ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరీ బార్బరా జరాబికా..? మెహుల్ ఛోక్సీతో సంబంధం ఏంటి..?

ABN, First Publish Date - 2021-06-09T18:09:35+05:30

బార్బరా జరాబికా.. ప్రస్తుతం భారతీయ మీడియాలో నలుగుతున్న పేరు. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఆమె గురించి వస్తున్న వార్తలకు లెక్కే లేదు. కారణం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ..

(మెహుల్ చోక్సీ, బార్బరా జరాబికా ఫైల్ ఫొటోలు)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బార్బరా జరాబికా.. ప్రస్తుతం భారతీయ మీడియాలో నలుగుతున్న పేరు. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఆమె గురించి వస్తున్న వార్తలకు లెక్కే లేదు. కారణం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్ వెనుక ఆమె ప్రధాన పాత్ర పోషించిందన్న ఆరోపణలు రావడమే. పక్కా ప్లాన్‌తో తనను డొమినికాకు రప్పించి బార్బరా జరాబికాయే కిడ్నాప్ చేయించిందని మెహుల్ చోక్సీయే ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆంటిగ్వా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. మెహుల్ చోక్సీ భార్య కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. బార్బరా జరాబికాను భారతీయ ఏజెంట్‌గా ఆమె పేర్కొనడమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా తన భర్తను ట్రాప్ చేయించి డొమినికాకు రప్పించి అరెస్ట్ చేయించారని కూడా ఆమె ఆరోపిస్తోంది. ఈ మొత్తం తతంగంలో బార్బరా జరాబికా పాత్ర రోజు రోజుకు వివాదాస్పంగా మారుతోంది. అసలు ఎవరీ బార్బరా జరాబికా. ఆమెతో చోక్సీకి ఎలా పరిచయం అయింది? ఆమె పిలిస్తేనే చోక్సీ డొమినికాకు వెళ్లారా..?


దాదాపు 13,500 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం బయటపడిన తర్వాత ప్రధాన నిందితులు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలు కుటుంబంతో సహా భారత్ నుంచి పరారయ్యారు. 2018వ సంవత్సరంలో ఈ స్కామ్ బయటపడింది. భారత్‌లో ఉంటే తమ అరెస్ట్ తప్పదని గ్రహించిన నిందితులు ముందే దేశం దాటి పారిపోయారు. మెహుల్ చోక్సీ తన కుటుంబంతో కలిసి కరేబియన్ దీవులయిన ఆంటిగ్వా, బార్బుడాల్లో నివసిస్తున్నాడు. వాస్తవానికి పెద్దమొత్తంలో పెట్టుబడి పెడితే చాలు కరేబియన్ దీవుల్లో ఉండేందుకు పౌరసత్వం ఇస్తారు. అలా ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన చోక్సీ 2018 నుంచి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సోషల్ మీడియా ద్వారా బార్బరా జరాబికా పరిచయం అయింది. ఆమెతో చాటింగ్ చేసేవాడు. ఆ సోషల్ మీడియా పరిచయం కాస్తా వ్యక్తిగత  స్నేహం దాకా దారి తీసింది. 


బార్బరా జరాబికా యూరప్ దేశానికి చెందిన పౌరురాలు. ఆమె సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. తన గురించిన వివరాలను ఎక్కువగా బయటపెట్టలేదు. లింక్‌డ్‌ఇన్ ఖాతాలోని వివరాలను బట్టి ఆమె ప్రోపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ ఏజెంట్‌ అని తెలుస్తోంది. ప్రస్తుతం బల్గేరియాలోనే వ్యాపారం చేస్తోంది. యూరప్‌లోని లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విద్యాభ్యాసం చేసినట్లు ఆ సోషల్ మీడియాలో వివరాలు ఉన్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. లగ్జరీ హోటళ్లలో జల్సాలు, హెలీకాఫ్టర్లలో తిరగడం వంటివి ఎన్నో ఫొటోలు ఆమె ఖాతాలో కనిపిస్తాయి. ఆమె లగ్జరీ లైఫ్ ఏ రేంజ్‌లో ఉంటోందో ఆమె ఖాతాలను చూస్తేనే తెలిసిపోతుంది. అయితే ఆమె చదువు ఈ విషయమై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయాన్ని ఆరా తీస్తే.. ‘ఆమె పేరుతో మా వద్ద ఎవరూ చదువుకోలేదు’ అని తేల్చిచెప్పారు. దానికి సంబంధించిన వార్తలు బయటకు రాగానే లింక్‌డ్‌ఇన్ ఖాతాలోని ఆ వివరాలు కూడా మాయం అయ్యాయి. 


