లవ్ ఇంటర్వ్యూ
ABN, First Publish Date - 2021-04-07T05:30:00+05:30
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ... ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. చదువు అయిపోయి ఉద్యోగ వేటలో ఉన్న శ్రీహాన్
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ... ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. చదువు అయిపోయి ఉద్యోగ వేటలో ఉన్న శ్రీహాన్ గంపెడు ఆశలతో ఇంటర్వ్యూకు వస్తాడు. ‘ఎన్నో ఇంటర్వ్యూ ఇది?’... పక్కనున్నతను అడుగుతాడు. ‘ఫస్ట్‌దే బ్రో’... శ్రీహాన్ బదులిస్తాడు. ‘నాకు ఇరవై రెండోది’... అంటాడు పక్క వ్యక్తి. ‘ఏదో యుద్ధాలు గెలిచినట్టు గొప్పగా చెబుతున్నారు!’... శ్రీహాన్ అనేలోపు ‘ఎన్ని ఇంటర్వ్యూలకు వెళితే అంత నాలెడ్జ్ వస్తుంది’... తనను తాను గొప్పగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తాడు అతడు.
‘మరి స్కూల్లోనూ, కాలేజీలోనూ చదువుకోకుండా ఏం పీకావు బ్రో?’... శ్రీహాన్ సున్నితంగా అతడి నోరు మూయిస్తాడు. ఇంతలో ఓ అందమైన అమ్మాయి వచ్చి శ్రీహాన్ పక్కన కూర్చుంటుంది. ఆమెను చూడగానే ‘ప్రపంచం చాలా చిన్నది’ అంటాడు శ్రీహాన్. ‘వాట్? డూ ఐ నో యూ?’... ఆశ్చర్యంగా అడుగుతుందా అమ్మాయి. ‘రేపు నాకు అరవై ఏళ్లు వచ్చినప్పుడు నా హార్ట్‌కు ఏదన్నా హోల్ పడితే మీరున్నారన్న ధైర్యంతోనే బతుకుతున్నా ఇన్ని రోజులూ’. ‘కొంచెం క్లియర్‌గా చెప్పరా’. గుండెకు సంబంధించిన పాఠం చదివి... ‘అందుకే నేను కార్డియాలజిస్ట్ కావాలనుకొంటున్నా’ అని ముగిస్తాడు.
‘ఇది నేను ఎనిమిదో తరగతిలో చెప్పింది. అంటే నువ్వు శ్రీహాన్ కదా’... గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆమె పేరు సిరి. స్కూల్లో టాపర్. మనవాడు బ్యాక్‌బెంచ్. ‘అవును... అప్పుట్లో ‘నేను డాక్టర్ అవుతా’నంటూ తెల్ల కోట్ వేసుకుని తిరిగేదానివి కదూ!’... ‘యా... అవన్నీ ఆ రోజుల్లో. ఆ వయసులో ఏ అమ్మాయిని అడిగినా డాక్టర్‌ను అవుతాననేది. రియాలిటీలోకి వస్తే కానీ అర్థం కాదు’... ‘నిజమే. నేను కూడా పైలెట్ అవుతాననేవాడిని. ఆ తరువాతే అర్థమైంది... పైలెట్ కాదు కదా ఆటో తోలడం కూడా కష్టమేనని. ఇదిగో ఇప్పుడీ సాఫ్ట్‌వేర్ తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు’... ‘కానీ ఆ రోజులే బాగున్నాయి’... అంటుంది. ‘అవును... బేసిగ్గా మనం దేన్నీ యాక్సెప్ట్ చేయం. అంటే... ఫాస్ట్ గురించి రిగ్రెట్స్ ఎక్కువ.
ఫ్యూచర్ గురించి హోప్స్ ఎక్కువ. ఈ ప్రాసెస్‌లో ప్రజెంట్‌ను పట్టించుకోకుండా ఇదిగో ఇలా ఫీలవుతుంటాం’... తత్వం బోధిస్తాడు శ్రీహాన్. ఈలోపు ఒకరి తరువాత ఒకరిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. లోపలికి వెళితే... ‘మీ ఇద్దరినీ షార్ట్‌లిస్ట్ చేశాం. అయితే ఒకటే వేకెన్సీ ఉంది. పైవాళ్లతో మాట్లాడి ఉద్యోగం ఎవరికనేది చెబుతా’నంటాడు హెచ్‌ఆర్. ఇద్దరిలో టెన్షన్. ఎవరికి వచ్చినా పర్లేదనుకుంటారు. చివరకు ఆ ఉద్యోగం సిరిని వరిస్తుంది. సిరి... అతడికి జాబ్ రాలేదని ఎంతో బాధపడుతుంది. ఇంటర్వ్యూ ఫలితం పక్కన పెడితే... ఈ సమయం చాలా ఏళ్ల తరువాత కలిసిన వారి అభిప్రాయాలను పంచుకోవడానికి వేదిక అయింది.
అంతేకాదు... ఎవరి మనసులో ఏముందో... ఎలాంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకొంటున్నారో అర్థమవుతుంది. స్కూల్లోనే కాదు... ఇప్పుడు కూడా ఇద్దరివీ భిన్నమైన మనస్తత్వాలు... ఆలోచనలు. ఒకరంటే ఒకరికి గౌరవం... అంతకుమించిన అభిమానం. మరి ఈ పరిచయం పరిణయంగా మారిందా? అనేది ‘లవ్ ఇంటర్వ్యూ’ షార్ట్ ఫిలిమ్‌లో చూడాల్సిందే. యూట్యూబ్‌లో గత నెల 23న విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పటికి ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు. సిరిగా నటించిన సిరీ హనుమంత్ అందం, అందుకు తగ్గ అభినయం వీక్షకులను చిత్రం చివరి వరకు తీసుకువెళుతుంది. శ్రీహాన్‌గా శ్రీహాన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. సుజీత్ రచన, దర్శకత్వం అద్భుతం.
Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST