2020లో జాబ్ పోతే...
ABN, First Publish Date - 2021-01-13T05:55:59+05:30
‘పెళ్లయ్యాక ఫ్రీడమ్ పోవడం... జాబ్ పోయాక మర్యాద పోవడం ఇంటి రాజ్యాంగంలో రూల్స్’... ఇది ఎవరో పెద్దల మాట
‘పెళ్లయ్యాక ఫ్రీడమ్ పోవడం... జాబ్ పోయాక మర్యాద పోవడం ఇంటి రాజ్యాంగంలో రూల్స్’... ఇది ఎవరో పెద్దల మాట కాదు... ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చొని తింటున్న ఓ యువకుడి అనుభవంలో నుంచి పుట్టిన జీవిత సత్యం. కరోనా కాలం జనజీవనంలో ఎంతటి కల్లోలం సృష్టించిందో చూశాం. దాని ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన యువత ఎందరో.
అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా తెరకెక్కించిన లఘుచిత్రం ‘2020లో జాబ్ పోతే’! ‘సీఏపీడీటీ’ యూట్యూబ్ ఛానల్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. నాలుగు రోజుల్లోనే దాదాపు మూడున్నర లక్షల మందిని అలరించిన ఈ షార్ట్ ఫిలిమ్‌లో అంతగా ఏముంది?
సీన్ ఓపెన్ చేస్తే... నిఖిల్ పొద్దున్నే లేచి పాల ప్యాకెట్ పట్టుకువస్తాడు. కొద్దిగా ఆలస్యమవుతుంది. దానికి వాళ్లమ్మ ‘పాల ప్యాకెట్ తేవడానికి ఇంతసేపా’ అంటూ విసుక్కొంటుంది. ఇంట్లోకి వచ్చి, సోఫాలో కూర్చొని, వేడి నీళ్లు పెట్టమని అమ్మను అడిగేలోపు... ‘అది కూడా చేసుకోలేవా’ అని ఇంతెత్తును నోరేసుకుని అరుస్తుంది. పోనీ టీపాయ్ మీదనున్న పేపర్ చదువుదామని తీసుకొనేలోపు... అక్కడే ఉన్న నిఖిల్ తండ్రి చేతుల్లోకి అది వెళ్లిపోతుంది. ‘ఎలా ఉండేవాడిని... ఎలా అయిపోయాను’... తనలో తను బాధపడతాడు.
‘అసలు ఇదంతా ఉద్యోగం పోవడంవల్ల జరిగింద’ని విచారిస్తూ... ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళతాడు. ‘అన్నయ్యా... ఇస్త్రీ అయిపోయింది’ అని చెల్లి చొక్కా చేతికిచ్చేలోపు, దాన్ని లాక్కొని ఏమీ పట్టనట్టు వెళ్లిపోతాడు. ‘ఎంత పొగరో వీడికి’ అనుకుంటుందా అమ్మాయి. అతడు ఆఫీస్‌కు వెళ్లాలంటే రోజుకో వాచీ, వేసినది వేయకుండా ఖరీదైన డ్రెస్! కానీ కాలం మారింది. కరోనా వచ్చింది. వైరస్ వ్యాపించింది. జీవితాలు తలకిందులయ్యాయి. అందులో మనోడి ఉద్యోగం హుష్ కాకి అయింది. అప్పుడు టైమే లేదన్నవాడు ఇప్పుడు టైమే గడవక అవస్థలు పడుతున్నాడు.
ప్రస్తుతం చెల్లి ఆఫీస్‌కు వెళుతుంటే... ఇతగాడు ఇంట్లో భారంగా గడుపుతుంటాడు. తరువాత అతడి ప్రేయసిని పరిచయం చేస్తాడు. ‘ఇంత టార్చెరస్‌గా గడిచిపోతున్న జీవితంలో నాకున్న ఒకే ఒక్క ఊరట పల్లవి. తనే నా సపోర్టింగ్ సిస్టమ్’ అంటుండగానే, అతడికి పల్లవి షాకిస్తుంది. ‘ఇంక నేను ఉండలేను నిఖిల్. చాలా రోజులు వేచివున్నాను. నీకు ఉద్యోగం రాలేదు. మా నాన్నకు చెబితే నీతో పెళ్లి వద్దన్నాడు. ఇక చాలు’ అంటూ బాయ్ చెప్పి వెళ్లిపోతుంది. బెంజ్ కారులో తిరిగేవాడు ఓలా బైక్ కోసం వెయిట్ చేస్తుంటాడు.
బైక్ లేటుగా రావడంతో అతడిపై చికాకు పడతాడు నిఖిల్. ఇంతలో అతడి ఫోన్ మోగుతుంది. వీడియో కాల్ అది. వాళ్లమ్మ చేస్తుంది. వెంటనే బైక్ దిగి, పక్కకు వెళ్లి, ముఖం కడుక్కుని, వీడియో కాల్‌లో అమ్మను పలుకరిస్తాడు ఓలా బైక్ కుర్రాడు. ఉద్యోగం పోయినా, ఆ విషయం ఇంట్లో వాళ్లకి చెబితే బాధపడతారని, ఆఫీసులో ఉన్నట్టే మేనేజ్ చేస్తుంటాడు. ఆ దృశ్యం చూసిన నిఖిల్ కళ్లు చెమ్మగిల్లుతాయి. అప్పటి వరకు హాస్యం పండినా... ఈ సన్నివేశంతో ఒక్కసారిగా గుండె బరువెక్కిపోతుంది.
దర్శకుడు ఎం.రవితేజ ఎంతో బాగా చిత్రాన్ని తెరకెక్కించాడు. నిఖిల్‌గా అతడే నటించి, మెప్పించాడు.
Updated Date - 2021-01-13T05:55:59+05:30 IST