రాధే గోవిందం
ABN, First Publish Date - 2021-08-11T05:30:00+05:30
చిక్కడు దొరకడు’ సినిమా ఎక్కువసార్లు చూసినట్టున్నావేరా? అస్సలు కనిపిచ్చట్లేదు’... మల్లి దాదా ప్రశ్న. ఏదో నసుగుతాడు కుర్రాడు ఛోటూ.
‘చిక్కడు దొరకడు’ సినిమా ఎక్కువసార్లు చూసినట్టున్నావేరా? అస్సలు కనిపిచ్చట్లేదు’... మల్లి దాదా ప్రశ్న. ఏదో నసుగుతాడు కుర్రాడు ఛోటూ. ‘అరే... అంతకముందు రింగులుండేవే. ఇప్పుడు సిల్కయింది’... దాదా ఆశ్చర్యం. ‘ఆ... స్పూతెనింగ్ చేయించా అన్నా’... కుర్రాడి బదులు. ‘ఏంటి... నేనిచ్చిన డబ్బులతోనే!’... ‘దానికి పది లక్షలెందుకన్నా! ఐదొందలతో అయిపోతుంది’. ‘అంటే నేనిచ్చింది పెద్ద అమౌంటేగా!’... ‘చాలా పెద్ద అమౌంటన్నా’. ‘అంటే నేనిచ్చిన డబ్బుకు అసలు కట్టక, వడ్డీ కట్టకపోతే నాకెలా ఉంటుంది చెప్పు’... దాదాలో అసహనం. ‘నాకు కొంచెం టైమివ్వన్నా. ఒక్క నెలన్నా’... ఛోటూ అభ్యర్థన. దాదా పక్కా డేట్ చెప్పమంటే మనోడు ‘అక్టోబర్ 2’ అంటాడు. తరువాత ఛోటూ తన స్టూడియోలో కూర్చొని అప్పు ఎలా కట్టాలో ఆలోచిస్తుంటాడు. ఏంచేయాలో చెప్పమని స్నేహితుడిని అడుగుతాడు. ‘మల్లి గాడి చెల్లిని లవ్ చేసి, పెళ్లి చేసుకొని, నీ అప్పుని కట్నం కింద మాఫీ చేసుకోవడం తప్ప వేరే దారే లేదు’ అంటాడు స్నేహితుడు. ఏదో ఫ్లోలో చెప్పిన ఆలోచనను ఫాలో అవుదామని డిసైడ్ అయిపోతాడు మన కథానాయకుడు. మల్లి చెల్లి హారికను చూద్దామని ఆమె ఇంటి వైపు వెళతాడు అతడు. అప్పటికే ఒక కుర్రాడు ఆమె వెంట పడుతుంటాడు. అతడిని తన దారికి అడ్డం రాకుండా తొలగించాలనుకొంటాడు హీరో. తన స్నేహితుడిని అతడి వద్దకు పంపిస్తాడు.
హారిక చూస్తుండగానే స్నేహితుడు ఆ ప్రేమికుడి దగ్గరకు వెళ్లి, జేబులో నుంచి కత్తి తీసి, తనను తాను పొడుచుకున్నట్టు నటించి కిందపడిపోతాడు. ఇంతలో ఛోటూ అక్కడికి వచ్చి... ‘ఏంటి... చచ్చిపోయాడా’ అని ప్రేమికుడిని అడుగుతాడు. ‘చచ్చిపోయాడనుకుంటా బయ్యా’ అంటాడు అతడు. ‘ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేస్తున్నావు ఎందుకని అడిగినందుకు చంపేస్తావా’ అంటూ దొంగ ఏడుపు అందుకొంటాడు కథానాయకుడు. ఇదంతా చూసిన హారిక ఆ ప్రేమికుడిని తిట్టి వెళ్లిపోతుంది. ప్రేమికుడిని పోలీసులు కాని పోలీసులు వచ్చి పక్కకు తీసుకువెళ్లి వదిలేస్తారు. కింద పడిపోయిన స్నేహితుడు లేచి... ‘అమర ప్రేమికులను విడగొట్టాం. ఇప్పుడు నీ స్కెచ్ ఏంటి’ అని హీరోని అడుగుతాడు. ‘ఆపరేషన్ హారిక’... ఉత్సాహంగా చెబుతాడు ఛోటూ. హారిక గురించి వివరాలన్నీ సేకరించే పనిలో పడతాడు. అన్నీ తెలుసుకుని ఆమెను ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు అతడు. మరి మనోడి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? హారిక అతడికి మనసిస్తుందా? మల్లి దగ్గర తీసుకున్న పది లక్షల అప్పుని కట్నం కింద మాఫీ చేయించుకున్నాడా? అప్పు కట్టకపోగా తన చెల్లినే ప్రేమించిన ఛోటూను మల్లి వదిలేస్తాడా? వీటన్నిటికీ సమాధానం ‘రాధే గోవిందం’ లఘుచిత్రంలోనే దొరుకుతుంది. హాస్యభరితంగా మలిచిన ఈ చిత్రం చూసినంతసేపూ సరదాగా సాగిపోతుంది. శ్రీహన్, సిరిల నటన అలరిస్తుంది. సాయితేజ రచన, దర్శకత్వ ప్రతిభను అభినందించకుండా ఉండలేం. యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పటికి ఐదున్నర లక్షల మందికి పైగా వీక్షించారు.
Updated Date - 2021-08-11T05:30:00+05:30 IST