మళ్ళీ మేమే అధికారంలోకి.. : సీఎం పళనిస్వామి
ABN, First Publish Date - 2021-02-28T14:45:53+05:30
శాసనసభలో ఎంజీఆర్, జయలలిత కలలను సాకారం చేసి మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. బడ్జెట్ శాసనసభ సమావేశాల
చెన్నై/ప్యారీస్ (ఆంధ్రజ్యోతి) : శాసనసభలో ఎంజీఆర్, జయలలిత కలలను సాకారం చేసి మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. బడ్జెట్ శాసనసభ సమావేశాల ముగింపు రోజైన శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన సమయంలో ప్రతిపక్ష నేతలు రెండు నుంచి ఆరు నెలల వరకు మాత్రమే సీఎం పదవిలో కొనసాగుతారని హేళనగా మాట్లాడారని, అయితే వారు ఆశించినట్టు కాకుండా నాలుగు సంవత్సరాలు పూర్తిచేసి ఐదవ సంవత్సరంగా రాష్ట్రప్రజలకు మంచి పథకాలను అందించామన్నారు. ప్రతిపక్షాల నేతలు ముక్కు మీద వేలు పెట్టుకొనే స్థాయికి రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని, ఇందుకోసం కేంద్రప్రభుత్వం నుంచి పలు పురస్కారాలు కూడా దక్కించుకున్న విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రం ముందుకెళ్లడానికి ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఉద్యోగులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సంక్షోభ పరిస్థితుల్లో అమ్మ విశ్వాసులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఒకే తాటిపై నిలిచి ప్రభుత్వంపై నిలబడేందుకు సహకరించారని అభినందించారు.
అదే విధంగా, ప్రతిపక్షాల సభ్యులు, అధికారపక్ష సభ్యులు అడిగిన వాడి వేడి ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రుల ద్వారా సమాధానాలు చెప్పించి సమర్ధవంతంగా సభను నడిపించి ఆదర్శవంతమైన శాసనసభ అని నిరూపించిన స్పీకర్ ధనపాల్, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్‌లకు, సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థల్లో కనీసవసతులు మెరుగుపరచి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకొనే అవకాశం కల్పించామని, న్యాయకళాశాలలు, వైద్యకళాశాలలను అవసరమైన ప్రాంతాల్లో ప్రారంభించడంతో పాటు మూడు వెటర్నరీ కళాశాలలు, పరిశోధన కేంద్రాన్ని నిర్మించి రికార్డు నెలకొల్పామన్నారు. ప్రపంచ స్థాయిలో జయలలిత స్మారక మందిరాన్ని బ్రహ్మాండంగా నిర్మించామని, ఆలయంగా భావిస్తున్న వేద నిలయాన్ని కూడా స్మారక మందిరంగా మార్చామన్నారు.
Updated Date - 2021-02-28T14:45:53+05:30 IST