Telangana కాంగ్రెస్‌లో కోవర్టులు.. కండువా పార్టీదే కానీ గుండెల్లో మాత్రం TRS.. ఆ అంకుల్ అంటే కవితకు ప్రత్యేక అభిమానం!
ABN, First Publish Date - 2021-08-08T20:26:45+05:30
ఆ కాంగ్రెస్ అంకుల్ అంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా విపరీతమైన అభిమానం చూపుతారట....
కాంగ్రెస్‌లో కేసీఆర్ దోస్తులెంతమంది ఉన్నారనే లెక్కతీస్తున్నారట అసలైన హస్తం పార్టీ నేతలు. ఇన్నాళ్లు కాంగ్రెస్ సొమ్ము తింటూ గులాబీ బాసుకు గుసగుసలు చెప్పుతున్న వారి చిట్టాపద్దులు అన్నీ హైకమాండ్‌కు ఇప్పుడిప్పుడే చేరుతున్నాయట. ఆపరేషన్ ఆకర్ష్ కంటే ముందు ఆపరేషన్ కోవర్ట్ సంగతేందో చూడాలనుకుంటున్నారట. దీంతో ఇన్నాళ్లూ కాంగ్రెస్ జెండా మోసినట్లు నటిస్తున్న వారు గూడుమారక తప్పని పరిస్థితులు రాబోతున్నాయట. ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో కోవర్టులెవరని కొత్త కమిటీ భావిస్తోంది. వారిని గుర్తుపట్టి ఏరిపారేయడం వీరితో సాధ్యమేనా? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.
ఇంటి దొంగల భరతం పట్టాల్సిందే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునర్‌వైభవం సాధించాలంటే ఇంటిదొంగల భరతం పట్టాలని డిసైడ్ అయిందట కొత్త పీసీసీ కమిటీ. హస్తం పార్టీలో ఉంటూ అధికార టీఆర్‌ఎస్‌కు.. పార్టీ గుట్టు విప్పుతున్న వారి సంగతి ఏందో చూడాలని అనుకుంటున్నారట. కోవర్టులను ఏరిపారేయకుంటే ఎన్ని ఆకర్షణమంత్రాలేసినా చింతకాయలు రాలయని భావిస్తున్నారట. కాంగ్రెస్ కండువా కప్పుకుని గుండెలో గులాబీలు నింపుకుంటున్నవారి భజన రహస్యాన్ని బద్దలు కొట్టాలని చూస్తున్నారట.
కనుమరుగైన కాంగ్రెస్..!
మొత్తానికి వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా జిల్లాలో కనుమరుగైపోయింది. ఆ తర్వాత జరుగుతున్న కార్యక్రమాల్లో కాంగ్రెస్ హడావుడి కనిపించడం లేదు. ప్రతిపక్షపాత్ర పోశించాల్సిన నేతలు సైలెంట్‌గా ఎందుకు ఉంటున్నారనే అనుమానపు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడిన కోవర్టు ముచ్చట్లు పార్టీలోని నేతల ప్రవర్తనపై కార్యకర్తల్లో అనుమానపు బీజాలు నాటుతున్నాయి. పార్టీలో హావా కొనసాగించిన నేతలు కాంగ్రెస్‌కు ద్రోహం చేస్తూ అధికారపార్టీతో అంటకాగారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ను భుజాలమీద మోస్తున్నట్లు నటిస్తూ అధికార టీఆర్‌ఎస్ గెలుపునకు కోవర్టులుగా సహకరించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
చక్రం తిప్పిన షబ్బీర్, సుదర్శన్ రెడ్డి!
కేసీఆర్ ఆకర్షణ దెబ్బకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతూ వస్తోంది. వేళ్లమీద లెక్కబెట్టగలిగేలా మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి మైనార్టీ నేత షబ్బీర్ అలీ వంటి సీనియర్లు మాత్రమే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. గౌడ్‌లిద్దరికి రేవంత్ సారథ్యంలోని కమిటీలో మంచి పదవులే దక్కాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో పి. సుదర్శన్‌రెడ్డి, కామారెడ్డిలో షబ్బీర్ అలీ ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చక్రం తిప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు అన్నీతామై హవా కొనసాగించి పార్టీ టికెట్లు వారి చేతుల మీదుగానే ఇచ్చినట్లు కార్యకర్తలు అనుకుంటున్నారు.
