పట్టు తప్పుతున్న పాలన!
ABN, First Publish Date - 2021-12-19T06:07:26+05:30
పల్లె ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన పంచా యతీలే పట్టుతప్పి పోతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ ప్రథమ పౌరులైన పంచాయతీ బాస్ లే అవినీతి మరకలను అంటించుకుంటున్నారు. ఎన్నికల్లో చేసిన ఎన్నో బాసలను మరిచిపోయి అక్రమ సంపాదనకు
పంచాయతీల్లో నిధుల గోల్‌మాల్‌పై సర్పంచ్‌ల సస్పెన్షన్
ఇప్పటికే పలువురిపై అవినీతి ఆరోపణలు
ప్రజాధనం దుర్వినియోగంపై కరువైన సంబంధిత అధికారుల చర్యలు
ఫిర్యాదు చేస్తేనే.. జిల్లా అధికారుల హడావుడి
రాజకీయ ఒత్తిళ్లతో వెనుకాడుతున్న వైనం
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ప్రజాప్రతినిధులు
జిల్లావ్యాప్తంగా మొత్తం 468 గ్రామ పంచాయతీలు
ఆదిలాబాద్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పల్లె ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన పంచా యతీలే పట్టుతప్పి పోతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ ప్రథమ పౌరులైన పంచాయతీ బాస్ లే అవినీతి మరకలను అంటించుకుంటున్నారు. ఎన్నికల్లో చేసిన ఎన్నో బాసలను మరిచిపోయి అక్రమ సంపాదనకు ఆరాట పడుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్క పెట్టుకోవా లన్న చందంగా కొందరు సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కా ర్యదర్శుల తీరు కనిపిస్తోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎంతకైనా తెగిస్తున్నారు. 2019 జనవరి 26న కొలువుధీరిన సర్పంచ్‌లు.. వారి పదవి కాలం 2024 జనవరి 26తో ముగిసిపోనుంది. మూడేళ్ల కాలం ముగియక ముందే పలువురు సర్పంచ్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఐదు లక్షలకు పైగా గ్రామీణ జనాభా నివసిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10మంది సర్పంచ్‌లపై అవినీతి ఆరోప ణలు రాగా, ముగ్గురు సర్పంచ్‌లపై జిల్లా ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మరికొన్ని పంచాయతీలపై విచారణ కొనసాగుతోంది. మరికొంత మంది సర్పంచ్, ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్‌ను రద్దు చేశారు. గతంలోనూ లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు రుజువైనా.. అధికారులు ఇప్పటి వరకు రూపాయి కూడా రికవరీ చేసినట్లు కనిపించడం లేదు. కొన్ని సందర్భాల్లో పంచాయతీల అవినీతిపై త్రిసభ్య కమిటీని వేసి చేతులు దులుపుకున్నారే తప్ప కఠినమైన చర్యలు చేపట్టకపోవడంతో పంచాయతీలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కేవలం ఫిర్యాదులు రావడంతో నోటీసులు ఇవ్వడం అధికారులకు పరిపాటిగా మారింది. చట్టప్రకారం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని పదవి నుంచి పూర్తిగా తొలగించాల్సిన ఎంతైనా అవసరం ఉంది.
ఫ నామమాత్రంగానే చర్యలు
జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ లపై అధికారులు నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా కేవలం ముగ్గురు సర్పంచ్‌లను మాత్రమే సస్పెన్షన్‌కు గురి చేసి మిగితా వారిపై చర్యలు తీసుకోక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైనథ్ మండలం బోరజ్ సర్పంచ్‌తో పాటు ఉట్నూర్ మండలం హస్నాపూర్ సర్పంచ్‌లను సస్పెండ్ చేశారు. తాజాగా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి కుమ్మకై నిధులను దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో కలెక్టర్ సస్పెన్షన్ చేశారు. అయితే ఇప్పటికే హస్నాపూర్ సర్పంచ్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో తిరిగి పదవిలో కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితులే మరెన్నో గ్రామాల్లో కొనసాగుతున్న అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొరవడడంతో అవినీతి అక్రమాలు బయట పడడం లేదు. గ్రామ ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులకు తెలియడం లేదంటే పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఇట్టే స్పష్టమవుతుంది. ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి పంచాయతీల వారిగా జరిగిన అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరెన్నో విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి.
ఫ తిరిగి రాబట్టుకునే ఆరాటం
గత ఎన్నికల్లో భారీగా ఖర్చుపెట్టి గెలుపొందిన సర్పంచ్‌లు.. ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు అక్రమ సంపాదన కోసం ఆరాటపడుతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షల రూపాయలను వెనుకేసుకుంటున్నారు. అలాగే స్థిరాస్థి వ్యాపారంలోనూ రాణిస్తూ బోలెడన్ని ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. సబ్సిడీ రుణాలను కూడా వదిలి పెట్టకుండా లబ్ధి పొందుతున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న గ్రామ పంచాయతీల్లో భారీ అవినీతి అక్రమాలు జరు గుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే పలు మండల కేంద్రాల్లోని పంచాయతీ సర్పంచ్‌లు రియల్ మాఫియాకు పరోక్షంగా సహకరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఏజెన్సీ గ్రామ పంచాయతీల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్లకు అనుమతులనిస్తూ లక్షల రూపాయలను జేబులో వేసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రతీ పనికి లెక్క గడుతూ ఎంతో కొంత ఆశిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
పంచాయతీ కార్యదర్శిపై ఎంపీడీవోకు ఫిర్యాదు
: గోవింద్, సర్పంచ్, జెండాగూడ, సిరికొండ మండలం
పంచాయతీ కార్యదర్శి దయానంద్ సక్రమంగా విధులకు రావడం లేదని ఎంపీడీవోకు ఫిర్యాదు చేశాం. బిల్లులపై సంతకం చేయమంటే ఇబ్బందులు పెడుతున్నారు. ఉన్నతాధికారులతో సమావేశాలు ఉన్నాయంటూ తప్పించుకుంటున్నారు. పంచాయతీ అభివృద్ధికి సహకరించడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు.
ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నాం
: శ్రీనివాస్, డీపీవో, ఆదిలాబాద్
గ్రామ పంచాయతీలపై ఫిర్యాదులు రావడంతో పరిశీలించి చర్యలు తీసుకుంటు న్నాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ముగ్గురు సర్పంచ్‌లను సస్పెన్ష న్ చేశాం. ప్రభుత్వం కేటాయిస్తున్న నిదులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధుల్లో అవకతవకలు జరిగినట్లు మా దృస్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మరికొంత మంది సర్పంచ్‌లపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరుపుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నిధులను రికవరీ చేస్తాం.
Updated Date - 2021-12-19T06:07:26+05:30 IST