టాటూల్లో అతడిది తారస్థాయి
ABN, First Publish Date - 2021-03-24T08:11:44+05:30
సినిమాలో హీరో... కష్టం వచ్చినప్పుడు... కుటుంబ భారమంతా తనపైనే పడినప్పుడు ఏంచేస్తాడు? పొద్దున్నే పేపర్ వేస్తాడు. ఆ తరువాత హోటల్లో కప్పులు కడుగుతాడు...
- సినిమాలో హీరో... కష్టం వచ్చినప్పుడు... కుటుంబ భారమంతా తనపైనే పడినప్పుడు ఏంచేస్తాడు? పొద్దున్నే పేపర్ వేస్తాడు. ఆ తరువాత హోటల్లో కప్పులు కడుగుతాడు. లేదంటే ఏ క్వారీలోనో బరువైన బొచ్చలు మోస్తాడు. సాయంత్రం ఇంకెక్కడో పనిచేస్తాడు. అది రీల్ లైఫ్. ఢిల్లీ యువకుడు లోకేష్ వర్మ జీవితం దాన్ని తలపిస్తుంది. ఒకప్పుడు రోజులో నాలుగైదు చోట్ల పనిచేసిన అతడు... నేడు సెలబ్రిటీల టాటూ ఆర్టిస్ట్ స్థాయికి ఎదిగాడు. ఎలా? అతడి రియల్ లైఫ్ కథ ‘యంగ్’ కోసం...
గిన్నిస్ రికార్డ్...
ఒక మనిషి శరీరంపై అత్యధిక జెండాల టాటూలు వేసినందుకు గానూ లోకేష్ వర్మ టీమ్ గిన్నిస్ రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. అంతేకాదు... ప్రపంచంలోనే మొట్టమొదటి టాటూ యూనివర్సిటీ ‘అకాడమీ టై పోలో’ గౌరవ ఉపన్యాసం ఇచ్చిన తొలి ఆసియా కళాకారుడు లోకేష్ వర్మ. అతడు ఇప్పుడు వంద మందికి పైగా ఔత్సాహికులకు టాటూ శిక్షణ ఇస్తున్నాడు. నెలకు ఎనిమిది టాటూలకు మించని అతడి వ్యాపారం ఇప్పుడు ఆరు వందలకు తగ్గకుండా సాగిపోతోంది.
లోకేష్ వర్మ... బాలీవుడ్ తారలకే కాదు... భారత క్రికెటర్లకూ హాట్ ఫేవరెట్. అతడి టాటూలంటే వాళ్లకంత క్రేజ్. ఇక్కడే కాదు... విదేశాల్లో కూడా లోకేష్‌తో టాటూలు వేయించుకోవాలనుకొనేవారు చాలామందే ఉన్నారు. అందుకే అతడు పదిహేడు దేశాలకు పైగా చుట్టివచ్చాడు. భారత్‌లోనే అతిపెద్ద టాటూ కన్వెన్షన్... ‘హార్ట్‌వర్క్ టాటూ ఫెస్టివల్’కు సహవ్యవస్థాపకుడు కూడా! ఒక సామాన్య దిగువ మధ్యతరగతి పిల్లవాడికి ఇదంతా ఎలా సాధ్యమైందని అడిగితే మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే కానిదేదీ లేదంటాడు అతడు. నిజమే..! లోకేష్ వాళ్ల నాన్న ఆర్మీలో జవాన్. తల్లి కొంత కాలం ఓ స్కూల్లో టీచర్‌గా చేసి మానేశారు. ఇల్లు, ఉద్యోగం... రెండూ కుదరక కుటుంబానికే అంకితమయ్యారు. తినడానికి, ఉండడానికి ఇబ్బంది లేదు. లోకేష్ జీవితం సంతోషంగానే సాగిపోతుంది. అయితే తనకు నచ్చినది ఏదైనా చెయ్యాలన్నా, కొనుక్కోవాలన్నా డబ్బు సర్దలేని పరిస్థితి వాళ్ల నాన్నది. ఇదే అతడి దృక్పథాన్ని మార్చింది.
స్కూలు అవ్వగానే ఉద్యోగం...
