తోక చూపిన తెగువ
ABN, First Publish Date - 2021-08-17T09:22:22+05:30
చివరి రోజు లార్డ్స్‌లో ఏం జరుగబోతోందోననే ఆసక్తితో చూసిన క్రికెట్ ప్రేమికులకు నిజంగా ఇది అత్యద్భుతమైన అనుభవమే.. టెస్టు క్రికెట్ మజా ఏమిటో చూపుతూ బ్యాటింగ్.. బౌలింగ్‌లో భారత క్రికెటర్లు...
- బ్యాటింగ్‌లో షమి, బుమ్రా పోరాటం
- బౌలింగ్‌లో పేసర్ల ప్రతాపం
- లార్డ్స్ టెస్టులో కోహ్లీసేన అద్భుత విజయం
- భారత్ రెండో ఇన్నింగ్స్ 298/8 డిక్లేర్డ్
- ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 120 ఆలౌట్
ఎదురుదాడి అంటే ఇదీ.. డ్రా కోసమైనా ఆడగలదా? అనే స్థాయి నుంచి ప్రత్యర్థినే అలాంటి స్థితికి తెచ్చిన భారత జట్టు పట్టు వదలని పోరాటానికి ప్రతి ఫలమిదీ.. రెండో టెస్టు ఆఖరి రోజు ఓ సమరంలా సాగిందనడంలో అతిశయోక్తి లేదేమో.. బ్యాటింగ్‌లో ఆశలు పెట్టుకున్న పంత్ త్వరగానే అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్టేనని అంతా భావించారు. కానీ అంచనాలను పటాపంచలు చేస్తూ.. అసలు లార్డ్స్‌లో తాము చూస్తోంది కలా.. నిజమా అనే స్థాయిలో షమి, బుమ్రా క్రీజులో నిలిచారు. వుడ్, అండర్సన్‌ల భయానక బౌన్సర్లకు ఒళ్లు హూనమవుతున్నా ఎదురొడ్డి నిలిచారు. తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో వీరందించిన 89 పరుగుల అజేయ భాగస్వామ్యంతోనే భారత్ మ్యాచ్‌ను శాసించే స్థాయికి చేరింది. ఆ తర్వాత 272 పరుగుల ఛేదనలో.. మన పేసర్ల ప్రతాపానికి ఇంగ్లండ్ రెండు సెషన్లు కూడా నిలవలేకపోయింది. దీంతో కోహ్లీ సేన లార్డ్స్‌లో అద్భుత విజయాన్నందుకుంది.
లండన్: చివరి రోజు లార్డ్స్‌లో ఏం జరుగబోతోందోననే ఆసక్తితో చూసిన క్రికెట్ ప్రేమికులకు నిజంగా ఇది అత్యద్భుతమైన అనుభవమే.. టెస్టు క్రికెట్ మజా ఏమిటో చూపుతూ బ్యాటింగ్.. బౌలింగ్‌లో భారత క్రికెటర్లు అసాధారణ పోరాటాన్ని ప్రదర్శించారు. దీంతో రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై కోహ్లీ సేన 151 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో ఉంది. సోమవారం ముందుగా టెయిలెండర్లు మహ్మద్ షమి (70 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56 నాటౌట్), బుమ్రా (64 బంతుల్లో 3 ఫోర్లతో 34 నాటౌట్) ఇంగ్లండ్‌ను వణికిస్తూ జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 109.3 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వుడ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 272 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ పూర్తిగా తడబడి 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. రూట్ (33), బట్లర్ (25) మాత్రమే రాణించారు. సిరాజ్‌కు 4, బుమ్రాకు 3, ఇషాంత్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాహుల్‌కు లభించింది.
