ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతడిది విల్‌చైర్‌

ABN, First Publish Date - 2021-02-10T07:28:27+05:30

ఆత్మవిశ్వాసానికి అసలైన అర్థం అతడు. పదిహేనేళ్లకే కేన్సర్‌ వెన్నెముకను తినేసినా... వెన్ను చూపని ధీశాలి అతడు. చక్రాల కుర్చీలో కూర్చొని అంతర్జాతీయ బాడీబిల్డర్‌ కావాలన్న కలను నిజం చేసుకున్నాడు. చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణంలా పతకాలు పట్టి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మవిశ్వాసానికి అసలైన అర్థం అతడు. పదిహేనేళ్లకే కేన్సర్‌ వెన్నెముకను తినేసినా... వెన్ను చూపని ధీశాలి అతడు. చక్రాల కుర్చీలో కూర్చొని అంతర్జాతీయ బాడీబిల్డర్‌ కావాలన్న కలను నిజం చేసుకున్నాడు. చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణంలా పతకాలు పట్టి... జన హృదయాలు గెలిచి... స్ఫూర్తి రగిలిస్తున్న పంజాబ్‌ బాడీబిల్డర్‌ ఆర్నాల్డ్‌ ఆనంద్‌ ‘లైఫ్‌ లైన్‌’ ఇది... 


అమెరికాలోని ‘లాస్‌ వెగాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’. ఎముకలు కొరికే చలి. చక్రాల కుర్చీలో ఆర్నాల్డ్‌ ఆనంద్‌. ‘మిస్టర్‌ ఒలింపియా’ సమరం... వీల్‌చైర్‌ విభాగంలో పోటీ. ఎన్నడూ లేని ఉత్కంఠ. అంత చలిలోనూ అతడి అరచేతులకు చెమటలు పడుతున్నాయి. ప్రధాన టైటిల్‌ గెలవలేదు. మరి ఆ చెమటలెందుకు! అది అతడి జీవితంలోనే ఊహించని ఘట్టం. స్టేడియం అంతా ఆర్నాల్డ్‌ పేరు జపిస్తుంటే... భావోద్వేగంతో అతడి కళ్లు చమర్చాయి. ‘‘అది 2018. ‘నువ్వు బాడీబిల్డింగ్‌ పోటీల కోసం అమెరికా వెళతావ’ని పదేళ్ల కిందట ఎవరైనా చెప్పి ఉంటే నమ్మేవాడినే కాను. వారిని చూసి నవ్వేవాడిని. నాపై నేనే జాలిపడేవాడిని. ఆ క్షణం తలుచుకుంటే ఇప్పటికీ నా నరాల్లో పాదరసం ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతుంది. నా జీవితానికి సరికొత్త అర్థాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందా పోటీ’’ అంటాడు ఆర్నాల్డ్‌. 


అన్నయ్యను చూసి... 

పంజాబ్‌లోని లుథియానా ఆర్నాల్డ్‌ సొంత పట్టణం. అతడి తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో చేసి రిటైర్‌ అయ్యారు. అన్నయ్య బాడీబిల్డర్‌. అతడిని చూసే ఆర్నాల్డ్‌ కూడా బాడీబిల్డర్‌ కావాలనుకున్నాడు. పదమూడేళ్ల వయసులో జిమ్‌కు వెళ్లి కఠినమైన కసరత్తులు మొదలుపెట్టాడు. చిన్న చిన్న ఈవెంట్స్‌లో పోటీపడేవాడు. ఏడాది తిరక్కుండానే ‘గోల్డెన్‌ లుథియానా’ టైటిల్‌ గెలచుకుని స్థానికంగా పేరు సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ బాడీబిల్డర్‌ కావాలనేది అతడి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. దాని కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. స్నేహితులు కూడా అతడి వద్ద శిక్షణ తీసుకొనేవారు. ఆ సమయంలో ఓ కుదుపు... వ్యాయామం చేస్తుంటే వెన్నెముకలో నొప్పి. ఏదో చిన్నపాటి సమస్య అనుకున్నాడు. పట్టించుకోలేదు. కానీ రాను రాను నొప్పి తీవ్రమవుతోంది.  


