ఆ ‘స్పైసీ’కి పాతికేళ్లు
ABN, First Publish Date - 2021-07-13T05:30:00+05:30
సరిగ్గా పాతికేళ్ల కిందటి మాట... ‘వాన్నాబీ’ అంటూ ప్రపంచాన్ని ఊపేశారు ‘స్పైస్ గాళ్స్’. గమ్మత్తయిన గాత్రానికి రాకింగ్ మ్యూజిక్ జోడించి 1996లో విడుదలైన ‘వాన్నాబీ’ నాడు పెద్ద సంచలనం.
సరిగ్గా పాతికేళ్ల కిందటి మాట... ‘వాన్నాబీ’ అంటూ ప్రపంచాన్ని ఊపేశారు ‘స్పైస్ గాళ్స్’. గమ్మత్తయిన గాత్రానికి రాకింగ్ మ్యూజిక్ జోడించి 1996లో విడుదలైన ‘వాన్నాబీ’ నాడు పెద్ద సంచలనం. అదే వారి తొలి ఆల్బమ్ అయినా... ప్రపంచ పాప్ చరిత్రలో మరపురాని గీతంగా మిగిలిపోయింది. ‘స్పైస్ గాళ్స్’ ఐదుగురు గాయకులున్న బ్రిటిష్ పాప్ బృందం. మెలనీ బ్రౌన్ (స్కేరీ స్పైస్), మెలనీ షిష్లోమ్ (స్పోర్టీ స్పైస్), ఎమ్మా బన్టన్ (బేబీ స్పైస్), గెరీ హలీవెల్ (జింజిర్ స్పైస్), విక్టోరియా బెక్‌హామ్ (పోష్ స్పైస్) ఈ బృందం సభ్యులు. ప్రధానంగా యువతులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వీరు ‘స్పైస్ గాళ్స్’గా జతకట్టినా... లింగ బేధం లేకుండా అందరికీ దగ్గరయ్యారు. ఆ దశాబ్దపు పాప్ ఐకాన్స్‌గా అశేష జనాదరణ పొందారు. ఇది ‘అమ్మాయిల సత్తా’ అంటూ నాడు ఆంగ్ల పత్రికలు పతాక శీర్షికలు ప్రచురించాయి. తమ మొదటి ఆల్బమ్ ‘వాన్నాబీ’ విడుదలై 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘స్పైస్ గాళ్స్’... తమ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన, ఆదరించిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ఇన్నేళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలే ‘స్పైస్ గాళ్స్’ను ప్రపంచంలోనే విజయవంతమైన మహిళా బ్యాండ్‌గా నిలబెట్టింది’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనికి గుర్తుగా ‘వాన్నాబీ 25’ పేరిట ఒక ఆల్బమ్‌ను ఇటీవల విడుదల చేశారు.
Updated Date - 2021-07-13T05:30:00+05:30 IST