కేంద్రాన్ని నడుపుతున్నది రాజకీయ పార్టీ కాదు, కంపెనీ: తికాయత్
ABN, First Publish Date - 2021-07-04T23:34:55+05:30
కేంద్రాన్ని నడుపుతున్నది రాజకీయ పార్టీ కాదని, ఒక కంపెనీ అని భారతీయ కిసాన్..
న్యూఢిల్లీ: కేంద్రాన్ని నడుపుతున్నది రాజకీయ పార్టీ కాదని, ఒక కంపెనీ అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్ అన్నారు. అందువల్లే రైతు ప్రతినిధులను చర్చలకు పిలవడం లేదని విమర్శించారు. హర్యానాలోని రోహ్‌టక్‌లో ఆదివారంనాడు మీడియాతో తికాయిత్ మాట్లాడుతూ, నూతన సాగు చట్టాలను రద్దు చేసేదిలేదని వాళ్లు (ప్రభుత్వం) షరతు పెడుతూనే, చర్చలకు సిద్ధమంటున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఆయన తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
చర్చలకు సిద్ధమని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెబుతున్నప్పటికీ గత ఐదు నెలలుగా తమకు ఎలాంటి సమాచారం లేదని శనివారంనాడు కూడా ఆయన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. పార్లమెంటును ఘెరావ్ చేసే ఆలోచన ఏదీ లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్రంతో మరో విడత చర్చలపై మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని తాము నమ్ముతామని, కానీ, తమతో మాట్లాడే వ్యక్తి నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి కూడా అయి ఉండాలని అన్నారు. ఆందోళనల ముగింపుపై రైతుల వైఖరిపై మరింత స్పష్టతనిస్తూ, తాము ఎక్కడికైనా వెళ్తామని, చలిగాలులు, మండుటెండలు లెక్కచేయని తమకు వర్షాకాలాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం ఉందన్నారు.
Updated Date - 2021-07-04T23:34:55+05:30 IST