కోవర్టులు వారేనా..!?
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ పార్టీలోని కోవర్టులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఈయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని కోవర్టు ఆపరేషన్ గురించి మాట్లాడారని అందరూ అనుకుంటున్నారట. పార్టీలో ఇన్నాళ్లూ చక్రం తిప్పి ఆపదకాలంలో చేతులేస్తున్న నేతలు ఫలానా ఫలానా వారే కోవర్టులు కావచ్చని అనుకుంటున్నారట కార్యకర్తలు.
అడిగేవారే లేరా..!
కాంగ్రెస్ నుంచి కార్యకర్తలు విధిలేక టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేలా, మిగిలిన కార్యకర్తలను పోటీకి దింపి అధికారపార్టీ చేతిలో ఓడించేలా చేసిన నేతలు జిల్లాను విడిచి హైదరాబాద్‌కు వెళ్లి సైలెంట్ అయ్యారనే టాక్ వస్తోంది. నేతలు గమ్మున ఉంటుండంతో అక్కడక్కడ గెలిచిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యకర్తలు కూడా రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ గులాబీ నేతల పంచన చేరారు. అడిగేవారు లేక పోవడంతో కాంగ్రెస్ ముఖ్య నేతలుగా చలామణి అయిన వారు వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు.
కొడుకు భవిష్యత్తు కోసం..!
డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన మరో నేత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన కొంతకాలంగా గులాబీ నేతల సేవలో తరిస్తున్నారని అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడిపోతున్నారు. ఆయన వెంట నిజామాబాద్ నగరానికి చెందిన నేతలు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకుని గులాబీ నేతలకు పని చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఇంతకీ ఎవరాయన..!?
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత ఇప్పటికీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల ద్వారా వ్యాపార లావాదేవీలు నడపడంతో పాటు ఏకంగా వ్యక్తిగత సలహాదారుడిగా కొనసాగుతున్నారనే టాక్ వస్తోంది. పార్టీకి పరోక్ష సహకారం చేస్తున్న ఆ కాంగ్రెస్ అంకుల్ అంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా విపరీతమైన అభిమానం చూపుతారట. పైకి ప్రతిపక్షమే అయినా, అంతర్గతంగా మాత్రం ఆయన టీఆర్ఎస్ భజన చేస్తున్నారు.
అగ్ర నేతలతో టచ్‌లో..
కామారెడ్డి జిల్లాకు చెందిన ముఖ్య నేతలిద్దరు టీఆర్ఎస్ అగ్ర నేతలతో టచ్‌లో ఉన్నారట. సొంత నియోజకవర్గాల్లో తొడలు కొట్టే ఆ నేతలు హైదరాబాద్ స్థాయిలో మాత్రం నోరు విప్పడం లేదు. గతంలోనే టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన ఆ నేతలు ఇప్పటికీ గులాబీ నేతలకు సహకరిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. కొత్త కమిటీతో బాగా దగ్గరగా ఉన్నట్లు కవరింగ్ ఇస్తున్న నేతలు పార్టీ ముచ్చట్లను అపోజిషన్ గులాబీ దళానికి డైలీ సీరియల్‌గా చేరవేస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏం చర్యలు తీసుకుంటారో..!?
కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉనికి లేకపోగా, అక్కడకక్కడ ఉన్న నేతలు కూడా కోవర్టులుగా మారడంతో అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించింది. ఇలాంటి నేతల జాబితాను ఈ పాటికే సిద్ధం చేసింది. అయితే, కొత్త చేరికలకు తలుపులు తెరిచిన కాంగ్రెస్ పెద్దలు, ఇలాంటి కోవర్టులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!
Updated Date - 2021-08-08T20:26:45+05:30 IST