17 ఏళ్లకే కరోకే తరహా విద్యాబోధన
ABN, First Publish Date - 2021-07-31T05:30:00+05:30
కొవిడ్ పాండమిక్‌తో బడులు మూతపడ్డాయి. ఆన్‌లైన్ క్లాసులు సర్వసాధారణమైపోయాయి. అలవాటు లేని ఈ భిన్న విద్యావిధానం అటు పిల్లలకూ, ఇటు తల్లితండ్రులకూ ఇబ్బందిగా మారింది.
పిల్లలు చదువును మించి గ్యాడ్జెట్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఆన్‌లైన్ క్లాసులకు సాంకేతికత జోడించి, పిల్లలను చదువు వైపు ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టిందో అమ్మాయి. వాటిలో భాగంగా ‘రీడ్ టు గెదర్’ అనే ఆన్‌లైన్ టీచింగ్ ప్లాట్‌ఫాంను రూపొందించి, దాన్లో కరోకే విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థులను పాఠాల వైపు ఆకర్షిస్తోంది. 17 ఏళ్ల ఆ యువ బోధకురాలే, ఢిల్లీకి చెందిన ఆర్ష్యా గౌర్!
కొవిడ్ పాండమిక్‌తో బడులు మూతపడ్డాయి. ఆన్‌లైన్ క్లాసులు సర్వసాధారణమైపోయాయి. అలవాటు లేని ఈ భిన్న విద్యావిధానం అటు పిల్లలకూ, ఇటు తల్లితండ్రులకూ ఇబ్బందిగా మారింది. ఆన్‌లైన్ పాఠాల పట్ల పిల్లలు ఆసక్తి కోల్పోవడంతో పాటు స్ర్కీన్ ఫెటీగ్ లాంటి ఇబ్బందులు సర్వత్రా మామూలైపోయాయి. ఇలాంటి పరిస్థితిలో 14 ఏళ్లకే బోధనావృత్తిలోకి ప్రవేశించిన ఆర్ష్యా గౌర్, పిల్లలను పాఠాల వైపు ఆకర్షించే మార్గాల కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. న్యూఢిల్లీకి చెందిన ఈ అమ్మాయికి విద్యాబోధన అంటే మక్కువ. దాంతో 14 ఏళ్ల నుంచే తన ఇంటికి దగ్గర్లోని కుసుమ్ పహారిలోని మురికివాడల పిల్లలకు విద్యాబోధన మొదలుపెట్టింది. పాండమిక్ సమయంలో ఆమె టీచింగ్‌కు అడ్డంకి ఏర్పడడంతో, ఆ పరిస్థితిని ఓ సవాలుగా తీసుకుంది.
రీడ్ టు గెదర్
వసంత్ వ్యాలీ స్కూల్‌లో చదువుకున్న ఆర్ష్యా పిల్లలకు చదువును చేరువ చేయగల భిన్నమైన మార్గాన్వేషణకు పూనుకుంది. తన ప్రయత్నాల గురించి వివరిస్తూ... ‘‘పనులన్నీ ఆన్‌లైన్ ఆధారంగా జరుగుతునప్పుడు, ప్రపంచమంతా సాంకేతికత సాయంతోనే మనుగడ సాగిస్తుంది. అలాంటిదే పాండమిక్ సమయంలో ఆన్‌లైన్ విద్యాబోధన కూడా. అయితే సాంకేతికత కేవలం ఆన్‌లైన్ బోధనకే పరిమితం అయిపోతే సరిపోదు. పిల్లల ఆసక్తిని చూరగొనాలంటే దానికి మరికొంత సాంకేతికత జోడించడం అవసరం. ఈ తరం పిల్లలు డిజిటల్ మీడియాకు ఎంతో తేలికగా అలవాటు పడిపోతున్నారు. ఆ లక్షణం వాళ్లకు సహజసిద్ధంగానే అలవడుతోంది. కాబట్టి ఆ మార్గంలో పాఠాలను నేర్పించే మాధ్యమంగా కారయోకే తరహా విధానాన్ని ఎంచుకున్నాను. అందుకోసం ‘రీడ్ టు గెదర్’ అనే ఆన్‌లైన్ టీచింగ్ ప్లాట్‌ఫాంను రూపొందించాను. ఈ విధానంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే మీడియా సంగీతంతో పాటు ఒకరి తర్వాత ఒకరుగా పాఠాలు చదవవలసి ఉంటుంది. పాటలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా కరోకే విధానాన్ని పాఠాలకూ ఉపయోగించుకుని, పిల్లల్లో హుషారును పెంచవచ్చు’’ అంటూ చెప్తోంది ఆర్ష్యా. నవంబరు, 2020లో రూపొందిన ఈ ప్లాట్‌ఫాంలో మొదటి తరగతి నుంచి ఐదవ తరగతి వరకూ ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌కు చెందిన 70 చాప్టర్లు ఉంటాయి. ఇవన్నీ ఆడియో విజువల్ ఫార్మాట్‌లో ఉంటాయి. అయితే ఆర్ష్యా ప్రయత్నానికి ప్రారంభంలో దక్కిన మద్దతు అంతంత మాత్రమే!
