వాట్సాప్ విధానాలు యూజర్లకు వ్యతిరేకం : కేంద్రం
ABN, First Publish Date - 2021-06-03T18:47:10+05:30
ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ తన యూజర్లకు వ్యతిరేక
న్యూఢిల్లీ : ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ తన యూజర్లకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వాట్సాప్ తన యూజర్లను మాయ చేసి, తన కొత్త ప్రైవసీ పాలసీకి సమ్మతి పొంది, వారికి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ మేరకు తాజా అఫిడవిట్‌ను గురువారం సమర్పించింది.
వాట్సాప్ తన ప్రస్తుత యూజర్లకు తన డిజిటల్ నైపుణ్యాన్ని ప్రదర్శించిందని, అప్‌డేటెడ్ 2021 ప్రైవసీ పాలసీని అంగీకరించాలని వారిని ఒత్తిడి చేస్తోందని, ఈ అప్‌డేటెడ్ ప్రైవసీ పాలసీకి కట్టుబడిన యూజర్లను వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు ఆమోదం పొంది, చట్టంగా మారడానికి ముందే బదిలీ చేయాలని ప్రయత్నిస్తోందని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
అప్‌డేటెడ్ 2021 ప్రైవసీ పాలసీకి సంబంధించి యూజర్లకు ‘పుష్ నోటిఫికేషన్స్’ను పంపడం మానుకోవాలని వాట్సాప్‌నకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. రోజుకు ఎన్ని నోటిఫికేషన్లను యూజర్లకు పంపిస్తోంది? వాటి కన్వర్షన్ రేటు ఎంత? వంటి వివరాలను నమోదు చేసి, సమర్పించాలని ఆదేశించాలని కోరింది. 2021 అప్‌డేటెడ్ ప్రైవసీ పాలసీని అంగీకరించని లక్షలాది మంది యూజర్లకు ప్రతి రోజూ లెక్కలేనన్ని నోటిషికేషన్లను వాట్సాప్ పంపిస్తోందని తెలిపింది. ఈ విధంగా ప్రస్తుత, కొత్త యూజర్లకు నోటిఫికేషన్లను పంపించడం ఇండియన్ కాంపిటీషన్ కమిషన్ మార్చి 24న జారీ చేసిన ఆదేశాల మౌలిక అభిప్రాయానికి విరుద్ధమని వివరించింది.
వాట్సాప్ అప్‌డేటెడ్ ప్రైవసీ పాలసీ, 2021
వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని ఇటీవల అప్‌డేట్ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఈ పాలసీని అంగీకరించినవారి సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు షేర్ చేయడానికి వాట్సాప్‌కు అధికారం లభిస్తుంది. బిజినెస్ అకౌంట్‌తో ఇంటరాక్ట్ అయ్యే యూజర్లకు సంబంధించిన కొంత డేటాను తన పేరెంట్ కంపెనీ అయిన ఫేస్‌బుక్‌కు షేర్ చేస్తామని ఈ పాలసీలో వాట్సాప్ పేర్కొంది. ఈ కొత్త విధానాన్ని జనవరి నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఈ విధానాన్ని అంగీకరించని యూజర్ల ఖాతాలను డిలీట్ చేస్తామని హెచ్చరించింది. అయితే యూజర్లు, ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పాలసీకి అంగీకారాన్ని తెలపడానికి గడువును మే 15 వరకు పొడిగించింది. ఈ కొత్త పాలసీని పూర్తిగా ఉపసంహరించాలని ప్రభుత్వం పట్టుబడుతోంది.
ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ వాట్సాప్ మే 26న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ వేదికపై సందేశాలను మొదట ఎవరు పోస్ట్ చేశారో వెల్లడించాలని కోరుతున్నారని, ఇది భారతీయ చట్టాలు, వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించడమేనని తెలిపింది.
Updated Date - 2021-06-03T18:47:10+05:30 IST