మరణశిక్షలపై వర్జీనియా రాష్ట్రం కీలక నిర్ణయం!
ABN, First Publish Date - 2021-03-25T22:03:23+05:30
అగ్రరాజ్యం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేరస్థులకు విధించే మరణశిక్షలను రద్దు చేసింది. ఇకపై వర్జీనియాలో మరణశిక్షలను అమలు చేయబోయేది లేదని స్పష్టం చేసింది. పూర్తి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేరస్థులకు విధించే మరణశిక్షలను రద్దు చేసింది. ఇకపై వర్జీనియాలో మరణశిక్షలను అమలు చేయబోయేది లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. క్రూరమైన నేరాలకు పాల్పడిన నేరస్థులకు అమెరికాలోని కోర్టులు మరణశిక్షలను విధించేవి. అయితే 1972లో ఫెడరల్, రాష్ట్ర స్థాయిలో మరణశిక్షలను నిషేధిస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత తీర్పును సమీక్షించి.. రాష్ట్రాలు మరణశిక్షను పునరుద్ధరించేందుకు 1976లో సుప్రీంకోర్టు అనుమతించింది.
ఈ క్రమంలో వర్జీనియా రాష్ట్రం ఇప్పటి వరకు దాదాపు 1400 మందికి మరణశిక్షలను అమలు చేసింది. దీంతో అమెరికాలో టెక్సాస్ తర్వాత అత్యధిక మరణశిక్షలు అమలు చేసిన రాష్ట్రంగా వర్జీనియా గుర్తింపు పొందింది. అయితే తాజాగా వర్జీనియా ప్రభుత్వం ఈ శిక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన బిల్లును రూపొందించింది. ఈ బిల్లుకు చట్టసభలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో ఆ బిల్లుకు గవర్నర్ వద్దకు చేరింది. తాజాగా మరణశిక్షల రద్దుకు సంబంధించిన బిల్లుపై వర్జీనియా రాష్ట్ర గవర్నర్ రాల్ఫ్ నార్తం సంతకం చేశారు. దీంతో దక్షిణ అమెరికాలో.. నేరస్థులకు మరణశిక్షలను రద్దు చేసిన మొదటి రాష్ట్రంగా వర్జీనియా గుర్తింపు పొందింది. కాగా.. ఇప్పటి వరకు అమెరికాలోని 23 రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో మరణశిక్షలను రద్దు చేశాయి. కాలిఫోర్నియా, ఒరిగాన్,పెన్సిల్వేనియా రాష్ట్రాలు మరణశిక్షలను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.
Updated Date - 2021-03-25T22:03:23+05:30 IST