ఈ 17 ఏళ్ళ బాలుడు IOAA గోల్డ్ కొట్టాడు...
ABN, First Publish Date - 2021-11-27T00:24:44+05:30
బలంగా కోరుకుంటే దేన్ని అయినా సాధించవచ్చునని హర్యానాకు
న్యూఢిల్లీ : బలంగా కోరుకుంటే దేన్ని అయినా సాధించవచ్చునని హర్యానాకు చెందిన 17 ఏళ్ల బాలుడు సురేన్ నిరూపించాడు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IOAA)లో బంగారు పతకం సాధించి, తన తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ ఒలింపియాడ్ నవంబరు 14-21 మధ్య ఆన్‌లైన్ విధానంలో జరిగింది.
మన దేశం నుంచి ఈ ఒలింపియాడ్‌లో పాల్గొన్నవారిలో నలుగురికి బంగారు పతకాలు, ఒకరికి రజత పతకం లభించడం విశేషం. పుణే నివాసి చాహెల్ సింగ్, ఫరీదాబాద్‌కు చెందిన అనిలేష్ బన్సల్, మీరట్ వాసి అర్హాన్ అహ్మద్, హిసార్ నివాసి సురేన్ బంగారు పతకాలు సాధించారు. ముంబైకి చెందిన ధృవ్ అహ్లవాట్ రజత పతకం సాధించాడు.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ ఒలింపియాడ్‌ను ఆన్‌లైన్ విధానంలో నవంబరు 14 నుంచి 21 మధ్యలో నిర్వహించారు. మొదటి దశలో థియరీ పరీక్ష జరిగింది. ఆ తర్వాత డేటా అనాలసిస్ రౌండ్ జరిగింది. దీనిలో ఫిజిక్స్, ఆస్ట్రానమీల నుంచి ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత అబ్జర్వేషనల్ రౌండ్, టీమ్ కాంపిటీషన్ రౌండ్ జరిగాయి. టీమ్ కాంపిటీషన్ రౌండ్‌లో భారత దేశానికి ద్వితీయ బహుమతి లభించింది.
బంగారు పతక విజేత సురేన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ పరీక్షలో విజయం సాధించడం తనకు అంత తేలికైన విషయం కాదన్నాడు. దీనికి సంబంధించిన సబ్జెక్టులపట్ల తనకుగల అంకితభావం, కఠోర శ్రమ తనకు ఈ విజయాన్ని అందించాయని చెప్పాడు. భారత దేశంలో ప్రధానంగా నాలుగు ఒలింపియాడ్స్ ఉన్నాయని, తాను పదకొండో తరగతిలో ఉన్నపుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ ఒలింపియాడ్స్‌లో పాల్గొన్నానని చెప్పాడు. ఆ తర్వాత తనకు ఆస్ట్రానమీపై ఆసక్తి పెరిగిందని చెప్పాడు. ఐఓఏఏ ఒలింపియాడ్‌లో తన టీమ్‌మేట్స్ తనకు చాలా సహకరించారని, వారి సహకారం లేకపోతే తాను ఫైనల్ రౌండ్‌లో విజయం సాధించడం సాధ్యపడేది కాదని తెలిపాడు. విజయం సాధించాలంటే షార్ట్‌కట్ ఉండదని, తాను రెండేళ్ళపాటు కఠోరంగా శ్రమిస్తే తనకు ఈ విజయం దక్కిందని చెప్పాడు. గెలవాలనుకుంటే ఇప్పటి నుంచే కృషిని ప్రారంభించాలని సలహా ఇచ్చాడు.
సురేన్ మరో ఘనత కూడా సాధించాడు. అదేమిటంటే, మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్, 2021లో 19వ ర్యాంకు, జేఈఈ మెయిన్ ఎగ్జామ్, 2021లో 20వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం ఐఐటీ, ఢిల్లీలో చదువుతున్నాడు. సురేన్ తల్లిదండ్రులు చౌదరి చరణ్ సింగ్ హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు చేస్తున్నారు.
Updated Date - 2021-11-27T00:24:44+05:30 IST