‘ఇంటర్నెట్ స్పీడ్’లో దిగజారిన America, Canada.. టాప్10 నుంచి అవుట్.. భారత్ ఎక్కడంటే..
ABN, First Publish Date - 2021-09-14T18:04:01+05:30
ప్రధానంగా కోవిడ్ మహమ్మారి విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిగింది. ఆయా దేశాలు కూడా తమ ఉద్యోగులకు, ప్రజలకు వేగవంతమైన మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు..
వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారి విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిగింది. ఆయా దేశాలు కూడా తమ ఉద్యోగులకు, ప్రజలకు వేగవంతమైన మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక దేశాలు తమ ఇంటర్నెట్ సేవల వేగాన్ని పెంచుకుంటున్నాయి. కానీ ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా, ఆ పక్క దేశం కెనడా బాగా వెనుకపడిపోయాయి. గతేడాది వరకు ఎలాగోలా టాప్10 లిస్ట్‌లో ఉన్న ఈ దేశాలు ఈ ఏడాది దిగజారిపోయాయి.
ప్రముఖ ఊక్లా వరల్డ్‌వైడ్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. మొబైల్ వినియోగదారుల్లో ఏకంగా 60 శాతం వరకు ఇంటర్నెట్ వినియోగం పెరగగా, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల్లో 30 శాతం వరకు వృద్ధి జరిగింది. ప్రపంచ దేశాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించే దేశాల జాబితాను కూడా తాజాగా ఊక్లా విడుదల చేసింది. అందులో మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అగ్రస్థానంలో నిలవగా.. వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న దేశాల జాబితాలో మొనాకో టాప్ ప్లేస్‌కు చేరింది.
గతేడాది వరకు వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందించిన టాప్ 10 దేశాల జాబితాలో కెనడా 8వ స్థానంలో ఉండగా, వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవల లిస్ట్‌లో 9వ స్థానంలో అమెరికా ఉంది. కానీ ఈ ఏడాది లెక్కల ప్రకారం ఈ రెండు దేశాలూ టాప్10లో చోటు దక్కించుకోలేకపోయాయి. నిజానికి వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ సేవల అందించే టాప్10 దేశాల జాబితాలో గత రెండేళ్లలో అమెరికా లేదు. కెనడా కూడా గత రెండేళ్లలో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే టాప్10 జాబితాలో స్థానం సంపాదించలేదు. ప్రస్తుతం మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో అమెరికా 14వ స్థానంలో ఉండగా.. కెనడా 19వ స్థానంలో ఉంది.
ఇక భారత్ విషయానికొస్తే.. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 68వ స్థానంలో నిలిచి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో మాత్రం ఏకంగా 122వ స్థానంలో కొనసాగుతుండడం శోచనీయం.
Updated Date - 2021-09-14T18:04:01+05:30 IST