యూపీ పోలీసు దర్యాప్తునకు హాజరవుతా, కానీ... : ట్విటర్ ఇండియా ఎమ్‌డీ
ABN, First Publish Date - 2021-07-07T00:04:43+05:30
అరెస్టు చేయబోమనే హామీ ఇస్తే, తాను ఉత్తర ప్రదేశ్ పోలీసుల సమక్షంలో
బెంగళూరు : అరెస్టు చేయబోమనే హామీ ఇస్తే, తాను ఉత్తర ప్రదేశ్ పోలీసుల సమక్షంలో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు సిద్ధమేనని ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టుకు చెప్పారు. ఆ రాష్ట్రంలోని లోని ప్రాంతంలో ఓ వృద్ధునిపై దాడి తర్వాత ట్విటర్‌లో పోస్ట్ అయిన ట్వీట్లపై పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.
తనపై చేయి వేయబోమని ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఇచ్చే హామీని కోర్టు రికార్డు చేసినట్లయితే, తాను వ్యక్తిగతంగా పోలీసుల సమక్షంలో హాజరవడానికి సిద్ధమేనని మనీశ్ హైకోర్టుకు తెలిపారు. దీనికి పోలీసులు తగిన హామీ ఇవ్వాలన్నారు. మనీశ్ మహేశ్వరి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సీవీ నాగేశ్ మాట్లాడుతూ, మనీశ్ కేవలం ట్విటర్ ఉద్యోగి మాత్రమేనని, ట్విటర్‌ను డైరెక్టర్లు నడుపుతున్నారని, వారి పేర్లు బహిరంగంగా అందుబాటులో ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు. పోలీసులు ఆయనను కంపెనీ ప్రతినిధిగా పేర్కొనరాదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు జరుగుతుందని హైకోర్టు తెలిపింది.
ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా, లోని ప్రాంతంలో ఓ వృద్ధునిపై కొందరు దాడి చేస్తున్నట్లు కనిపించే వీడియో ఇటీవల ట్విటర్‌లో వైరల్ అయింది. ఆ తర్వాత కొందరు దానిపై స్పందిస్తూ ట్వీట్లు చేశారు. దీనిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు జూన్ 15న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ట్విటర్ ఇండియా ఎమ్‌డీ మనీశ్ మహేశ్వరికి నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుపై కర్ణాటక హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఇటీవల తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. మనీశ్ మహేశ్వరిపై నిర్బంధ చర్యలు తీసుకోరాదని ఉత్తర ప్రదేశ్ పోలీసులను ఆదేశిస్తూ జస్టిస్ జీ నరేందర్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
Updated Date - 2021-07-07T00:04:43+05:30 IST