‘ముందస్తు’కు నో ఛాన్స్..
ABN, First Publish Date - 2021-01-01T15:17:58+05:30
అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు
చెన్నై : రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రదసాహు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఈ యేడాది ఏప్రిల్ లేదా మే నెలలో జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. తమిళనాడు సహా పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కూడా ఈ యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో కొత్త ఓటర్ల జాబితా తయారీ ముమ్మరంగా జరిగాయి. జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. అదే సమయంలో ఐదు రాష్ట్రాలకు ఈవీఎంలను తరలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో చెన్నైలో గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రద సాహు మీడియాతో మాట్లాడుతూ, కరోనా లాక్‌డౌన్ నిబంధనల మేరకు ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం వెయ్యి కంటే అధికంగా ఓటర్లు కలిగిన పోలింగ్ బూత్‌ల వివరాలు సేకరిస్తున్నా మని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో 65 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా 95 వేల వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రాలకు అవసరమైన ఈవీఎంలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే చర్యలు చేపట్టామని తెలిపారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కేం ద్రాలకు అవసరమైన ఎన్నికల సిబ్బంది ఎంపిక, వారికి శిక్ష ణ తదితరాలు నిర్వహించాల్సి ఉన్నందువల్ల, ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు అవకాశం లేదని ఆయన స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికలను ఒకే విడతగా జరపాలా? లేక రెండు విడతలుగా జరపాలా? అనే విషయంపై కేంద్రఎన్నికల సంఘం పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు.
Updated Date - 2021-01-01T15:17:58+05:30 IST