యువకుడికి భారీ షాకిచ్చిన న్యాయస్థానం.. సత్ప్రవర్తన హామీపై విడుదల చేయాలని కోరితే.. న్యాయమూర్తి ఇలా..
ABN, First Publish Date - 2021-09-16T01:37:03+05:30
బాండ్‌పై విడుదల చేయాలంటూ వేడుకున్న నిందితుడు.. కోర్టు వెలువరించిన తీర్పు ఏంటంటే.
ముంబై: అతడి నేరం రుజువైంది.. అతడే నిందితుడని న్యాయస్థానం తేల్చింది. ఇక ఏ శిక్ష వేయాలన్నది మాత్రమే మిగిలి ఉంది. ఈలోపు నిందితుడు అబ్రార్ ఖాన్..తనకు జైలు శిక్ష వేయొద్దని న్యాయమూర్తిని వేడుకున్నాడు. తాను ఇకపై సత్ప్రవర్తన కలిగి ఉంటానని పేర్కొన్నాడు. కానీ.. న్యాయస్థానం మాత్రం అతడికి భారీ షాకిచ్చింది. చేసిన నేరానికి గాను అతడికి ఏడాది పాటు జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించింది. అతడి అభ్యర్థనను కోర్టు ఎందుకు తిరస్కరించిందంటే..
వీధిలో తాను నడుచుకుంటూ వెళుతుంటే..నిందితుడు అబ్రార్ ఖాన్ తన చున్నీ పట్టుకుని లాగాడంటూ బాధితురాలు 2016లో కేసు పెట్టింది. ఇది కోర్టుకు వెళ్లింది. కొంత కాలం వాదోపవాదాలు జరిగాయి. చివరికి న్యాయస్థానం అబ్రార్‌ను దోషిగా తేల్చింది. శిక్ష వేయడమే మిగిలి ఉంది. అయితే..నిందితుడు మాత్రం తనకు శిక్ష వేయొద్దని..సత్ప్రవర్తన బాండ్‌పై విడుదల చేయాలంటూ తాజాగా ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టను ఆశ్రయించాడు. ఇకపై మంచిగా నడుచుకుంటానంటూ తాను బాండ్ రాసిచ్చేందుకు సిద్ధమని అభ్యర్థించాడు. ప్రొబేషన్ ఆఫ్ ఆఫెండర్స్ యాక్ట్ కింద ఈ అప్పీలు చేసుకున్నాడు.
కానీ..న్యాయస్థానం మాత్రం అతడి విన్నపాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది. మహిళల మర్యాద, గోప్యత హక్కులకు భంగం కలిగించే నేరాల్లో నిందితులను.. ఇలా బాండ్‌పై విడుదల చేయలేమని స్పష్టం చేసింది. ‘‘నిందితుడు మహిళ పట్ల చాలా అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో..ప్రొబెషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింది అతడిని బాండ్‌పై విడుదల చేస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఈ సౌలభ్యాన్ని అలుసుగా తీసుకుని నిందితుడు..మళ్లీ ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.’’ అని కోర్టు తేల్చి చెప్పింది.
Updated Date - 2021-09-16T01:37:03+05:30 IST