కల చెదిరింది... 

వర్కవుట్స్‌ చేస్తున్నప్పుడే నొప్పి వస్తుండడంతో ఆ ఇబ్బంది అంతవరకే అనుకున్నాడు ఆర్నాల్డ్‌. అలా రెండేళ్లు బాధపడుతూనే నెట్టుకొచ్చాడు. ఇక తనవల్ల కాలేదు. వైద్యుడి వద్దకు వెళ్లాడు. పరీక్షలు చేస్తే స్పైనల్‌ కేన్సర్‌ అని తేలింది. అతడి గుండెల్లో బాంబు పేలినట్టయ్యింది. ‘‘నా వెన్నెముకను ఎవరో కట్‌ చేస్తున్నట్టు ఆ రోజు రాత్రి భరించలేని నొప్పి అనుభవించాను. ఆసుపత్రికి వెళితే... కేన్సర్‌ ఫైనల్‌ స్టేజీలో ఉందన్నారు. వెంటనే సర్జరీ చేయకపోతే ఏడాది కంటే ఎక్కువ బతకనని చెప్పారు. సర్జరీ నా జీవితాన్నయితే నిలబెట్టింది. కానీ నన్ను చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. కదలలేను. కనీసం నా అంతట నేను తినలేను... తాగలేను. కలలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి’’... ఆ రాత్రి గుర్తుకువస్తే చాలు గుండెల్ని పిండేసిన అనుభూతి అతడిలో! 


అండగా కుటుంబం... స్నేహం...  

కానీ ఆ పీడకల నుంచి బయటపడటానికి ఆర్నాల్డ్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అతడి తల్లితండ్రులు, అన్నయ్య, ఇతర కుటుంబ సభ్యులు ఏ రోజూ ఆ బాధ తెలియనివ్వలేదు. జాలిపడుతూ కూర్చోకుండా ఫిజియోథెరపిస్ట్‌ దగ్గరకు తీసుకువెళ్లారు. ఎలాగైనా బాడీబిల్డర్‌ కావాలన్న ఆర్నాల్డ్‌ను కలను నిజం చేయాలనేది వారి సంకల్పం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతడి చిన్ననాటి స్నేహితుడు అమిత్‌ గిల్‌ కొండంత అండగా నిలిచాడు. రోజూ ఇంటికి వచ్చి, కావల్సినవన్నీ చూసుకునేవాడు. తన మిత్రుడిని తిరిగి జిమ్‌కు తీసుకువెళ్లాలనేది అమిత్‌ లక్ష్యం. ‘‘ఆర్నాల్డ్‌ ఏంటో నాకు బాగా తెలుసు. వాడు నా సోదర సమానుడు. అలాంటప్పుడు వాడి కల నా కలే అవుతుంది కదా! వాడిని ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు నేనూ తట్టుకోలేకపోయాను. కానీ ముఖంలో ఆ బాధ కనిపించనిచ్చేవాడిని కాదు. ఇప్పుడు వాడి విజయాలు చూస్తుంటే నేనే గెలిచినంత గర్వంగా ఉంటుంది’’ అంటూ అమిత్‌ నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు. 


నొప్పి భరిస్తూనే... 

