కోహ్లీ, ఇతర సీనియర్ ఆటగాళ్లు ఏం చెయ్యాలో చెప్పిన ఇంజమామ్
ABN, First Publish Date - 2021-08-29T20:52:09+05:30
టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా వంటివారు
ఇస్లామాబాద్: టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా వంటివారు తమ సెంచరీల మధ్య ఎక్కువ రోజుల గ్యాప్ లేకుండా చూసుకోవాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ పేర్కొన్నాడు. కోహ్లీ ఖాతాలో దాదాపు రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా లేదని, పుజారా, రహానే విషయంలోనూ ఇలాగే ఉందని గుర్తు చేశాడు. వీరు చేతులెత్తేయడంతో యువ ఆటగాళ్లపైనే భారం మొత్తం పడుతోందని తన యూట్యూబ్ చానల్‌లో పేర్కొన్నాడు.
రిషభ్ పంత్ బాగానే పరుగులు సాధిస్తున్నాడని, రవీంద్ర జడేజా కూడా తన వంతు సహకారం అందిస్తుండగా, అశ్విన్ కూడా బాగానే రాణిస్తున్నాడని ఇంజీ పేర్కొన్నాడు. జట్టులో అనుభవం ఉన్నవాళ్లతో పోలిస్తే యువకులే బాగా రాణిస్తున్నారని ప్రశంసించాడు. హెడింగ్లీ టెస్టులో పుజారా 91, కోహ్లీ 55 పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో వీరిద్దరికీ ఇవే తొలి అర్ధసెంచరీలు. లార్డ్స్ టెస్టులో రహానే కీలక సమయంలో అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ సగటు 24.80 కాగా, రహానే సగటు 19.00, పుజారా సగటు 32.40గా ఉంది.
పెద్ద సిరీస్‌లలో అనుభవం ఉన్న ఆటగాళ్లు ముందుండి నడిపించకపోతే జట్టు కష్టాల్లో పడుతుందని ఇంజీ అన్నాడు. విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడని, పుజారా, రహానే మంచి టెస్టు ఆటగాళ్లని పేర్కొన్న ఇంజమామ్.. వీరి సెంచరీల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే యువ ఆటగాళ్లపై ఒత్తిడి పడుతుందన్నాడు. వారు తరచూ అదే రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ పోతే వారు కూడా ఇబ్బందుల్లో పడతారని పేర్కొన్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో అదే జరుగుతోందని ఇంజమామ్ వివరించాడు.
Updated Date - 2021-08-29T20:52:09+05:30 IST