95.22 ఎకరాల్లో రీ సర్వే
ABN, First Publish Date - 2021-05-18T07:39:42+05:30
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూవివాదంపై విచారణ వేగవంతంగా సాగుతోంది.
- ‘ఈటల’ భూ వివాదంపై విచారణ వేగవంతం
- గ్రామ కార్యదర్శులను విచారించిన
- ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు
- కార్యదర్శుల స్టేట్‌మెంట్లు రికార్డు చేశాం
- 27, 29న రెండు గ్రామాల్లో సర్వే చేస్తాం
- 25న రైతులతో విచారణ జరుపుతాం
- మాసాయిపేట, వెల్దుర్తి తహసీల్దార్ల వెల్లడి
- ఈటల ఆర్థిక మూలాలపై దెబ్బ!
- గోడౌన్ల నుంచి మద్యం సరఫరా నిలివేత
మెదక్, మే 17 (ఆంధ్రజ్యోతి)/మేడ్చల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూవివాదంపై విచారణ వేగవంతంగా సాగుతోంది. హైకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం రీ సర్వేకు సిద్ధమవుతోంది. 95.22 ఎకరాల్లో రెవెన్యూ అధికారులు రీ సర్వే చేయనున్నారు. ఈ మేరకు జమున హేచరీస్ యాజమాన్యంతోపాటు, అసైన్డ్, సీలింగ్ భూముల కబ్జాలో ఉన్న వారందరికీ మెదక్ జిల్లా మాసాయిపేట తహసీల్దార్ మాలతి నోటీసులు జారీ చేశారు. భూ వ్యవహారంపై సోమవారం మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల కార్యదర్శులు జానకీరాం, దేవేందర్‌లను ఏసీబీ, విజిలెన్స్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. మే 25న మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో అసైన్డ్, సీలింగ్ భూములకు సంబంధించిన రైతులను పిలిపించి విచారణ జరుపుతామని వెల్దుర్తి, మాసాయిపేట తహసీల్దార్లు సురేశ్ కుమార్, మాలతి వెల్లడించారు. మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. భూ వ్యవహారంపై అచ్చంపేట, హకీంపేట గ్రామాల కార్యదర్శుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశామన్నారు. ఈ నెల 27, 29న అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లోని 95.22 ఎకరాల్లో సర్వే చేస్తామని తెలిపారు. అసైన్డ్, సీలింగ్ భూములకు సంబంధించి 75 మంది రైతులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అచ్చంపేటలోని సర్వే నంబరు 77, 78, 79, 80, 115, 130తో పాటు హకీంపేటలో సర్వే నంబరు 97తో కలిపి 95.22 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని వారు చెప్పారు.
పత్రాల్లేకుండానే ఎన్‌వోసీ
జమున హేచరీస్ యాజమాన్యం 2018లో అచ్చంపేటలోని సర్వే నంబరు 55, 124, 126, 127, 128, 129లో ఉన్న 40 ఎకరాల పట్టా భూమికి ఎటువంటి పత్రాలు లేకుండానే ఎన్‌వోసీ తీసుకున్నట్లు గుర్తించామని తహసీల్దార్లు సురేశ్ కుమార్, మాలతి చెప్పారు. 2019లో మరోసారి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తీసుకొచ్చి సర్వే నంబరు 130లో 18.35 ఎకరాలకు బలవంతంగా ఎన్‌వోసీ తీసుకున్నట్లు వెల్లడించారు. 2018, 2019లో ఎన్‌వోసీ కోసం చేసుకున్న ధరఖాస్తును గమనిస్తే సర్వే నంబర్లలో తేడా ఉన్నట్లు తేలిందన్నారు. 130 సర్వే నంబరులో 3 ఎకరాలు పట్టా భూమి అయితే మిగిలిన 15.35 ఎకరాల భూమి అసైన్డ్ భూమి అని వారు పేర్కొన్నారు. మరోవైపు హకీంపేటలో సర్వే నంబరు 111లోని 7 ఎకరాల్లో జమున హేచరీస్ యాజమాన్యం అనధికారికంగా ఫీడ్ ప్లాంట్ నిర్మిస్తోందని తెలిపారు. అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న ఫీడ్ ప్లాంట్ పనులను ఆపివేయాలని గ్రామ కార్యదర్శి హేచరీస్ యాజమాన్యానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శి హేచరీస్ యాజమాన్యానికి రెండు సార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మే 10న పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసులకు హేచరీస్ యాజమాన్యం వివరణ ఇచ్చిందన్నారు. అలాగే అచ్చంపేటలో 81 సర్వే నంబరులో 5.35 ఎకరాల్లో అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించామని తహసీల్దార్లు చెప్పారు. కాగా, అచ్చంపేట, హకీంపేట గ్రామాల కార్యదర్శుల స్టేట్‌మెంట్ల రికార్డు పూర్తికాగానే కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈటల రాజేందర్‌ను అరెస్టు చేస్తారంటూ వదంతులు వచ్చాయి. ఈటలను అరెస్టు చేయడానికి ఏసీబీ, విజిలెన్స్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ జరుపుతున్నారంటూ ప్రచారం జరిగింది.
ఈటల ఆర్థిక మూలాలపై దెబ్బ!
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం ముప్పేట దాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో ఈటల భార్య జమున పేరిట పెద్ద ఎత్తున గోదాములు ఉన్నాయి. కొన్ని గోదాముల్లో తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్.. మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే స్టాక్ పాయింట్ల (మేడ్చల్-1డిపో)ను ఏర్పాటు చేసింది. మేడ్చల్-1 డిపో నుంచి కుత్బుల్లాపూర్, బాలానగర్, శామీర్‌పేట్, మేడ్చల్, కాళ్లకల్ తదితర ప్రాంతాల్లోని 75 మద్యం దుకాణాలు, 45 బార్లకు ప్రతిరోజూ మద్యం సరఫరా అవుతోంది. అయితే.. సోమవారం నుంచి మేడ్చల్-1 డిపో నుంచి మద్యం సరఫరా నిలిపివేస్తున్నట్లు డిపో మేనేజర్ ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని, మద్యం వ్యాపారులు సమీపంలోని హైదరాబాద్ డిపో-2 నుంచి, బాలానగర్ సర్కిల్ వారు మేడ్చల్-2 డిపో నుంచి మద్యాన్ని తీసుకెళ్లాలని ఆయన సందేశం పంపారు. దేవరయాంజాల్‌లోని దేవాదాయ భూములపై ఐఏఎ్‌సల కమిటీ విచారణ కొనసాగుతుండగానే.. ఈటలకు చెందిన గోదాముల నుంచి మద్యాన్ని ఖాళీ చేయడం గమనార్హం. మొత్తానికి ఈటల ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.
Updated Date - 2021-05-18T07:39:42+05:30 IST