ఓ మిట్టమధ్యాహ్నం వేళ ఆర్నాల్డ్‌ను తన బైక్‌పై కూర్చొబెట్టి జిమ్‌కు బయలుదేరాడు అమిత్‌. వెళ్లే దారిలో తన పాత రోజులు గుర్తు చేసుకొంటూ తనకు తాను ధైర్యం తెచ్చుకొనే ప్రయత్నం చేశాడు ఆర్నాల్డ్‌. ‘‘జిమ్‌లోకి వెళ్లగానే నాకు ఒక్కసారిగా శక్తి వచ్చినట్టయింది. అక్కడ వ్యాయామం చేసేవారిని చూసి నాలో మునిపటి ఉత్సాహం ఆవహించింది. తరువాతి రోజే కసరత్తులు ప్రారంభించాను. ఆరు నెలలు గిర్రున తిరిగాయి. క్రమంగా నాలో ఆత్మస్థైర్యమే కాదు నా కండలు, సామర్థ్యం కూడా పెరిగాయి. నొప్పిపై కాకుండా వర్కవుట్స్‌పైనే దృష్టి పెట్టాను. కోచ్‌ రవి పరాశర్‌ శిక్షణలో బాడీబిల్డింగ్‌ ప్రారంభించాను. నా శరీరం సహకరించడం మొదలుపెట్టింది. నాకు ఇరవై ఏళ్లు వచ్చేసరికి పోటీల్లో పాల్గొన్నాను’’ అని నాటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడో వివరించాడు ఆర్నాల్డ్‌. 


ఎముకలు బలహీనపడినా... 

చికిత్స తరువాత రెండు నెలలకోసారి ఆర్నాల్డ్‌ భరించలేని నొప్పితో బాధపడేవాడు. కేన్సర్‌ కొన్ని ఎముకలను బలహీనపరిచింది. వాటి స్థానంలో సిమెంట్‌ బోన్స్‌ అమర్చారు వైద్యులు. అయితే అధికంగా వ్యాయామం చేసినప్పుడు, ప్రయాణించినప్పుడు ఆ ఎముకలు పక్కకు జరిగేవి. దానివల్ల విపరీతమైన నొప్పి. కానీ అవేవీ అతడు లెక్కచేయలేదు. ఆహార నియమాలు కచ్చితంగా అనుసరిస్తూ వాటిని జయించాడు. 




ఇప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్‌... 

అతడి పదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఫిట్‌నెస్‌ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. మోడల్‌గా ఎదిగాడు. సినిమాలు, ప్రకటనల్లో నటించాడు. అతడి జీవితాన్ని తెరకెక్కిస్తున్న ఓ నిర్మాతతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎంతోమంది చిన్నారులను తనలా తీర్చిదిద్దేందుకు శిక్షణనిస్తున్నాడు. వైద్యులు కుర్చీలో కదలడమే కష్టమన్నా... శరీరం సహకరించకపోయినా... ఆర్నాల్డ్‌ కుంగిపోలేదు. అచంచల ఆత్మవిశ్వాసం, ఎంతటి సవాలునైనా స్వీకరించే తత్వం... ఇవే అతడిని నేడు ఈ స్థాయిలో నిలబెట్టాయి. 




అపురూప విజయాలు... 

‘‘సంకల్ప బలం ఉంటే ఏ రోగం, ఏ పరిస్థితీ, ఏ సమస్యా మనల్ని ఆపదు’’ అంటున్న ఆర్నాల్డ్‌ అన్నింటినీ జయించి భారత తొలి వీల్‌చైర్‌ బాడీబిల్డర్‌గా అవతరించాడు. ‘మిస్టర్‌ ఇండియా, మిస్టర్‌ పంజాబ్‌, మిస్టర్‌ నార్త్‌ ఇండియా’ వంటి నలభైకి పైగా టైటిల్స్‌ గెలిచాడు. అమెరికా(2018)లో జరిగిన ప్రతిష్టాత్మక ‘మిస్టర్‌ ఒలింపియా’కు, ఆ తరువాత సంవత్సరం కెనడాలో నిర్వహించిన ‘ప్రో సూపర్‌ టొరంటో’ పోటీలకు అర్హత సాధించి అబ్బురపరిచాడు. ఆర్నాల్డ్‌ ప్రయాణాన్ని చూసి స్ఫూర్తి పొందిన ప్రముఖ రచయిత అలెన్‌ ఉడ్‌మ్యాన్‌ ‘వెయిట్‌లెస్‌: ఎ ట్రూ స్టోరీ ఆఫ్‌ కరేజ్‌ అండ్‌ ఇనిస్పిరేషన్‌’ పేరిట ఒక పుస్తకాన్ని రాశారు.

Updated Date - 2021-02-10T07:28:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising