కష్టాల్లో కామన్ ఫెసిలిటీ సెంటర్
ABN, First Publish Date - 2022-01-01T04:10:25+05:30
సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మండల కేంద్రంలోని కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) ప్రభుత్వ ఆర్డర్లు లేక మూతపడింది. దీంతో కార్మికులకు ఉపాధి కరువైంది.
- పనులు లేక మూతపడ్డ వైనం
- ప్రభుత్వ అర్డర్లు లేక కార్మికులకు ఉపాధి కరువు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
- ఆందోళనలో కార్మికులు
వాంకిడి, డిసెంబరు 30: సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మండల కేంద్రంలోని కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) ప్రభుత్వ ఆర్డర్లు లేక మూతపడింది. దీంతో కార్మికులకు ఉపాధి కరువైంది. గతంలో 60మందికి పైగా కార్మికులకు ఉపాధినందించిన ఈ పరిశ్రమ నేడు పనులు లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిశ్రమపైనే ఆధారపడ్డ కార్మికులు ఉపాధి దొరకక వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు దృష్టిసారిస్తే పరిశ్రమకు పూర్వవైభవం వస్తుంది.
సీఎఫ్‌సీ ప్రస్థానం..
1970లో వృత్తి శిక్షణ కసం సీఎఫ్‌సీని వాంకిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. 1980లో సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ (ఐటీడీఏ) ఆధీనంలోకి తీసుకుని ఈ కేంద్రంలో కర్రతో ఫర్నీచర్ తయారీలో శిక్షణతో పాటు కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వచ్చింది. 1987-88లో ఐటీడీఏ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం షెడ్లు, భవనాలు నిర్మించి ఫర్నీచర్ తయారీకి అవసరమైన పరికరాలను సమాకూర్చారు. 1991నాటికి 335మందికి వృత్తిశిక్షణ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాకున్నా ఇక్కడ తయారు చేసిన ఫర్నీచర్ విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంతో పరిశ్రమను అభివృద్ధి దిశలో కార్మికులు కొనసాగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పది పరిశ్రమల్లో ఈ సీఎఫ్‌సీ ఒక్కటే నిలదొక్కుకుంది.
ఫర్నీచర్ తయారీలో కార్మికులు దిట్ట
కలపతో అందమైన వస్తువులు తయారు చేయడంలో ఇక్కడి కార్మికుల ప్రతిభ అమోఘం. భవనాలకు అమర్చే తలుపులు, కిటికీలు, టేబుళ్లు, సోఫాసెట్‌లు, రాకింగ్‌చేర్లు, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, తదితర వస్తువులు తయారు చేస్తారు. వాటి రూపక్పనలో కార్మికులు తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తారు. కలపతో ఫర్నీచరే కాకుండా ఇను ముతో బీరువాలు, బెడ్‌లు, డ్యూయల్ డెస్క్‌లు తదితర వస్తువులు తయారుచేస్తుంటారు. ప్రస్తుతం కలప దొరకకపోతుండడంతో ఇను ముతోనే వస్తువులను తయారు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆర్డర్లు లేక కరువైన ఉపాధి
2012లో పనులు లేక ఈ పరిశ్రమ సంక్షభంలో చిక్కుకుంది. అప్పటి నుంచి జూలై 2015 వరకు పరిశ్రమ మూతపడింది. దీంతోఈ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఐటీడీఏ పీవో ఆర్‌వీ కర్ణన్ సీఎఫ్‌సీ సందర్శించి పరిశ్రమను పునరుద్దరించే దిశగా చర్యలు తీసుకున్నారు. రూ.6లక్షల కార్పస్ నిధులను మంజూరు చేసి తిరిగి సీఎఫ్‌సీని పునఃప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వం నంచి ఎలాంటి ఆర్డర్లు లేకపోవడంతో పనులు జరుగక కార్మికులకు ఉపాధికరువైంది. కొన్ని నెలల పాటు కార్మికులు మండల కేంద్రంలోనే కాకుండా పరిసర మండలాలకు వెళ్లి నూతన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన చిన్న చిన్న ఆర్డర్లు తీసుకుని పనులు చేసుకున్నారు. తరువాత అవికూడా లేకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఎనిమిది నెలలక్రితం ప్రస్తుత కలెక్టర్ రాహుల్‌రాజ్ రూ.4.50లక్షల బెంచీలు తయారు చేసేందుకు ఆర్డర్ ఇవ్వడంతో కొన్ని నెలల పాటు పరిశ్రమ కొనసాగింది. తరువాత ఆర్డర్లు లేక తిరిగి మూతపడింది. జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినట్లైతే సీఎఫ్‌సీకి పూర్వవైభం రానుంది.
ప్రభుత్వ ఆర్డర్లు రావడంలేదు
మడావి పైకాజీ, పర్యవేక్షకుడు
సీఎఫ్‌సీకి ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో ఉపాధి తగ్గింది. గతంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఫర్నీచర్ ఆర్డర్లు వచ్చేవి. దీంతో కార్మికులకు ఉపాధి దొరికేది. ప్రస్తుతం ఆర్డర్లు లేక పోవడంతో పనులు లేక మూతపడింది. సీఎఫ్‌సీకి ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు చేశాం.
పరిశ్రమ మూతపడకుండా చూడాలి
పాగిడి కొండయ్య, కార్మికుడు
ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాం. ప్రభుత్వ ఆర్డర్లు లేక కార్మికులకు ఉపాధి దొరకడంలేదు. ఈ పరిశ్రమ మూతపడితే వీధిన పడాల్సి వస్తుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆర్డర్లు ఇచ్చే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
Updated Date - 2022-01-01T04:10:25+05:30 IST