బంగారం కొనడానికి వచ్చిన మహిళలు.. నచ్చలేదంటూ వెళ్లిన తర్వాత అనుమానం.. సీసీ కెమెరాను చెక్ చేస్తే..
ABN, First Publish Date - 2021-09-14T03:19:45+05:30
షాపింగ్ అంటూ వచ్చిన మహిళలు.. బంగారం షాపు యజమానికి భారీ షాక్
ఇంటర్నెట్ డెస్క్: అదో పెద్ద నగల షాపు. కస్టమర్లతో అక్కడంతా కోలాహలంగా ఉంది. యజమాని కౌంటర్ వద్ద కూర్చున్నాడు. ఇంతలో నలుగురు మహిళలు హడావుడిగా షాపులోకి వచ్చేశారు. తాము ఎటువంటి నగలు కొనాలనే విషయమై తెగ చర్చిస్తూ నానా హంగామా చేస్తున్నారు. వీళ్లను చూసిన వారెవరైనా సరే..భారీగా షాపింగ్ చేసేందుకు రేడీ అయిపోయారని అనిపించకతప్పదు. షాపులో కూర్చున్నాకా.. ఆ నగ చూపించు..ఈ గొలుసు చూపించూ..అంటూ అక్కడున్న సిబ్బందిని తెగ హడావుడి పెట్టేశారు. అటు షాపు యజమానికి కూడా మాటల్లో పెట్టేశారు.
అసలు అక్కడ ఏం జరుగుతోందేనే దానిపై అతడికి వీసమెత్తు సందేహం కూడా కలగలేదు. ఆ తరువాత.. ఇక్కడున్నవేవీ నచ్చలేదంటూ వెళ్లిపోయారు. చివర్లో షాపులో స్టాక్ ఎంత ఉందో లెక్కలు చూసుకుంటే... జుంకా ఒకటి తక్కువైనట్టు బయటపడింది. షాపు యజమాని వెంటనే.. ఆ రోజు రికార్డైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. ఈ క్రమంలో దొంగతనం జరిగినట్టు తేటతెల్లమైపోయింది. ఆ మహిళలు తనను మాటల్లో పెట్టి బురిడీ కొట్టించి.. 40 వేల రూపాయల చెవి కమ్మ కాజేశారని తెలుసుకుని ఆయన లబోదిబోమన్నాడు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్ జిల్లాల్లో ఆదివారం నాడు ఈ ఘటన వెలుగు చూసింది.
కాగా.. 15 రోజు క్రితం కూడా ఇదే షాపులో ఓ దొంగతనం జరిగింది. నగలు కొనేందుకు వచ్చిన ఓ మహిళ బ్యాంగులోంచి దాదాపు రూ.42 వేల విలువైన నగలను కొందరు దొంగలు అపహరించుకుపోయారు. వీరు కూడా ఈ మహిళ గ్యాంగ్ సభ్యులే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ గ్యాంగ్ మళ్లీ ఇదే షాపును టార్గెట్ చేసిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇది స్థానికంగా మంచి పేరున్న నగల దుకాణం కావడంతో..ఆ మహిళ గ్యాంగ్ పదే పదే ఈ షాపునే టార్గెట్ చేస్తున్నట్టు స్థానికులు భావిస్తున్నారు.
Updated Date - 2021-09-14T03:19:45+05:30 IST