రామాలయం పునాది నిర్మాణం తొలి దశ పూర్తి : ట్రస్ట్
ABN, First Publish Date - 2021-09-16T22:48:50+05:30
రామాలయం నిర్మాణం పునాది పనుల్లో తొలి దశ పూర్తయింది
అయోధ్య : రామాలయం నిర్మాణం పునాది పనుల్లో తొలి దశ పూర్తయింది. కాంక్రీట్‌పై కర్ణాటక గ్రానైట్, మీర్జాపూర్ శాండ్‌స్టోన్‌తో మరొక పొర వేస్తారు. ఈ వివరాలను రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గురువారం చెప్పారు.
అయోధ్యలో జరిగిన ఆలిండియా మేయర్స్ కౌన్సిల్ సమావేశం ముగింపు కార్యక్రమంలో సోమవారం చంపత్ రాయ్ మాట్లాడుతూ, కనీసం వెయ్యేళ్ళ వరకు నిలిచే విధంగా రామాలయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌లు, ఇంజినీర్లు నిరంతరం పని చేస్తున్నారని చెప్పారు. ఇది ఓ ఇంజినీరింగ్ అద్భుతమని తెలిపారు. నిర్మాణం కోసం కేవలం రాళ్ళను మాత్రమే ఉపయోగిస్తున్నామన్నారు. ఇనుము, ఉక్కులను వాడటం లేదన్నారు. రామ జన్మభూమి ఉద్యమం ప్రతి భారతీయునికీ ఆత్మగౌరవం, గర్వకారణంగా నిలిచిందన్నారు.
ఇదిలావుండగా, ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగిన ట్రస్ట్ సమావేశంలో రామాలయం నిర్మాణంపై సమీక్ష జరిగింది. ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి, ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యులు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా, అనిల్ మిశ్రా, నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్, లార్సన్ అండ్ టూబ్రో ప్రతినిధులు పాల్గొన్నారు. 2023నాటికి భక్తులకు శ్రీరాముని దర్శన భాగ్యం కలిగించడం సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ఈ సమావేశం వ్యక్తం చేసింది.
Updated Date - 2021-09-16T22:48:50+05:30 IST