గల్ఫ్ దేశాల్లో మలయాళీల ముందు చిన్నబోతున్న తెలుగోళ్లు
ABN, First Publish Date - 2021-01-10T07:27:42+05:30
సొంత ఇంట చేసే ఆర్భాటం, ప్రచారం అద్భుతంగా ఉంటుంది. కానీ బయట నలుగురిలోకి వెళ్లే సరికి మాత్రం నిమిత్తం, నైరాశ్యం, దిగువ స్ధాయి. ఇదీ గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రవాసీయుల పరిస్ధితి. సంఖ్యాపరంగా మలయాళీల తర్వాతి స్ధానంలో ఉన్నప్పటికి నాయకత్వం విషయంలో మాత్రం అనైక్యత కారణాన అట్టడుగు స్ధాయిలో ఉన్నారు తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు.
- ఖతర్ ప్రవాసీ సంఘాల ఎన్నికల్లో చతికిలపడ్డ తెలుగు ప్రవాసీయులు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సొంత ఇంట చేసే ఆర్భాటం, ప్రచారం అద్భుతంగా ఉంటుంది. కానీ బయట నలుగురిలోకి వెళ్లే సరికి మాత్రం నిమిత్తం, నైరాశ్యం, దిగువ స్ధాయి. ఇదీ గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రవాసీయుల పరిస్ధితి. సంఖ్యాపరంగా మలయాళీల తర్వాతి స్ధానంలో ఉన్నప్పటికి నాయకత్వం విషయంలో మాత్రం అనైక్యత కారణాన అట్టడుగు స్ధాయిలో ఉన్నారు తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు. రాజకీయంగా, ధార్మికంగా కేరళ ప్రవాసీయులందరు కూడా భిన్న పంథాలను అవలంబిస్తున్నప్పటికి తమ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి మలయాళీలందరు ఏకమై విజయపంథా అవలంబిస్తుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు మాత్రం చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురై వైఫల్యాల బాటలో ఉన్నారు.
తాజాగా ఖతర్‌లో జరిగిన కీలక ప్రవాస భారతీయ సంఘాల ఎన్నికలలో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రవాసీయులు ఘోర పరాజయం పాలయ్యారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న స్ధానిక నియమాలు, దౌత్యపరమైన సంప్రదాయాల కారణాన భారతీయ ఎంబసీలు ప్రత్యక్షంగా కాకుండా అన్ని రాష్ట్రాల ప్రవాసీ సంఘాల ద్వారా ప్రవాసీయుల కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ రకంగా ఖతర్‌లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు ఐ.సి.సి, కష్టాలలో ఉన్న వారి సహాయార్ధం ఐ.సి.బి.యఫ్, క్రీడా కార్యకలపాలకు ఐ.యస్.సి అనే మూడు సంఘాలను భారతీయ ఎంబసీ నిర్వహిస్తుండగా వీటికి గురువారం ఎన్నికలు జరిగాయి.
ఖతర్‌లోని ప్రవాస భారతీయులందరు కీలకంగా భావించే ఈ ఎన్నికలలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రవాసీ ప్రముఖులు ఆశించిన విధంగా రాణించలేకపోయారు. కార్యవర్గ సభ్యులుగా అంధ్రప్రదేశ్ నుంచి భాగవతుల వెంకప్ప, తెలంగాణ నుంచి భూమేశ్ పడాలలు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కార్యవర్గానికి పోటీపడ్డ అనంతపురం జిల్లా మూలాలున్న కర్ణాటకు చెందిన రజనీ మూర్తికి తన సమీప ప్రత్యర్ధి కేరళకు చెందిన అబ్దుల్ రవూఫ్ పల్లి పరంబిల్ కంటే 146 ఓట్లు తక్కువగా వచ్చాయి. అయినప్పటికి మహిళా కోటా అమె కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికయినట్లు ప్రకటించింది. ఇక్కడ విశేషమేమిటంటే.. మహిళా కోటా కింద పోటీ చేసిన పంజాబ్‌కు చెందిన కులదీప్ కౌర్ భల్‌కు 817 ఓట్లు వచ్చాయి. కులదీప్ లాంఛనంగా ఎన్నికయిననప్పటికి హౌజ్ మెయిడ్ల కేసుల దృష్ట్యా ఒక తెలుగు మహిళా ఉండాలనే ఉద్దేశ్యంతో రజనీకి తక్కువ ఓట్లు(591) వచ్చినప్పటికి అమెను ఎన్నిక చేసినట్లుగా తెలిసింది. సామాజిక కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనే రజనీ గత కార్యవర్గంలో కూడా పని చేశారు.
ఐసీసీ కార్యవర్గంలో హైద్రాబాద్‌కు చెందిన కె. కృష్ణాకుమార్ కూడా పోటి చేసి 41 ఓట్లతో విజయం సాధించారని అనేక మంది చెబుతున్నప్పటికి పత్రికలకు విడుదల చేసిన పేర్లలో మాత్రం ఆయన పేరు లేదు.
మిగిలిన గల్ఫ్ దేశాల తరహా ఖతర్‌లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల కార్మికులకు సంబంధించి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కానీ ఈ దృష్ట్యా అనుబంధ సంఘాల ప్రతినిధుల కోటాలో లేదా ప్రత్యక్షంగా కార్యవర్గ సభ్యుల (ఏ.ఓ.ఆర్) కోటాలో గానీ వీలైనంత ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఎన్నికవడానికి అందరు కలిసి సంయుక్తంగా కార్యచరణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. కానీ అందుకు బదులుగా వివిధ కారణాల రీత్యా, వైషమాల్యలకు గురై ఎన్నికలలో తమ ప్రభావాన్ని చూపడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
ఇది కేవలం ఖతర్‌లోనే కాదు, దాదాపు అన్ని గల్ఫ్ దేశాల్లో ఈ రకమైన ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఇదే పరిస్ధితి పునరావృతమవుతోంది. ప్రవాసీ సంఘాలలో మలయాళీలు తమ పేర్లను నమోదు చేయించుకుని క్షేత్రస్ధాయిలో చురుగ్గా ఉండటంతో ఏ ఎన్నికయినప్పటికి వారి విజయం నల్లేరు మీద నడకగా ఉంది. అదే తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు మాత్రం క్షేత్రస్ధాయితో సంబంధం లేకుండా ఆర్భాట ప్రచారానికి పరిమతమై ఉండడంతో ఎదగలేకపోతున్నారు. పైగా కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించుకుని ఉండడం కూడా తెలుగు వారికి నష్టం కలిగిస్తోంది.
Updated Date - 2021-01-10T07:27:42+05:30 IST