రూట్ వ్యూహాన్ని దెబ్బతీస్తూ..: ఓవర్‌నైట్ స్కోరు 181/6తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు చివరి రోజు మిగిలిన ఏకైక బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (22) కాబట్టి భారం కూడా అతడిపైనే ఉంచింది. కానీ 28 పరుగుల వ్యవధిలోనే పంత్, ఇషాంత్ (16)లను రాబిన్సన్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో జట్టు 209 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. అప్పటికి ఆధిక్యం 182 మాత్రమే. ఇక మిగిలింది షమి, బుమ్రా, సిరాజ్ కావడంతో 200 పరుగుల ఆధిక్యంపైనా ఎవరికీ ఆశలు లేని పరిస్థితి. అటు క్రీజులో ఉన్న షమి, బుమ్రాలను కూడా జో రూట్ తేలిగ్గా తీసుకున్నాడు. తమ బౌలర్లు విసిరే బంతులను ఎలాగూ గుడ్డిగా గాల్లోకి లేపుతారనే అంచనాతో ఫీల్డర్లను దూరంగా మోహరించాడు. కానీ అక్కడ జరిగింది వేరు. అతడితోపాటు ఇంగ్లండ్ జట్టుకు కూడా ఈ జోడీ చుక్కలు చూపించింది. అడ్డదిడ్డంగా కాకుండా కచ్చితమైన క్రికెట్ షాట్లతో వీరు అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రమాదకర బంతులను వదిలేస్తూ, షార్ట్ పిచ్ బంతులను దీటుగా ఎదుర్కొన్నారు. పాయింట్‌వైపు ఫోర్‌తో షమి ఖాతా తెరిచాడు. అలాగే అండర్సన్ ఓవర్‌లో ఫ్లిక్ చేస్తూ చక్కటి బౌండరీతో పాటు.. మొయిన్ అలీ ఓవర్‌లో కవర్ డ్రైవ్ ఫోర్ అయితే సూపర్ అనిపించింది. ఇక బుమ్రాను షార్ట్ పిచ్ బంతులతో రెచ్చగొట్టారు. వుడ్, అండర్సన్ బంతులు అతడి హెల్మెట్‌ను బలంగా తాకాయి. కానీ అతడు బెదరకపోగా, మరింత పట్టుదలగా బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఇద్దరూ సునాయాసంగా పరుగులు సాధించడంతో దెబ్బకు రూట్ తన వ్యూహం మార్చాడు. రెగ్యులర్‌గా టెస్టుల్లో కనిపించే స్లిప్‌లో ఇద్దరిని, గల్లీలో మరొకరిని ఉంచాల్సి వచ్చింది. అయినా బుమ్రా డిఫెన్స్, షమి ఎదురుదాడి వారికి చికాకు తెప్పించింది. దీంతో వారు నోటికి పనిచెప్పారు. అలీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో షమి టెస్టుల్లో రెండో ఫిఫ్టీని సాధించాడు. వీరి పోరాటంతో ఈ సెషన్‌లో 4.04 రన్‌రేట్‌తో 105 పరుగులు వచ్చాయి. అలాగే తొమ్మిదో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యంతో లంచ్ బ్రేక్‌కు వెళ్లారు.
నాలుగు వికెట్లతో ఆధిపత్యం: రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ను ఛేదనకు ఆహ్వానిస్తారనుకున్నా కోహ్లీ అలా చేయలేదు. ఆకాశం మబ్బులు పట్టి ఉండడంతో బంతి గమనాన్ని అంచనా వేసే ఉద్దేశంతో తమ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. చివరి 1.3 ఓవర్లు ఆడాక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో భారత్‌కు 271 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ భారత పేసర్లు జోరు చూపారు. ఇంగ్లండ్‌కు తొలి ఓవర్‌లోనే ఝలక్ ఇస్తూ బర్న్స్ (0)ను బుమ్రా.. రెండో ఓవర్‌లో సిబ్లే (0)ను షమి అవుట్ చేయడంతో ఆతిథ్య జట్టు ఆత్మరక్షణలో పడింది. ఈ దశలో రూట్, హమీద్ (9)తో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. అయితే సరిగ్గా టీబ్రేక్ సమయానికి బెయిర్‌స్టో (2)ను ఇషాంత్ ఎల్బీ చేశాడు. రివ్యూ ద్వారా వచ్చిన ఈ ఫలితంతో కోహ్లీ.. ఇషాంత్‌పైకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు.
