ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇల్లు వదిలి... ప్యారిస్‌లో మెరిసి

ABN, First Publish Date - 2021-08-12T05:30:00+05:30

మొన్నామధ్యన ఫ్రాన్స్‌లో జరిగిన ‘ప్యారిస్‌ హాట్‌ కౌచర్‌ వీక్‌’ గుర్తుందా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొన్నామధ్యన ఫ్రాన్స్‌లో జరిగిన ‘ప్యారిస్‌ హాట్‌ కౌచర్‌ వీక్‌’ గుర్తుందా? ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ షోలో మొట్టమొదటిసారి ఒక భారత మహిళా డిజైనర్‌ తన వస్త్ర శ్రేణులను ప్రదర్శించింది. ఆవిడే వైశాలీ షదాంగులే. 


పదిహేడేళ్లప్పుడు కట్టు బట్టలతో ఇల్లు వదిలిన అమ్మాయి... నేడు ఇంతటి అరుదైన అవకాశం దక్కించుకొనే స్థాయి వరకు ఎదిగింది. ఎలా? వైశాలీ మాటల్లోనే... 


‘‘ఫ్యాషన్‌కు కేరాఫ్‌ ప్యారిస్‌. ఏటా అక్కడ జరిగే ఫ్యాషన్‌ వీక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రత్యక్షంగా అది చూసే అవకాశం వస్తేనే ఎగిరి గంతేస్తారు నాలాంటి డిజైనర్లు. అలాంటిది ఆ షోలో నా కలెక్షన్‌ ప్రదర్శించే అద్భుత అవకాశం దక్కితే..! నా ఆనందానికి హద్దులు లేవు. కలలాంటి ఆ నిజాన్ని నమ్మడానికి నాకు కొంత సమయం పట్టింది. అదీ ఆ గౌరవం దక్కిన మొట్టమొదటి భారత మహిళా డిజైనర్‌ నేనే అంటే గర్వంగా అనిపిస్తోంది. కరోనాతో గత సంవత్సరం ‘ప్యారిస్‌ హాట్‌ కౌచర్‌ వీక్‌’ డిజిటల్‌కే పరిమితమైంది. అయితే ఈ ఏడాది మళ్లీ పాత పద్ధతిలోనే ర్యాంప్‌ వాక్‌లు నిర్వహించారు. అందులో ‘శ్వాస్‌’ పేరుతో నా కలెక్షన్‌ ప్రదర్శించాను. 


విదిశ టు ప్యారిస్‌... 

నా ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. కాలంతో పరిగెడుతూనే... కష్టాలు అనుభవించాను. మధ్యప్రదేశ్‌లోని విదిశ మా ఊరు. ప్రపంచాన్ని చూడాలన్న తాపత్రయంలో పదిహేడేళ్లప్పుడు కట్టుబట్టలతో ఇల్లు వదిలి వచ్చేశాను. ఏదో సాధించాలన్న కలలు తప్ప బయట కాలు పెట్టే సమయంలో నా వద్ద మరేమీ లేవు. నేను నాలుగు గోడల మధ్య పెరిగిన అమ్మాయిని. పెద్ద నగరాలు, పట్టణాలు ఎలా ఉంటాయో తెలియదు. కట్టుబాట్ల పేరుతో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండానే బాల్యం గడిచిపోయింది. మా కుటుంబాల్లో పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసేస్తారు. వాటన్నిటినీ దాటుకుని, నాదైన లోకంలో విహరిం చాలన్న ఆకాంక్షతో ఊరు విడిచినప్పటి నుంచి రోజూ పోరాటం చేయాల్సి వచ్చింది. 


ఐదొందలతో మొదలు... 

మొదట విదిశ నుంచి భోపాల్‌ వెళ్లాను. అప్పటికి ఫ్యాషన్‌, డిజైనింగ్‌ వంటివేవీ నా మదిలో లేవు. నేను కోరుకున్నదల్లా బయటి ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని. భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో దిగి, అక్కడ ఓ హాస్టల్‌కు వెళ్లాను. ఎంతో బతిమాలితే గానీ వారు నాకు ఆశ్రయం ఇవ్వలేదు. తరువాత ఆఫీస్‌ అసిస్టెంట్‌గా చిన్న ఉద్యోగంలో చేరాను. జీతం నెలకు రూ.500. అక్కడ సహోద్యోగులు కొందరు ‘ఏ డ్రెస్‌ వేసుకొంటే బాగుంటుంద’ని పార్టీకో, పబ్‌కో వెళ్లేటప్పుడు నన్ను అడుగుతుండేవారు. నేను చెప్పేవి వారికి నచ్చేవి. ‘నీ టేస్ట్‌ సూపర్‌’ అంటూ తరువాత వచ్చి ధన్యవాదాలు చెప్పేవారు. వారి మాటలు నాకు ప్రోత్సాహాన్నిచ్చాయి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌, స్టయిలింగ్‌ దిశగా ఆలోచించడానికి కారణమయ్యాయి.

 

ముంబయి... వయా వడోదరా... 

