రాజకీయ జోక్యంతో మాస్టర్ ప్లాన్‌కు మంగళం
ABN, First Publish Date - 2021-11-30T03:37:04+05:30
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలుకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాజకీయ జోక్యంతో మాస్టర్ ప్లాన్ మరుగున పడగా రహదారుల సౌకర్యం లేక ప్రజలు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన మంచిర్యాల మున్సిపాలిటీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.
బైపాస్ రోడ్ల నిర్మాణానికి అడ్డంకులు
అర్థాంతరంగా నిలిచిపోయిన శ్రీశ్రీనగర్ రోడ్డు
మాస్టర్ ప్లాన్ అమలులో మున్సిపాలిటీ విఫలం
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు
మంచిర్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలుకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాజకీయ జోక్యంతో మాస్టర్ ప్లాన్ మరుగున పడగా రహదారుల సౌకర్యం లేక ప్రజలు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన మంచిర్యాల మున్సిపాలిటీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ నాటి నుంచి మంచిర్యాల పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. విద్య, వైద్యంతోపాటు ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజల వలసల కారణంగా పట్టణంలో జనసంచారం అధికమవడంతో పట్టణం వేగంగా విస్తరిస్తోంది. వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న మంచిర్యాలలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.
మాస్టర్ ప్లాన్ అమలుకు అడ్డంకులు
పట్టణం శరవేగంగా విస్తరిస్తుండటంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. 1972లో ఒకసారి, 2012లో మరోసారి మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పటికీ దాన్ని అమలు చేయకపో వడం పట్టణ ప్రజలకు శాపంగా మారింది. మాస్టర్ ప్లాన్‌ను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటు చేసి అమ్ముకున్నారు. మొదటిసారి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో రెండోసారి మార్పులు జరిగినప్పటికీ వాటిని పట్టించుకోకుండా వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయాలు సాగించడంతో రహదారుల నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. వెంచర్లు ఏర్పాటు చేసిన వారే తమ భూములు రోడ్ల కింద పోతున్నాయంటూ పరిహారం కోరడంతో మున్సిపల్ అధికారులు చేతులెత్తేశారు. మాస్టర్ ప్లాన్ రూపొందించిన వెంటనే రోడ్లను గుర్తిస్తూ మున్సిపాలిటీ మార్కింగులు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.
నిలిచిన 100 ఫీట్ల రోడ్డు
1972 మాస్టర్ ప్లాన్ ఆధారంగా ప్రధాన రహదారులకు అంతర్గత రోడ్లను కలుపుతూ ప్రణాళిక తయారు చేశారు. భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని బైపాస్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం కొన్ని కారణాల వల్ల 2012లో తిరిగి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి, రోడ్ల నిర్మాణ నమూనాను ఏర్పాటు చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం మంచిర్యాల - గోదావరిఖని జాతీయ రహదారిని ఆనుకొని శ్రీశ్రీనగర్ నుంచి తిలక్‌నగర్, రాముని చెరువు మీదుగా మంచిర్యాల - బెల్లంపల్లి ప్రధాన రహదారిలో లక్ష్మీ టాకీస్ వరకు 100 ఫీట్ల బైపాస్ రోడ్డు నిర్మించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అప్పట్లో శ్రీశ్రీ నగర్ వద్ద కొద్దిమేర రోడ్డు నిర్మాణం చేపట్టగా లయన్స్‌క్లబ్ భవనం వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. సుదీర్ఘ కాలం తరువాత తిరిగి రోడ్డును కొనసాగించే క్రమంలో ఇటీవల టీయూఎఫ్‌ఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ) నిధులు దాదాపు రూ. 200 కోట్ల అంచనాతో సుమారు 1300 మీటర్ల మేర నిర్మాణాన్ని చేపట్టారు. మొదట మట్టితో రోడ్డు నిర్మాణం చేపట్టి, అనంతరం బీటీ వేయాల్సి ఉండగా ప్రజల నుంచి అభ్యంతరాలు వెలువడటంతో రెండు చోట్ల రహదారి నిర్మాణం నిలిచిపోయింది. బైపాస్ రోడ్డు పట్టా భూముల నుంచి వెళ్తుండటంతో కొందరు రోడ్డు నిర్మించకుండా అడ్డుగా ట్రెంచ్ తవ్వడంతో రోడ్డు పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో బైపాస్ పక్కనే ఉన్న మరో 100 ఫీట్ల రోడ్డుకు లింకు చేస్తూ మున్సిపల్ అధికారులు 30 ఫీట్ల వెడల్పుతో సుమారు 75 మీటర్ల పొడవుతో రెండు రహదారులను కలిపేలా సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేశారు. దీనిని సైతం ప్రజలు అడ్డుకోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అలాగే స్థానిక పోచమ్మ గుడి వద్ద కూడా కొందరి అభ్యంతరాల వల్ల రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది.
మరో బైపాస్ రోడ్డుదీ అదే పరిస్థితి
పట్టణంలోని వైశ్యాభవన్ సమీపంలో నిర్మించ తలపెట్టిన 80 ఫీట్ల బైపాస్ రోడ్డుదీ అదే పరిస్థితి. వైశ్యాభవన్ దగ్గర మెయిన్ రోడ్డు నుంచి ఎన్టీఆర్‌నగర్ మీదుగా గోదావరి వరకు రెండు మాస్టర్ ప్లాన్లలో ప్రతి పాదించిన 80 ఫీట్ల రోడ్డుకు పట్టేదారులు అడ్డుపడుతున్నారు. దీంతో రోడ్డు, డ్రైనేజీలు లేక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణం తెరపైకి రావడంతో ఇటీవల పట్టేదారులు రోడ్డుపై కందకాలు తవ్వి నిర్మాణాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు కందకాలను పూడ్చివేశారు. అయితే మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పుడే రోడ్డుకు మార్కింగ్ చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
మూలన పడ్డ ఆర్వోబీ
లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి గోపాల్‌వాడ మధ్య రైల్వే ట్రాక్‌పై రూ.77 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మిస్తామని 2018 ఎన్నికల సమయంలో శ్రీరాంపూర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆర్వోబీ నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఎమ్మెల్యే కోరిక మేరకు సీఎం హామీ ఇచ్చారు. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆర్వోబీ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి కేటాయించిన స్థలం తమదంటూ మంచిర్యాల సిమెంట్ కంపెనీ యాజమాన్యం బోర్డులు ఏర్పాటు చేసి కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు బైపాస్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించి, ప్రజల ఇబ్బందులు తొలగించాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
Updated Date - 2021-11-30T03:37:04+05:30 IST