సవాళ్లు బోలెడు!
రీడ్ టు గెదర్ కంటెంట్ సేకరణ కోసం మూడు నెలల సమయం పడితే, ఆ వెబ్‌సైట్‌ను స్కూళ్లకు పరిచయం చేసి, వారి ఆమోదం పొందడానికి ఆర్ష్యాకు అంతకంటే ఎంతో ఎక్కువ కాలమే పట్టింది. ఆ తరహా విద్యాబోధనను ఆమోదించే స్కూళ్లను గుర్తించి, వాళ్లకు వివరించి, ఒప్పించే క్రమంలో ఆర్ష్యాకు మరో అడ్డంకి ఎదురైంది. తన ప్రోగ్రాం అర్థం చేసుకోగలిగినా, దాన్ని వాడుకునే సౌలభ్యం అందరు పిల్లలకూ లేకపోవడాన్ని ఆమె గమనించింది. అలాంటప్పుడు తన ప్రోగ్రాం లక్ష్యం నెరవేరదనే ఆలోచనతో పిల్లలకు ఉచితంగా ట్యాబ్లెట్స్ పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ‘కెట్టో’ ద్వారా 10 లక్షలు సేకరించింది. అలాగే అంబా దాల్మియా అనే స్వచ్ఛంద సంస్థ అందించిన 30 ట్యాబ్లెట్లు కూడా ఆమెకు తోడ్పడ్డాయి. అలా మురికివాడల పిల్లలకు ఉచితంగా ట్యాబ్లెట్లను అందించి రీడ్ టు గెదర్ లక్ష్యాన్ని అందుకోగలిగింది. ఆ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ.... ‘‘తేలికగా అర్థమవడానికి వీలుగా చదివే వేగాన్ని సరిచూసుకోవడం, పాఠాల్లోని బొమ్మల బ్రైట్‌నెస్, ఆ బొమ్మలకు తగిన ఆడియోకు సంబంధించిన సమస్యలు ప్రారంభంలో ఎదురయ్యాయి. స్వయంగా రూపొందించిన ప్రోగ్రామ్‌ను మార్కెటింగ్ చేసే సమయంలో నా వయసే నాకు అడ్డంకిగా మారింది. నా వయసు 17 ఏళ్లే కావడంతో ఎవరూ నా పనికి అంత ప్రాధాన్యం ఇచ్చేవారు కారు. ఆ పరిస్థితిలో ప్రొఫెషనల్‌గా వ్యవహరించడంలో నా తల్లితండ్రులు తోడ్పడ్డారు. అలాగే నా ప్రోగ్రాంను వీడియో కాన్ఫెరెన్స్‌లో వివరిస్తే అర్థం కాదు. కాబట్టి స్వయంగా స్కూళ్లకు వెళ్లి వివరించేదాన్ని. అలా 2020లో 8 స్కూళ్లను సందర్శిస్తే, వాటిలో రెండు స్కూళ్ల యాజమాన్యాలే సుముఖత వ్యక్తం చేశాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఐదు స్కూళ్లు ఆసక్తి కనబరచడం ఆనందంగా ఉంది. రీడ్ టు గెదర్ ప్రోగ్రాంకు మున్ముందు మరింత ఆదరణ దక్కుతుందనే ఆశపడుతున్నాను’’ అని వివరిస్తోంది ఆర్ష్యా.
విద్యా రంగంలో వినూత్న పోకడలకు తెరతీసిని యువ బోధకురాలిగా పేరు తెచ్చుకున్న ఆర్ష్యా పిల్లల్లో తలెత్తే మానసిక సమస్యల పట్ల అవగాహన కల్పించే బాధ్యతను కూడా చేపట్టింది. బాల్యంలో బొద్దుగా ఉండే ఆర్ష్యా, అప్పట్లో తోటి పిల్లల నుంచి తానెదుర్కొన్న హేళననూ, ఆ ప్రభావంతో తనలో తలెత్తిన మానసిక సమస్యల గురించి కూడా వివరిస్తోంది. ‘‘బాల్యంలో ఎదుర్కొనే ఎగతాళి, హేళనలు చిన్న విషయాలుగా అనిపించినా, అవి పిల్లల లేత మనసులపై బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నా మటుకు నేను ఆత్మన్యూనతకు లోనై, ఆహారం తీసుకోలేని అనొరెక్సియా అనే మానసిక రుగ్మతతో పాటు మానసిక కుంగుబాటుకు కూడా లోనయ్యాను. చాలా చిన్న వయసులోనే ఈ రెండు సమస్యలతో పోరాడాను. ఈ సమస్యలకు గురైన పిల్లలు నిశ్శబ్దంగా లోలోపలే బాధపడతారే తప్ప, బయటకు చెప్పడానికి ఇష్టపడరు. సాధారణంగా పిల్లలు ఇలాంటి సమస్యల గురించి ఏకరువు పెట్టినప్పుడు, పెద్దలు వాళ్ల మాటలను ఖాతరు చేయరు. ఎక్కువ ఇళ్లలో ఇదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య పట్ల కూడా పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఉంటాను.’’
Updated Date - 2021-07-31T05:30:00+05:30 IST