బార్బరా జరాబికా గురించి ఆసక్తికర వివరాలను చోక్సీ భార్య ప్రీతీ వెల్లడించారు. ‘బార్బరా జరాబికా భారతీయ ఏజెంట్ అని నా అనుమానం. ఆమె చోక్సీని కలిసేందుకు పలుమార్లు ఆంటిగ్వాకు వచ్చింది. ప్రస్తుతం ప్రధాన మీడియాల్లో చూపిస్తున్న ఫొటో ఆమెది కాదు. ఆమె వేరే. ఆమె ద్వారా చోక్సీని ట్రాప్ చేయించి అక్రమంగా నిర్బంధించారు’ అని చోక్సీ భార్య ప్రీతి తేల్చేస్తున్నారు. ‘బార్బరా పిలిచినందు వల్లే నేను డొమినికాకు వెళ్లాను. ఆమెతో ఏడాది కాలంగా నాకు పరిచయం ఉంది. మే 23న ఆమె నాకు ఫోన్ చేసింది. ఇంటికి రమ్మని పిలిచింది. సరేనని నేను వెళ్లాను. నేను ఆమె ఇంటికి వెళ్లే సరికి ఓ పది మంది దుండగులు నాపై దాడి చేశారు. కొట్టారు. ఆమె ఇంట్లో నాపై దాడి జరుగుతున్నా బార్బరా చూస్తూ ఉండిపోయిందే తప్ప వారించే ప్రయత్నం చేయలేదు. నన్ను కావాలనే ట్రాప్ చేశారని నాకు అప్పుడే అనిపించింది. నన్ను సృహతప్పేలా కొట్టారు. నా ఫోన్, పర్సు అన్నీ తీసుకున్నారు. ఆ తర్వాత ఏమయిందో ఏమో కానీ నా డబ్బును నాకు తిరిగి ఇచ్చేశారు. ఇదంతా చూస్తోంటే నన్ను ట్రాప్ చేసి అక్రమంగా కిడ్నాప్ చేశారని నాకు అనిపిస్తోంది’ అంటూ చోక్సీ ఆంటిగ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంటిగ్వా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే డొమినికా పోలీసులు చెబుతున్న వెర్షన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. డొమినికాలో రొసెవు తీరంలో చోక్సీ పలు పత్రాలను సముద్రంలోకి విసిరేస్తుండటాన్ని విధుల్లో ఉన్న పోలీసులు చూశారనీ, అతడిని పట్టుకునేందుకు వెళ్తే పారిపోయేందుకు ప్రయత్నించాడని చెబుతున్నారు. ఆయను వెంబడించి పట్టుకున్న తర్వాతే అతడు చోక్సీ అనీ, ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు అతడిపై జారి అయి ఉందని తమకు తెలిసిందని డొమినికా పోలీసులు చెబుతున్నారు. 


ఈ మొత్తం వివాదంలోకి తన పేరును లాగడంపై బార్బరా జరాబికా తీవ్రంగా స్పందించింది. అతడితో తనకు ఎలా పరిచయం అయిందో, తమ మధ్య ఉన్న బంధం ఏంటో కూడా తేల్చిచెప్పింది. ‘మాటి మాటికి నన్ను మెహుల్ చోక్సీ ప్రియురాలు అని పిలవకండి. నేను ఆయన ప్రేయసిని కాదు. అతడి డబ్బుపై ఆధార పడి బతికే గతి నాకు పట్టలేదు. అతడి నుంచి డబ్బును దండుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు. నాకంటూ ఓ వ్యాపారం ఉంది. దాని ద్వారా వచ్చే ఆదాయం ఉంది. అతడు తనను తాను రాజ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామనుకున్నాం. కానీ అతడు మాత్రం నా నుంచి వేరే ఆశించేవాడు. నాకు నకిలీ వజ్రపు ఉంగరాలను, బ్రేస్‌లెట్లను ఇచ్చాడు. ఓ రోజు నన్ను బలవంతం చేయబోయాడు. ఆ సమయంలో నేను వారించేసరికి ఇద్దరి మధ్య గొడవ అయింది. ఆ తర్వాత అతడిని నేను కలవలేదు. అతడి అరెస్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు.’ అని బార్బరా జరాబికా తేల్చిచెప్పింది. 


ఓ ఆర్థిక నేరగాడితో కలిసి వ్యాపారం చేయాలనుకోవడం ఏంటి? అని ప్రశ్నకు బదులుగా.. ‘నేను పుట్టి పెరిగింది యూరప్‌లో. నా చదువంతా అక్కడే సాగింది. నాకు పెద్దగా వార్తలు చూసే అలవాటు లేదు. ఆర్థిక నేరగాళ్లు ఎవరు అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి అసలే లేదు. అతడి పేరు నిజంగానే రాజ్ అనుకున్నాను. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే అతడి పేరు మెహుల్ చోక్సీ అని నాకు తెలిసింది. బహుషా అతడు క్యూబాకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని నా అనుమానం’ అంటూ బార్బరా జరాబికా తేల్చిచెబుతోంది. ప్రస్తుతం డొమినాకా పోలీసుల అదుపులో ఉన్న మెహుల్ చోక్సీ విషయంలో ఆ దేశ న్యాయస్థానం ఏం చేస్తుంది.? బెయిల్ ఇస్తుందా? లేక భారత్‌కు అప్పగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

Updated Date - 2021-06-09T18:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising