రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు : కర్ణాటక మంత్రి సుధాకర్
ABN, First Publish Date - 2021-06-23T20:09:09+05:30
కర్ణాటకలో ఇద్దరికి నోవల్ కరోనా వైరస్‌కు సంబంధించిన
బెంగళూరు : కర్ణాటకలో ఇద్దరికి నోవల్ కరోనా వైరస్‌కు సంబంధించిన డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు గుర్తించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ చెప్పారు. మైసూరులో ఒకరికి, బెంగళూరులో ఒకరికి ఈ వ్యాధి సోకిందన్నారు. ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలిపామన్నారు.
రాష్ట్రంలో ఈ వేరియంట్ మొదటి కేసు మైసూరులో నిర్థరణ అయినట్లు డాక్టర్ సుధాకర్ చెప్పారు. ఈ వ్యక్తిలో ఈ రోగ లక్షణాలు పైకి కనిపించలేదన్నారు. ఆయనతో సంబందాలు నెరపినవారిలో ఎవరికీ ఈ వ్యాధి సోకలేదని, ఇది శుభసూచిక అని వివరించారు. ఆయనను ఐసొలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. కొత్త వేరియంట్ల రాక గురించి జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆరు జీనోమ్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అనుమానం వచ్చినపుడు జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తున్నామన్నారు. పరీక్షించిన మొత్తం నమూనాల్లో ఐదు శాతం వరకు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో రోజుకు దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డెల్టా ప్లస్ సీక్వెన్సింగ్ ఉన్నట్లు అనుమానం కలిగితే, ఆ ప్రాంతానికి వ్యాక్సిన్లను పంపిస్తున్నామన్నారు.
Updated Date - 2021-06-23T20:09:09+05:30 IST