బోసినవ్వుల ఈ ఐదేళ్ల చిన్నారి.. రాయిగా మారుతుందట
ABN, First Publish Date - 2021-07-04T01:31:22+05:30
బోసి నవ్వులు నవ్వుతూ.. నవ్విస్తూ ఇంట్లో కొత్త వెలుగులు నింపింది ఐదేళ్ల చిన్నారి. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ చిన్నారి శరీరంలో.. ఆ తర్వాత క్రమంగా మార్పులు రాసాగాయి. దీంతో కలత చెందిన తల్లిదండ్రులు
లండన్: బోసి నవ్వులు నవ్వుతూ.. నవ్విస్తూ ఇంట్లో కొత్త వెలుగులు నింపింది ఐదేళ్ల చిన్నారి. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ చిన్నారి శరీరంలో.. ఆ తర్వాత క్రమంగా మార్పులు రాసాగాయి. దీంతో కలత చెందిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. ఒక నెల రోజులపాటు చిన్నారికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. గుండెలు పగిలే విషయాన్ని పాప తల్లిదండ్రులకు చెప్పారు. శరీరంలో కదలికలు క్రమంగా తగ్గిపోయి ఆ చిన్నారి ఓ రాయిలా మారుతుందనే మాట విని ఆ తల్లిదండ్రలు షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
బ్రిటన్‌కు చెందిన అలెక్స్, దవే దంపతులు ఈ ఏడాది జనవరి 31న లెక్సి రాబిన్స్ అనే చిన్నారికి జన్మనిచ్చారు. ఐదు నెలల వరకు ఆ చిన్నారి బాగానే ఉంది. తన బోసి నవ్వులతో ఇంట్లో ఆనందాన్ని నింపింది. 5 నెలలు గడిచిన తర్వాత లెక్సి శరీరంలో మార్పులు గమనించారు. పాప బొటనవేలు, కాలి బొటన వేలులో పెద్దగా చలనం లేదని గుర్తించారు. దీంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప శరీరంలో వచ్చిన మార్పులకు కారణం ఏంటో తొలుత వైద్యులకు కూడా అంతుపట్టలేదు. దీంతో దాదాపు నెల రోజుల పాటు ఆ చిన్నారికి వైద్య పరీక్షలు చేశారు. చివరికి ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా (ఎఫ్ఓపీ) అనే అరుదైన వ్యాధితో లెక్సి బాధపడుతున్నట్టు తేల్చారు. ఈ జబ్బు వల్ల కండరాలు, వాటిని కలిపి ఉంచే టెండాన్స్, లిగిమెంట్ స్థానంలో ఎముకలు ఏర్పడుతాయని వెల్లడించారు. అస్థిపంజరం వెలుపల ఎముకలు ఏర్పడి శరీరంలో కదలికలు క్రమంగా తగ్గి ఆమె ఓ శిలలా చలనం లేకుండా మారుతుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తమ బిడ్డ పరిస్థిని వివరిస్తూ ఆ చిన్నారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. పాపకు చికిత్స కోసం విరాళాలు కోరుతున్నారు. ‘లెక్సి టెస్ట్ రిపోర్టులను లాస్ ఏంజెల్స్ లోని ల్యాబ్‌కు పంపించారు. ప్రముఖ పిడియాట్రిషన్ లెక్సిని పరిశీలిస్తున్నారు. తమ సర్వీసులో ఇటువంటి కేసును చూడలేదని వారు చెబుతున్నారు. చికిత్స లేని వ్యాధి మా బిడ్డకు సోకింది. ఈ విషయం మా హృదయాలను కలిచివేస్తోంది. కానీ మేం మా ప్రయత్నాన్ని, నమ్మకాన్ని వదులకోము’ అని తెలిపారు.
కాగా.. ఈ వ్యాధి బారినపడిన వారి జీవిత కాలం 40 ఏళ్లు మాత్రమే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో దాదాపు 20ఏళ్లపాటు వారు మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. రెండు మిలియన్ల మందిలో ఒకరు మాత్రమే ఇటువంటి అరుదైన వ్యాధి బారినపడుతుంటారని వెల్లడిస్తున్నారు.
Updated Date - 2021-07-04T01:31:22+05:30 IST