసింది?
బీటా-కాంటాక్ట్ పారామితితో పక్కా గణాంకాలతో ఈ కమిటీ సెకండ్‌వేవ్ తీవ్రతను అంచనా వేసింది. నిజానికి ఏప్రిల్ మొదటి వారంలో సమగ్ర నివేదిక ఇచ్చినా.. కేంద్రం ముందుగానే సన్నద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో.. మార్చి మొదటి వారంలో ప్రాథమికంగా వివరాలు అందజేసింది. కమిటీ ఏర్పాటు సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం తమకు అందే సూచనలను పాటిస్తామని ప్రకటించింది. దీంతో.. ప్రభుత్వం తమ ప్రాథమిక నివేదికతో సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటుందని కమిటీ భావించింది. అయితే.. ఆ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు మోదీ సర్కారు మాత్రం ఇతర అంశాలపై దృష్టిపెట్టిందని రాయిటర్స్, సీఎన్‌ఎన్ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి చర్యలు ప్రారంభించాల్సింది పోయి.. పార్లమెంట్‌లో తన బలాన్ని చాటుకునేందుకు విద్యుత్తు, సాగు చట్టాల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నించిందని పేర్కొన్నాయి. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచడం, ఆక్సిజన్ లభ్యతపై దృష్టిపెట్టకుండా.. ఎన్నికలపై ఆసక్తి చూపిందని విమర్శించాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో ప్రతి 10 మందిని పరీక్షిస్తే.. ముగ్గురు పాజిటివ్‌లుగా తేలుతున్న దశలో.. పరిస్థితి తీవ్రస్థాయికి చేరాక కూడా.. పైపైన ప్రకటనలు చేసిందన్నాయి. ‘‘ఏప్రిల్ 15న శాస్త్రవేత్తలు, నిపుణులతో.. ఆ తర్వాత రాష్ట్రాలతో సమీక్షించారు. చాలా వర్గాలు లాక్‌డౌన్‌కు ప్రతిపాదనలు చేశాయి. కానీ, ఏప్రిల్ 20న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. లాక్‌డౌన్ ఉండబోదని ప్రకటించారు. లాక్‌డౌన్ అనేది చివరి ఆప్షన్ అవ్వాలని మాత్రం ఉద్ఘాటించారు’’ అంటూ కథనాలను ప్రసారం చేశాయి. భారత వేరియంట్ కరోనానూ సీరియ్‌సగా తీసుకోలేదని, ఫలితంగా ఆ మ్యూటెంట్ 17 దేశాలకు పాకిందని, ఇది చాలా వేగంగా విస్తరించే రకం వైరస్ అని పేర్కొన్నాయి.
ఖండిస్తున్న కేంద్రం
సూపర్ మోడల్ కమిటీ చెబుతున్న విషయాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి అశుతోష్ శర్మ ఖండించారు. ‘‘హెచ్చరికలు చేయడం వేరు.. పక్కాగా తీవ్రత ఇలా ఉంటుందంటూ కేసుల వ్యాప్తిని అంచనా వేయడం వేరు. సెకండ్‌వేవ్ వస్తుందని అందరికీ తెలుసు. ఎవరైనా చివరి క్షణంలోనే సన్నద్ధమవుతారు. ముందే చెప్పాం అని కమిటీ అంటోందే తప్ప.. అది ఐదు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతుందా? పది రెట్లా? అనేది ఎందుకు చెప్పలేకపోయింది?’’ అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎన్నికల ప్రచారానికి ముందే కొవిడ్ కేసులు పెరగడం ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు. మార్చి 11న కుంభమేళా మొదలయ్యే నాటికే సెకండ్‌వేవ్ దేశాన్ని చుట్టుముట్టిందని గుర్తుచేశారు. ‘‘ప్రజల నిర్లక్ష్యం, పెళ్లిళ్లలో ఎక్కువగా జనాలు పాల్గొనడం, గుంపులుగా తిరగడం వంటివి వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కమిటీ అంచనాలకు ప్రామాణికాలు ఇలా..
- బీటా-కాంటాక్ట్ పారామితితో పక్కా గణాంకాలతో మేము సెకండ్‌వేవ్‌ను అంచనా వేశారు
- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు
- కొవిడ్‌కు అవకాశం ఉండడం, గుర్తించనివి, పాజిటివ్, తొలగించిన విధానం గణాంకాల ఆధారంగా సెకండ్‌వేవ్ ఎప్పుడు వస్తుంది? తీవ్రత ఎలా ఉంటుంది? అనే అంశాలను అంచనా వేశారు
- సెకండ్‌వేవ్‌లో కరోనా సోకే ప్రతి 100 మంది నుంచి ఆ వైరస్ కనిష్ఠంగా 150 మందికి, గరిష్ఠంగా 438 మందికి సోకుతోంది
- ఈ కమిటీ గణాంకాల మేరకు కొన్ని చోట్ల మొదటి వేవ్ తీవ్రత కూడా ఇంకా తగ్గలేదు
ద్వితీయార్ధంలో తగ్గుముఖం
కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా తీవ్రత ఈ నెల ద్వితీయార్థంలో తగ్గుము ఖం పడుతుందని కొవిడ్‌పై జాతీయ సూపర్ మోడల్ కమిటీ చైర్మన్, ఐఐటీ-హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ అంచనా వేశారు. శనివారం ఆయన తమ కమిటీ నివేదికలోని పలు అంశాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. భయంతోనే ఎక్కువ మంది చని పోతున్నారన్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటున్న ప్రతి 10 వేల మందిలో 4 మరణాలే సంభవిస్తున్నాయి. వృద్ధాప్యంతోపాటు ఇతర వ్యాధులు ఇందుకు కారణం కావొచ్చని చెప్పారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి భయం వద్దన్నారు. దేశంలో వయసు రీత్యా, దీర్ఘకాలిక వ్యాధుల రీత్యా, 25 కోట్ల మందికి వ్యాక్సిన్ అందినా కేసులు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు. సెకండ్‌వేవ్ ను అదుపు చేయాలంటే లాక్‌డౌన్ అవసరమా? అనే ప్రశ్నకు ఆయన ఆ నిర్ణయం సరికాదన్నారు. లాక్‌డౌన్ విధిస్తే ఆకలి, భయం, సుదూర ప్రయాణాలతో మరణాలు సంభవిస్తాయన్నారు.
ఎవరీ ప్రొఫెసర్ విద్యాసాగర్?
అంతర్జాతీయ గణితశాస్త్రజ్ఞుడిగా పేరొందిన ఎంవీ సుబ్బారావు కుమారుడే ఐఐటీ-హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ విభాగం ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్. ఈయన గతంలో బెంగళూరు డీఆర్డీవోలో సెంట ర్ ఫర్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్ విభాగం డైరెక్టర్‌గా, టీసీఎ్‌సలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లోనూ పలు హోదాల్లో పనిచేశారు.
Updated Date - 2021-05-02T08:16:17+05:30 IST