Karnataka : కరోనా కట్టడికి కఠిన చర్యలు
ABN, First Publish Date - 2021-08-14T18:27:11+05:30
కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆగస్టు 15వతేదీ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని...
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆగస్టు 15వతేదీ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోకా చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్రల నుంచి కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి బెంగళూరుతోపాటు ఇతర జిల్లాల్లో ఆంక్షలు పెడతామని మంత్రి పేర్కొన్నారు. బెంగళూరులో పిల్లల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. బెంగళూరు నగరంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించే ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదని మంత్రి అశోక చెప్పారు.
‘‘ కరోనా కట్టడికి కర్ఫ్యూ ఒక్కటే కొలమానం కాదు, లాక్ డౌన్ విధించడం, ఇతర చర్యలు ప్రజలను ప్రభావితం చేస్తాయి, రోగులకు ఔషధాలు ఇవ్వడం ద్వారా కూడా కరోనాను నియంత్రించవచ్చు’’ అని మంత్రి చెప్పారు. మొహర్రం, గణేశ చతుర్థి , రాఘవేంద్ర ఆరాధన వంటి నాలుగు ఐదు పండుగలు వచ్చాయని, కరోనాను నియంత్రించేందుకు ఈ పండుగల సందర్భంగా ఆంక్షలు విధిస్తామని మంత్రి చెప్పారు. పిల్లలకు కరోనా చికిత్స చేసేందుకు వీలుగా పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.దేవాలయాల్లోకి భక్తులను అనుమతించకపోవడం, రాత్రి కర్ఫ్యూ విధించడం, కార్యక్రమాలు, ఈవెంట్‌లు, వివాహాల్లో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనకుండా పరిమితులు విధించడం ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేస్తామని మంత్రి అశోక చెప్పారు.
Updated Date - 2021-08-14T18:27:11+05:30 IST