బాండ్ల సాకుతో పెట్రో బాదుడు
ABN, First Publish Date - 2021-09-06T07:51:13+05:30
పెట్రోలియం ఉత్పత్తుల ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదనలో పస లేదని తేలిపోయింది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరుతున్న భారీ ఆదాయమే...
- ఎక్సైజ్ పన్నులతో కేంద్రానికి భారీ రాబడి
- 4 నెలల్లోనే ఖజానాకు లక్ష కోట్లు జమ
- గత ఏడాదితో పోల్చుకుంటే
- ఇప్పటికే రూ.37వేల కోట్లు అదనం
- కేంద్రం వాదనకు భిన్నంగా గణాంకాలు
- స్వల్పంగా తగ్గిన ‘పెట్రో’ ధరలు
- తాలిబాన్ల వల్లే ఇంధన ధరలు పెరిగాయ్
- కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: పెట్రోలియం ఉత్పత్తుల ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదనలో పస లేదని తేలిపోయింది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరుతున్న భారీ ఆదాయమే దీనికి నిదర్శనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలానికి ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రానికి పెట్రోలియం ఉత్పత్తులపై రూ.లక్ష కోట్లకుపైనే ఆదాయం వచ్చింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో జారీచేసిన చమురు బాండ్ల భారం వల్ల ఎక్సైజ్ పన్నును తగ్గించలేకపోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖకే చెందిన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రభుత్వ వాదనకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆయిల్ బాండ్లకు కేంద్రం చెల్లించాల్సింది రూ.10వేల కోట్లు. కానీ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను ద్వారా కేంద్రానికి రూ. లక్ష కోట్లు ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే నాలుగు నెలల కాలానికి వచ్చిన ఆదాయం రూ.67,895 కోట్లు. అంటే రూ.32,492 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది. గత ఏడాదితో పోల్చుకుంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.లక్ష కోట్ల అదనపు ఆదాయం రావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరి ఆదాయం సంగతేంటి?
పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరుతున్న ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే బాండ్ల చెల్లింపులు ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదని అర్థమవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలు, డీజిల్‌పై పన్నుల ద్వారా కేంద్రానికి రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు స్వయానా కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రే జూలైలో చెప్పారు. గత ఏడాది క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ పన్నుల బాదుడుతో పెట్రోలియం ఉత్పతుల ధరలు మాత్రం తగ్గలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గి మళ్లీ క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ఇంధన ధరలకు పట్టపగ్గాల్లేవు. దీనిపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం.
తాలిబాన్ల వల్లే ఇంధన ధరలు పెరిగాయి..!
అఫ్థాన్ సంక్షోభం కారణంగా ముడిచమురు సరఫరా తగ్గి, దేశీయంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని కర్ణాటకలోని హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
స్వల్పంగా తగ్గిన ‘పెట్రో’ ధరలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: ఇంధనాల ధరలు స్పల్పంగా తగ్గాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలను 15 పైసల చొప్పున ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం తగ్గించాయి. ఈ తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.19కు, డీజిల్ ధర రూ.88.62కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.107.26 ఉండగా.. డీజిల్ ధర రూ.96.19గా ఉంది. ఇంధనాల ధరలు అధిక స్థాయిలో ఉండటం వల్ల వాహనాదారులపై అధిక భారం పడుతోంది.
Updated Date - 2021-09-06T07:51:13+05:30 IST