సినిమాలు, రాజకీయాలకు గుడ్‌బై
ABN, First Publish Date - 2021-04-27T18:13:26+05:30
రెండుదశాబ్దాల పాటు శాండల్‌వుడ్ హీరోయిన్‌గా, తర్వాత మండ్య లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీగా, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలిగానే కాకుండా ‘దివ్యస్పందన’
- ట్విట్టర్‌లో అభిమానులతో నటి రమ్య
బెంగళూరు: రెండుదశాబ్దాల పాటు శాండల్‌వుడ్ హీరోయిన్‌గా, తర్వాత మండ్య లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీగా, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలిగానే కాకుండా ‘దివ్యస్పందన’ పేరుతో సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన రమ్య రెండు విభాగాలకు గుడ్‌బై చెప్పారు. సినిమాలతో పాటు రాజకీయాలు ఆసక్తికరంగా లేవని గుడ్‌బై చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. రమ్య నటించిన తొలి సినిమా ‘అభి’ విడుదలై ఆదివారం నాటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఇదే సందర్భంలో ట్విట్టర్ ద్వారా అభిమానుల నుంచి ప్రశ్నలకు ఆహ్వానించారు. మళ్లీ నటన ఎప్పుడనే ఓ ప్రశ్నకు నటన అనే నావ మునిగి చాలా కాలమైందని సినిమాలపై ఆసక్తి కోల్పోయానన్నారు. మరో అభిమాని సినిమాల నుంచి దూరం కావడం జీర్ణించుకోలేననే ప్రశ్నకు అభిమానికి క్షమాపణలు చెప్పారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలోని ‘నాగరహావు’ ఆమె చివరి చిత్రమనేది తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాలలో బిజీగా గడిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా తన రాజకీయ పయనం కూడా ముగిసిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన రమ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేసుకుని నిరంతరంగా విమర్శలు చేసేవారు. ప్రతి విషయంలోను ఆమె వివాదాస్పదంగానే కొనసాగారు. అటువంటి రమ్య 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రె్‌సకు దూరంగానే గడుపుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. నిరంతరంగా ఇటు సోషల్ మీడియా అటు మీడియా ముందు కనిపించే రమ్య దాదాపు రెండున్నరేళ్లుగా ఎక్కడ ఉన్నారనేది కూడా అంతుచిక్కని అంశంగా మారింది.
పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు
తనకు ఇప్పటి దాకా పెళ్లి కాలేదని స్పష్టం చేశారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సున్నితంగా సమాధానమిచ్చారు. మీకు ఇప్పటికే పెళ్లి అయ్యిందా అనే నెటిజన్‌కు సమాధానంగా ఇంకా కాలేదని డేటింగ్‌లు కూడా చేయడం లేదన్నారు. మరో అభిమాని హీరో రక్షిత్‌శెట్టిని పెళ్లి చేసుకోవాలని కోరగా అతడి చిరుమందహాసపు ఫోటో షేర్ చేశారు. మీకు ఎలాంటి వరుడు కావాలనే ప్రశ్నకు సానుభూతి, స్నేహం, ఓపెన్‌మైండ్ ముఖ్యమన్నారు. పెళ్లి ఎప్పుడనే మరో ప్రశ్నకు స్పందిస్తూ పెళ్లి.. పెళ్లి.. పెళ్లి.. ఇదొక్కటే పనా అంటూనే పెళ్లి తర్వాత సంతోషం ఉండదు తెలుసా అంటూ చమత్కరించారు.
Updated Date - 2021-04-27T18:13:26+05:30 IST