సిరాజ్ ప్రతాపం: 67/4తో ఇంగ్లండ్ చివరి సెషన్ ఆరంభించగా విజయానికి 36 ఓవర్లలో మరో 205 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 6 వికెట్లే ఉండడంతో డ్రానా లేక భారత్ గెలుపా అనే ఉత్కంఠ నెలకొంది. సెషన్ ఆరంభ ఓవర్‌లోనే అత్యంత కీలక రూట్ వికెట్‌ను బుమ్రా తీయడంతో భారత్ సంబరాల్లో మునిగింది. స్లిప్‌లో ఉన్న కోహ్లీ ఈ క్యాచ్‌ను తీసుకున్నాడు. అయితే బుమ్రా ఓవర్‌లోనే బట్లర్ (25) రెండు పరుగుల వద్ద ఉండగా కోహ్లీ సులువైన క్యాచ్‌ను మిస్ చేశాడు. ఈ దశలో మొయిన్ అలీ (13), బట్లర్ ఓపిగ్గా క్రీజులో నిలిపి కాస్త ఆశలు రేపారు. కానీ 39వ ఓవర్‌లో సిరాజ్ వరుస బంతుల్లో అలీ, కర్రాన్ (0) వికెట్లను తీసి జోష్ నింపాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో రాబిన్సన్ (9)ను బుమ్రా.. బట్లర్‌ను సిరాజ్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఓటమి అంచున నిలిచింది. 52వ ఓవర్‌లో సిరాజ్ చివరి రెండు వికెట్లు తీయడంతో భారత్ నెగ్గింది.
లార్డ్స్ ఆఫ్ కింగ్స్
ఘనస్వాగతం
తొలి సెషన్‌లో అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన షమి, బుమ్రాలను టీమిండియా సముచిత రీతిలో గౌరవించింది. సెషన్ ముగిశాక వారు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వస్తున్న సమయంలో జట్టు సభ్యులు, కోచ్, సహాయక సిబ్బంది అంతా వరుసగా నిలుచొని చప్పట్లతో లోనికి స్వాగతించారు. గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారంటూ బీసీసీఐ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
1
ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టుల్లో తొమ్మిదో వికెట్‌కు భారత్ తరఫున అత్యధిక భాగస్వా మ్యాన్ని (89) నమోదు చేసిన షమి-బుమ్రా జోడీ. 1982లో ఇదే వేదికపై కపిల్-మదన్‌లాల్ (66) రికార్డును అధిగమించారు.
1
లార్డ్స్‌లో ఓ టెస్టు ఇన్నింగ్‌లో వికెట్ దక్కకపోవడం అండర్సన్‌కిదే తొలిసారి.
3
భారత జట్టుకిది లార్డ్స్‌లో మూడో టెస్టు విజయం. గతంలో కపిల్ (1986), ధోనీ (2014) కెప్టెన్సీలో ఈ ఫీట్ సాధించింది. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌లో భారత్‌కిది ఏడో టెస్టు విజయం.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 364
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391
భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజార (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లీ (సి) బట్లర్ (బి) కర్రాన్ 20; రహానె (సి) బట్లర్ (బి) అలీ 61; పంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 22; జడేజా (బి) అలీ 3; ఇషాంత్ (ఎల్బీ) రాబిన్సన్ 16; షమి (నాటౌట్) 56; బుమ్రా (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 109.3 ఓవర్లలో 298/8 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1-18, 2-27, 3-55, 4-155, 5-167, 6-175, 7-194, 8-209. బౌలింగ్: అండర్సన్ 25.3-6-53-0; రాబిన్సన్ 17-6-45-2; వుడ్ 18-4-51-3; సామ్ కర్రాన్ 18-3-42-1; మొయిన్ అలీ 26-1-84-2; రూట్ 5-0-9-0.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 0; సిబ్లే (సి) పంత్ (బి) షమి 0; హమీద్ (ఎల్బీ) ఇషాంత్ 9; రూట్ (సి) కోహ్లీ (బి) బుమ్రా 33; బెయిర్‌స్టో (ఎల్బీ) ఇషాంత్ 2; బట్లర్ (సి) పంత్ (బి) సిరాజ్ 25; మొయిన్ అలీ (సి) కోహ్లీ (బి) సిరాజ్ 13; కర్రాన్ (సి) పంత్ (బి) సిరాజ్ 0; రాబిన్సన్ (ఎల్బీ) బుమ్రా 9; వుడ్ (నాటౌట్) 0; అండర్సన్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు: 29; మొత్తం: 51.5 ఓవర్లలో 120 ఆలౌట్. వికెట్ల పతనం: 1-1, 2-1, 3-44, 4-67, 5-67, 6-90, 7-90, 8-120, 9-120, 10-120. బౌలింగ్: బుమ్రా 15-3-33-3; షమి 10-5-13-1; జడేజా 6-3-5-0; సిరాజ్ 10.5-3-32-4; ఇషాంత్ 10-3-13-2.
Updated Date - 2021-08-17T09:22:22+05:30 IST