ఫ్యాషన్‌ మీద మక్కువ పెరిగింది. కానీ ఇనిస్టిట్యూట్‌కి వెళ్లి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసే ఆర్థిక స్తోమత నాకు లేదు. ఎలాగైనా నేర్చుకోవాలన్న కసితో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థుల వద్దకు వెళ్లి, వాళ్ల మెటీరియల్‌ ఫొటోస్టాట్‌ తీయించుకుని ఇంట్లో చదవడం ప్రారంభించాను. కొంత కాలానికి డిజైనింగ్‌ చేయగలనన్న నమ్మక కలిగింది. అక్కడి నుంచి గుజరాత్‌లోని వడోదరా వెళ్లి చిన్న మొత్తం పెట్టుబడితో డిజైనింగ్‌ మొదలుపెట్టా. అక్కడే ఇలస్ట్రేటర్‌గా ఓ ఉద్యోగం కూడా చేస్తూ కొంత డబ్బు దాచుకున్నాను. ఆ డబ్బు పట్టుకుని 1998లో ముంబయి వెళ్లాను. నా జీవితంలో అదో పెద్ద సాహసమనే చెప్పాలి.


మూడు నాలుగు జీవితాల్లా...  

ముంబయి వెళ్లిన తరువాత డిజైనర్‌గా ప్రయత్నాలు ముమ్మరం చేశాను. అవకాశాలు దొరకబుచ్చుకోవడం అంత సులువు కాదని తెలుసు. అందుకే పూర్తిగా డిజైనింగ్‌ వృత్తిపైనే ఆధారపడుకుండా మరో వైపు ఉద్యోగం కూడా చేశాను. ఏ పని ఇస్తే ఆ పని చేసుకొంటూ పోయాను. కొంత కాలం ఓ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌లో డిజైనర్‌గా ఉన్నాను. సాయంత్రం వేళల్లో జిమ్‌ ట్రైనర్‌గా చేశాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకొంటే నాడు నేను మూడు నాలుగు జీవితాలు గడిపినట్టు అనిపిస్తుంది. 


కలకు రూపం... 

ముంబయి వెళ్లిన రెండేళ్లకు నా కలకు రూపం ఇవ్వగలిగాను. దాచుకున్న డబ్బుతో పాటు యాభై వేల రూపాయలు బ్యాంకు రుణం తీసుకుని మలాద్‌ ప్రాంతంలో ఒక బొటిక్‌ ప్రారంభించాను. చాలా ఇరుగ్గా ఉండే షాప్‌ అది. అయితే ‘ఇది నా సొంతం’ అనే అనుభూతి ఎంతో సంతృప్తినిచ్చింది. చందేరీ మెటీరియల్‌తో బ్లౌజ్‌లు కుట్టేదాన్ని. వాటికి మంచి ఆదరణ లభించింది. అది మొదలు ఇక వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. పదేళ్లలో మరో రెండు బొటిక్‌లు ఏర్పాటు చేశాను. ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నాను. అప్పుడు ఢిల్లీ వెళ్లి మంచి ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చదివాను. నాకప్పుడు ఏడాదిన్నర పాప ఉంది. తనని తీసుకువెళ్లి కోర్సు పూర్తి చేశాను. వెంటనే పీజీ కోసం మిలాన్‌ వెళ్లాను. ఇవన్నీ డిజైనింగ్‌ కొనసాగిస్తూ... ఇంటిని, కూతుర్ని చూసుకొంటూ సాధించాను. నా కుటుంబం, స్నేహితుల సహకారం వల్లే ఇది సాధ్యమైంది. 


అదే పెద్ద మలుపు... 

అయితే కెరీర్‌ని పెద్ద మలుపు తిప్పింది మాత్రం 2011 ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’లో నా కలెక్షన్‌ ప్రదర్శన. రొటీన్‌కు భిన్నంగా, ప్రకృతికి దగ్గరగా నేను చేసిన డిజైన్లు క్లిక్‌ అయ్యాయి. తరువాత ‘న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌’లో పాల్గొన్నాను. అప్పటి వరకు దూరంగా ఉన్న అమ్మా నాన్నలు తిరిగి దగ్గరయ్యారు. ‘చేత్తో నేసిన దుస్తులకు ఉన్న అందం మరెందులోనూ రాదు’ అంటూ అమ్మ చెప్పిన మాటలు నా డిజైన్లకు స్ఫూర్తి మంత్రాలయ్యాయి. ఇన్నేళ్ల నా శ్రమకు తగిన ఫలితమే ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొనే అవకాశం. అక్కడ కూడా చెట్లు, కొమ్మలు, ఆకులు కాన్సెప్ట్‌గా తీసుకుని రూపొందించిన కలెక్షన్‌నే ప్రదర్శించాను. ఎక్కడ విదిశ..! ఎక్కడ ప్యారిస్‌..! ఒక సాధారణ అమ్మాయి తన కలల వెంట పరుగెడుతూ నేడు ఈ స్థాయికి వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. సడలని సంకల్పం... కష్టాలకు తల వొగ్గని నైజం... ఇవే నన్ను ఇవాళ ఇక్కడ నిలబెట్టాయి. 

Updated Date - 2021-08-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising