రాజకీయాల్లోకి సోనూ సూద్ చెల్లెలు
ABN, First Publish Date - 2021-11-15T08:25:12+05:30
బహు భాషా నటుడు సోనూ సూద్ చిన్న చెల్లెలు మాళవిక సూద్ సచార్ (38) రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని సోనూ ఆదివారం
- పంజాబ్‌లోని మోగా నుంచి పోటీ
- మీడియాకు వెల్లడించిన నటుడు
ఛండీగఢ్, నవంబరు 14: బహు భాషా నటుడు సోనూ సూద్ చిన్న చెల్లెలు మాళవిక సూద్ సచార్ (38) రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని సోనూ ఆదివారం తన సోదరితో కలిసి పంజాబ్‌లోని స్వస్థలం మోగాలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఆమె ఏ పార్టీలో చేరేది సమయం వచ్చినప్పుడు చెబుతామని ప్రకటించారు. తనకు మాత్రం రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతానికి సోదరికి మద్దతివ్వడం ముఖ్యమని.. మోగాతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. కాగా, పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మాళవిక.. మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సోనూ సూద్‌కు ఇద్దరు చెల్లెల్లు.
శాస్త్రవేత్త అయిన పెద్ద చెల్లెలు మోనిక అమెరికాలో ఉంటున్నారు. ఇక మాళవిక కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు. తనను సామాజిక కార్యకర్తగా చెప్పుకొంటారు. సోదరుడిలానే సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి ఎక్కువ. ఆరోగ్య రంగంపై శ్రద్ధ చూపుతుంటారు. రాష్ట్రంలో నిరుద్యోగం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. ఉపాధి లేకనే పంజాబ్ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని.. వారికి పని కల్పించడమే లక్ష్యమని చెబుతుంటారు.
Updated Date - 2021-11-15T08:25:12+05:30 IST