ఇంటి గురించి తెలిసి తన అవసరాల కోసం నాన్నను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు లోకేష్. ‘‘స్కూల్‌కు వెళ్లే రోజుల్లో అమ్మ నా పాకెట్ మనీ కింద నెలకు వంద రూపాయలు ఇచ్చేది. ఆ వందలన్నీ పోగేసి ఏడాది చివరల్లో తిరిగి అమ్మకే ఇచ్చేసేవాడిని. కుటుంబాన్ని నడపడానికి నాకంటే అమ్మకే డబ్బు అవసరం ఎక్కువ కదా! పన్నెండో తరగతి పరీక్షలు అయిన మరుసటి రోజే ఉపాధి మార్గంలో పడ్డాను. వీధుల్లో కరపత్రాలు పంచిపెట్టాను. ఇంటింటికీ వెళ్లి డయల్‌అప్ ఇంటర్నెట్ సీడీలు అమ్మాను. అదే సమయంలో బీకాంలో చేరాను. చదువుకొంటూనే ఇవన్నీ చేశాను. అలా సంపాదించిన డబ్బుతో బెంగళూరులో మార్కెటింగ్‌లో పీజీ చదివాను’’ అంటూ చెప్పుకొచ్చాడు లోకేష్.
రోజుకు నాలుగైదు పాత్రలు...
పీజీ చదువుతూ ఖాళీ సమయంలో లోకేష్ వర్మ రకరకాల ఉద్యోగాలు చేశాడు. ‘‘తెల్లవారుజామునే వెళ్లి మెక్‌డొనాల్డ్‌లో ఫ్లోర్లు తుడిచేవాడిని. మరుగుదొడ్లు కడిగేవాడిని. బర్గర్లు చేసేవాడిని. ఆ పని అవ్వగానే ఇళ్లకు వెళ్లి సీడీలు ఇవ్వడం. చకచకా ఇవన్నీ పూర్తి చేసి కాలేజీకి వెళ్లేవాడిని. ఇక రాత్రిపూట స్థానిక బార్‌లో డీజేగా ప్రదర్శన. డబ్బు సంపాదించడం కోసం నిజాయతీగా ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉండేవాడిని’’ అంటూ లోకేష్ వర్మ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
యూట్యూబ్‌లో చూసి...
రోజులు గిర్రున తిరిగాయి. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసే అలవాటు ఉన్న లోకేష్... పధ్నాలుగేళ్ల వయసులో జపాన్‌లో జరిగిన ఆసియా స్థాయి పెయింటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. మొదటి బహుమతి గెలుచుకున్నాడు. కానీ డ్రాయింగ్‌ను అతడు ఏ రోజూ పెద్దగా పట్టించుకోలేదు. అందులో ఏదో సాధించాలని కలలు కనలేదు. అయితే అతడికి టాటూలంటే పిచ్చి. కాలేజీ రోజుల్లో ఖాళీ దొరికినప్పుడు టాటూలు వేయడం సాధన చేసేవాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి మెళకువలు నేర్చుకున్నాడు. అతడికి పుర్రెలు, ఎముకల డ్రాయింగ్స్ బాగా ఇష్టం. దాచుకున్న డబ్బులతో టాటూ మిషన్ కొన్నాడు. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా అతడికి తెలియదు. ఎలాగో కుస్తీలు పట్టి మొదట తన తండ్రి చేతిపై పెద్ద సైజు పుర్రె బొమ్మ వేశాడు. అది అద్భుతంగా రావడంతో ఇక స్నేహితుల శరీరాలపై ప్రయోగాలు మొదలుపెట్టాడు.
సొంతంగా స్టూడియో...
టాటూ ఆర్టిస్ట్‌గా లోకేష్ తెలిసిన వారందరికీ పరిచయమయ్యాడు. దీంతో స్నేహితుడి ఇంట్లో స్టూడియో ఒకటి ప్రారంభించాడు. మంచి పేరు వచ్చింది. విదేశాలకు వెళ్లి అక్కడి పేరు పొందిన ఆర్టిస్ట్ వద్ద తన కళకు మెరుగులు అద్దుకున్నాడు. ఆ తరువాత ఆ సెలూన్ మూసేసి భారీ ఎత్తున ‘డెవిల్స్ టాటూజ్’ పేరిట కొత్త స్టూడియో నెలకొల్పాడు. తాప్పీ, స్వరా భాస్కర్, రెమో డిసౌజా వంటి బాలీవుడ్ స్టార్లు, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తదితర భారత క్రికెటర్లు లోకేష్ క్లయింట్స్. ఒకప్పుడు డబ్బులు ఎదురిచ్చి మరీ మిత్రులకు టాటూలు వేసే అతడు నేడు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఢిల్లీలోనే మరో బ్రాంచ్ కూడా తెరిచాడు. ఇప్పుడు అతని వద్ద పదిహేను మంది చేయి తిరిగిన టూటూ ఆర్టిస్ట్‌ల బృందం ఉంది.
Updated Date - 2021-03-24T08:11:44+05:30 IST