బ్యాంకు డిపాజిటర్లకు కేంద్ర కేబినెట్ శుభవార్త!
ABN, First Publish Date - 2021-07-28T23:24:58+05:30
బ్యాంకులు సమస్యల్లో చిక్కుకుని, నగదు అందుబాటులో లేని పరిస్థితి తలెత్తినపుడు
న్యూఢిల్లీ : బ్యాంకులు సమస్యల్లో చిక్కుకుని, నగదు అందుబాటులో లేని పరిస్థితి తలెత్తినపుడు డిపాజిటర్లకు బీమా సదుపాయం కల్పించేందుకు వీలుగా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించబోతోంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్, 1961ను సవరించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బ్యాంకు డిపాజిటర్ల కష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. మారటోరియం ఆంక్షల క్రింద ఉన్న బ్యాంకులకు నగదు అందుబాటులోకి వచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆ బ్యాంకులను లిక్విడేట్ చేసే వరకు డిపాజిటర్లు వేచి చూడవలసిన అవసరం ఈ సవరణ వల్ల తప్పుతుంది. బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలను ఆర్బీఐ నిలిపేసి, నిఘాలో ఉంచినపుడు కూడా ఆ బ్యాంకుల డిపాజిటర్లకు రూ.5 లక్షలు డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్‌ను కేబినెట్ ఆమోదించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం వెల్లడించారు.
డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది పూర్తిగా ఆర్బీఐ అనుబంధ సంస్థ. డిపాజిటర్లకు సొమ్మును బ్యాంకులు చెల్లించలేకపోతే, వారికి ఈ సంస్థ బీమాను అందజేస్తుంది. బ్యాంకు మారటోరియం క్రిందకు వచ్చిన 90 రోజుల్లోగా డిపాజిటర్లకు ఈ బీమా లభిస్తుంది. డిపాజిటర్లకు సకాలంలో అండగా నిలవడం కోసం ఈ సవరణ చేశారు. భారత దేశంలో ఉన్న వాణిజ్య, విదేశీ బ్యాంకులు; సెంట్రల్, స్టేట్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు; రీజనల్ రూరల్ బ్యాంకులు; లోకల్ బ్యాంకుల డిపాజిటర్ల సొమ్ముకు ఈ సంస్థ రక్షణ కల్పిస్తుంది. అయితే ఆయా బ్యాంకులు ఈ సంస్థ పరిధిలోకి వచ్చే అవకాశాన్ని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సేవింగ్స్, కరెంట్, రికరింగ్, ఫిక్స్‌డ్ వంటి అన్ని రకాల డిపాజిట్ హోల్డర్లకు ఈ బీమా సదుపాయం వర్తిస్తుంది. అన్ని రకాల బ్యాంకు డిపాజిట్ అకౌంట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బీమా చేస్తుంది. ఒక బ్యాంకులో ఒక ఖాతాదారుకు రూ.5 లక్షల వరకు ఇటువంటి డిపాజిట్లు ఉంటే, వాటిపై ఈ బీమా సదుపాయం లభిస్తుంది.
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్, యస్ బ్యాంక్, లక్ష్మి విలాస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇటీవల సమస్యల్లో చిక్కుకోవడంతో, డిపాజిటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడం కోసం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ చట్టానికి సవరణ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. ఈ సవరణ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉందని తెలిపారు.
గత ఏడాది పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లకు బీమాను రూ.5 లక్షలకు ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ బీమా రూ.1 లక్ష వరకు ఉండేది.
Updated Date - 2021-07-28T23:24:58+05:30 IST