అందుకే ఏనాడూ చంద్రబాబును తిట్టలేదు: రేవంత్ రెడ్డి
ABN, First Publish Date - 2021-10-25T08:07:39+05:30
సాధారణంగా ఎవరైనా నాయకుడు ఓ పార్టీని వీడి వెళ్లేటప్పుడు అప్పటిదాకా పనిచేసిన పార్టీని, ఎదుగుదలకు కారణమైన నాయకులను దూషించి..
ఆర్కే: చంద్రబాబు.. రాహుల్‌గాంధీకి ఏమైనా చెప్పారా?
రేవంత్: సాధారణంగా ఎవరైనా నాయకుడు ఓ పార్టీని వీడి వెళ్లేటప్పుడు అప్పటిదాకా పనిచేసిన పార్టీని, ఎదుగుదలకు కారణమైన నాయకులను దూషించి వెళ్లిపోతాడు. నేను అలా చేయలేదు. నా ఎదుగుదలకు టీడీపీయే కారణం. దానిని చూసే నన్ను కాంగ్రెస్ ఆహ్వానించింది. నేను ఉన్న పరిస్థితులను, ఆ పార్టీలో పనిచేయలేని స్థితిని చంద్రబాబుకు గౌరవంగా వివరించి పార్టీని వీడాను. ఆ తరువాత అందరూ ఊహించినట్లు చిల్లర మాటలు మాట్లాడకుండా నా స్థానంలో నేనున్నాను. నేను ఉన్న పార్టీకి పనిచేసుకుంటూ వెళ్లాను. దీంతో నా వెనక చంద్రబాబే ఉన్నారని, లేదంటే నేను ఆయనను తిట్టేవాడిని కదా అంటున్నారు.
ఆర్కే: టీడీపీ పట్ల ఇంకా సానుభూతితో ఉన్న కొందరి ఓట్లు మీవల్ల కాంగ్రెస్‌కు వస్తాయనే వాదన ఉంది..!
రేవంత్: మల్కాజిగిరి ఎంపీగా గెలవడంలో అది పనికొచ్చింది. నేను గెలవకపోతే రాజకీయ జీవితమే ఉండేదికాదు. సర్పంచ్‌గా గెలిచేందుకు కూడా కష్టపడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇక్కడ చంద్రబాబు పాత్రలేదు. రాష్ట్రంలో ఇప్పుడున్నది.. కేసీఆర్ అనుకూలం, కేసీఆర్ వ్యతిరేకమే. వ్యతిరేకంగా నేను, బండి సంజయ్, కిషన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, షర్మిల, ప్రవీణ్‌కుమార్ వంటి ఐదారు మందిమి లైన్‌లో ఉన్నాం. ఎవరికి వారు పాదయాత్రలు, కార్యక్రమాలు చేస్తున్నాం. వీరిలో ఎవరిని తెలంగాణ సమాజం ఆదరిస్తుందన్నది ఇంకా కొంతకాలమైతే తెలుస్తుంది. ఇంకా కొంత ప్రయాణం సాగాల్సి ఉంటుంది. మా కార్యక్రమాల వల్ల కేసీఆర్ కూడా విధిలేని పరిస్థితుల్లో బయటికి వస్తున్నారు. దళితబంధు వంటి పథకాలు తెస్తున్నారు. ఫామ్‌హౌ్‌సలో పడకోకుండా యాక్టివ్ అయ్యాడు. రాహుల్ గాంధీ నిర్ణయం తెలియగానే ఎమ్మెల్యేలు, నాయకులతో మాట్లాడడం, సమీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఈ రకంగా రాహుల్‌గాంధీ సక్సెసయ్యారు.
ఆర్కే: రానున్న రోజుల్లో రేవంత్‌రెడ్డి కూడా పార్టీ మీద రాజశేఖర్‌రెడ్డి అంతటి పట్టు సాధిస్తారనే అభిప్రాయాలున్నాయి?
రేవంత్: ఆయనకు అధికారం వచ్చాక పట్టు దొరికింది. అప్పటిదాకా ఆయనకు అందరూ సవాల్ చేసినవారే. బషీర్‌బాగ్ కాల్పుల తరువాత చంద్రబాబు దిగిపోవడం ఖాయమైంది. దీంతో అందరూ నంబర్‌వన్ స్థానం కోసం పోటీపడ్డారు. కానీ, రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ద్వారా తనకు పోటీ అన్నదే లేకుండా చేసుకున్నారు. పార్టీలో 1 నుంచి 100వ స్థానం వరకు ఆయనే అయ్యారు. అధికారం రావడం, ఎక్కువ మంది ఎంపీలను గెలిపించడంతో అధిష్ఠానం కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ప్రస్తుతం అన్నీ ప్రతికూల పరిస్థితులే. అటు కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్రంలో అధికారం రావాలంటే ఒక రకంగా యుద్ధమే చేయాలి. కేసీఆర్ డిక్టేటర్ కాదు.. చీటర్. అప్పుడే కాళ్లు పట్టుకుంటారు. వెంటనే జుట్టు పట్టుకుంటారు.
ఆర్కే: మీరు ఆయన స్కూల్‌లో చదివి వచ్చినవాడిలా ఉన్నారు..!
రేవంత్: టోటల్‌గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. అబ్జర్వేషన్ లేకుండా ఏదీ చేయలేం. ప్రత్యర్థి బలాలు, బలహీనతలు తెలియకుండా ఏమీ చేయలేరు కదా! ఈ ఒక్క అంశంలో మిగతా వారికంటే నేను కాస్త బెటరేమో! జనంలో బలం ఉందన్నప్పుడే పట్టు వస్తుంది.. నాయకులను మెప్పించే ప్రయత్నం చేస్తే జీవితం ముగుస్తుంది. కార్యకర్తల కోసం పని చేస్తే జీవితాంతం పని చేయొచ్చు. నేను కార్యకర్తల మనిషిని. వారు ఏం చేస్తే మేలు జరుగుతుందో మనకు స్పష్టత ఉంటుంది. నాయకుడు తనకు ఏం కావాలో చెప్పడు.
ఆర్కే: రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించడానికి అనుసరించిన మెళకువలు, కేసీఆర్ తన ప్రత్యర్థులను రాచిరంపాన పెట్టడానికి అనుసరించిన మెళకువలను ఒంట బట్టించుకున్నావన్నమాట!
రేవంత్: అబ్జర్వేషనైతే ఉంది.
ఆర్కే: ఫోన్‌లో ఎవరికీ అందుబాటులో ఉండవంటారు?
రేవంత్: ఫోన్లు నేను ఎత్తను. ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మన పక్కనే ఉండి ప్రాణమిస్తానన్న వాడు.. కొద్దిసేపటికే వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరే పరిస్థితులున్నాయి. నాకు వ్యాపారం, వ్యాపకం లేవు. మందు తాగను. ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటాను.
Updated Date - 2021-10-25T08:07:39+05:30 IST