అధిష్ఠానం నిర్ణయం మేరకే మంత్రివర్గ విస్తరణ: CM
ABN, First Publish Date - 2021-12-07T17:24:20+05:30
అధిష్ఠానం పెద్దల నిర్ణయం మేరకు కేబినెట్ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. గడిచిన నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు హల్‌చల్ చేస్తు
బెంగళూరు: అధిష్ఠానం పెద్దల నిర్ణయం మేరకు కేబినెట్ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. గడిచిన నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు హల్‌చల్ చేస్తున్న తరుణంలో సీఎం స్పందించారు. సోమవారం హుబ్బళ్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం విధానపరిషత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నామన్నారు. బెళగావిలో జరిగే శాసనసభ శీతాకాల సమావేశాలు విజయవంతం చేయదలిచామన్నారు. విస్తరణ విషయమై ఇంకా ఎటువంటి చర్చలు జరుగలేదన్నారు. పరిషత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నామన్నారు. పరిషత్ ఎన్నికల్లో జేడీఎస్ మద్దతు విషయం కుమారస్వామి తీర్మానించాల్సి ఉందన్నారు. బీజేపీలో చేరనందుకే తీహార్ జైలుకు పంపారనే డీకే శివకుమార్ ఆరోపణలపై సమాధానం చెప్పనంటూ దాటవేశారు. ఒమైక్రాన్ వైరస్ కేసులు ప్రబలిన తరుణంలో మాల్స్, సినిమాహాళ్లలో 50 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పించే విషయమై నిపుణుల కమిటీకి సూచించామన్నారు. వారి అభిప్రాయం మేరకు అమలు చేస్తామన్నారు. నైట్ కర్ఫ్యూ అమలుపై నిపుణుల కమిటీతో చర్చిస్తామన్నారు. ఒమైక్రాన్‌ను ఏ విధంగానైనా నియంత్రించాలన్నదే తమ ఆశయమన్నారు. క్లస్టర్‌లలో వైరస్ కేసులు బయటపడితే ప్రథమ, ద్వితీయ సంబంధాలు కలిగినవారిని గుర్తించి నిరంతరంగా టెస్టింగ్‌లు నిర్వహిస్తామన్నారు. హాస్టల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో కొవిడ్ కేసులు పెరిగినచోట సీల్‌డౌన్ చేశామన్నారు.
Updated Date - 2021-12-07T17:24:20+05:30 IST