గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామే దేశాధ్యక్షుడు
ABN, First Publish Date - 2021-01-10T20:48:09+05:30
మన దేశ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామే దేశాధ్యక్షుడు
న్యూఢిల్లీ : మన దేశ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రికపెర్సద్ సంటోఖి హాజరు కాబోతున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) వర్గాలు ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అంతకుముందు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే బ్రిటన్‌లో కోవిడ్ స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో జాన్సన్ పర్యటన రద్దయింది. దీంతో భారత ప్రభుత్వం సురినామే దేశాధ్యక్షుడిని ఆహ్వానించింది. జనవరి 26న జరిగే ఈ ఉత్సవాలకు హాజరయ్యేందుకు సంటోఖి అంగీకరించినట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి.
దక్షిణ అమెరికా ఈశాన్య తీరంలో సురినామే దేశం ఉంది. చంద్రికపెర్సద్ సంటోఖి భారత సంతతి నేత. ఇటీవలే ఆయన ప్రవాసీ భారతీయ దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంటోఖి కీలకోపన్యాసం ఇచ్చారు.
సంటోఖి 2020 జూలైలో సురినామే దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 51 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ రిఫార్మ్ పార్టీకి 20 స్థానాలు లభించాయి. ఆయన విజయంతో డేసి బౌటెర్సే నియంతృత్వ పాలనకు తెరపడింది. ఈ పార్టీ అత్యధికంగా ఇండియన్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందువల్ల దీనిని యునైటెడ్ హిందుస్థానీ పార్టీ అని కూడా పిలుస్తారు.
సురినామే దేశ జనాభా 5,87,000 కాగా, ఈ జనాభాలో 27.4 శాతం మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. ఇది ఒకప్పటి డచ్ వలస రాజ్యం.
Updated Date - 2021-01-10T20:48:09+05:30 IST