గేట్లు భద్రమేనా!
ABN, First Publish Date - 2021-08-11T07:33:50+05:30
వరద ఉధృతికి పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగి.. కొట్టుకుపోయింది. దానికి మరమ్మతు చేసేందుకు ప్రాజెక్టులోని నీళ్లన్నింటినీ దిగువకు వదలాల్సివచ్చింది. ఆ నీళ్లన్నీ సముద్రంపాలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ
- పులిచింతల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం
- రాష్ట్రంలోని ప్రాజెక్టుల గేట్లపై అధికారుల దృష్టి
- మూడు ప్రాజెక్టుల గేట్లలో సమస్యల గుర్తింపు
- రెడ్‌జోన్‌లో కడెం, జూరాల, ఎస్సారెస్పీ
- ఇప్పటికే ఇరిగేషన్‌లో ‘ఓఅండ్‌ఎం’ ఏర్పాటు
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వరద ఉధృతికి పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగి.. కొట్టుకుపోయింది. దానికి మరమ్మతు చేసేందుకు ప్రాజెక్టులోని నీళ్లన్నింటినీ దిగువకు వదలాల్సివచ్చింది. ఆ నీళ్లన్నీ సముద్రంపాలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల గేట్లన్నీ సురక్షితంగానే ఉన్నాయా? ఎక్కడైనా సాంకేతిక సమస్యలున్నాయా? నిర్వహణ లోపాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రంలో పలు భారీ, మధ్య తరహా, చిన్ననీటి ప్రాజెక్టులు ఉండగా.. వాటిలో మూడు ప్రాజెక్టులను వెనువెంటనే మరమ్మతులు చేయాల్సినవిగా గుర్తిస్తూ రెడ్‌జోన్‌లో పెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు, వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, జగిత్యాల ఈఎన్‌సీ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల గేట్లలో సాంకేతిక సమస్యలున్నాయని తేల్చారు.
ప్రస్తుతం ఈ మూడింటిలో దండిగా నీటినిల్వలు ఉన్నప్పటికీ.. ప్రాజెక్టుల రక్షణకు వచ్చిన ఇబ్బందేమీ లేదనే అంచనాకు అధికారులు వచ్చారు. నిల్వలు తగ్గుముఖం పట్టగానే మరమ్మతులు చేయాల్సిన జాబితాలో వీటిని చేర్చారు. ఇందులో కృష్ణా బేసిన్‌లో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 62 గేట్లు ఉండగా.. వీటి మరమ్మతుల కోసం ఇప్పటికే రూ.12.5 కోట్ల దాకా విడుదల చేశారు. ఈ నిధులతో గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఇక గోదావరి బేసిన్‌లో ఉన్న కడెం ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా.. ఇందులో 9 గేట్లు ఒక రకంగా, మరో 9 గేట్లు ఇంకో రకంగా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో అత్యంత క్లిష్టమైన గేట్లు ఇవేనని అధికారులు గుర్తించారు. వాస్తవానికి వరద రావడానికి ముందే ఈ గేట్లన్నింటినీ ఒకసారి ఎత్తేసి.. వాటి పనితీరును పరిశీలించారు. ఇవే కాకుండా అన్ని ప్రాజెక్టుల గేట్లనూ పరిశీలించి క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఎన్‌వోసీ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నామని అధికారులు తెలిపారు.
సీడబ్ల్యూసీ ప్రొటోకాల్‌కు అనుగుణంగా..
పులిచింతల ప్రాజెక్టులో నెలరోజుల ముందునుంచే నీటినిల్వలు ఉన్నాయి. దీని గేటు విరిగిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కిపడ్డాయి. స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేసి.. విరిగిన గేటును మరమ్మతు చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నిల్వలు ఉండి వరద పెరిగితే.. గేట్లు ఎత్తే ప్రక్రియ కూడా క్లిష్టంగా ఉంటుందని, ఒక్కోసారి ఎత్తిన గేట్లను వరద తగ్గగానే దించడానికి ప్రయత్నం చేసినా దిగవని అధికారులు అంటున్నారు. గేట్ల నిర్వహణలో ఈ సమస్యలన్నీ వస్తుంటాయని పేర్కొంటున్నారు. గతం లో కడెం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులోని నీళ్లన్నీ వృధాగా పోయాయి. వనపర్తిలోని సరళాసాగర్‌లో కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలోనూ 2009లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రాజెక్టుకు 25 లక్షల క్యూసెక్కుల వరద ఏకకాలంలో వచ్చింది. దాంతో 16 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. భారీ వరదలతో కర్నూలులో 10 మంది చనిపోగా, లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఆ వరదకు కుడి, ఎడమల విద్యుత్ కేంద్రాలు కూడా నీటమునిగాయి. ఒక దశలో ప్రాజెక్టు కూడా కొట్టుకుపోతుందనే ఆందోళన వ్యక్తమైంది. అంతకుముందు 1986లో గోదావరికి 36 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో భద్రాచలంలోని రామాలయం నీటమునిగింది. ఈ అనుభవాల నేపథ్యంలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రొటోకాల్‌ను అనుసరించి.. డ్యామ్ ల నుంచి నీటిని విడుదల చేస్తూ గేట్లను, డ్యామ్‌లను కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తే విషయంలో సీడబ్ల్యూసీ ప్రొటోకాల్‌ను పాటించకపోవడం కూడా ప్రమాదానికి ఒక కారణంగా అధికారులు గుర్తించారు.
ముందే మేల్కొన్న తెలంగాణ
తెలంగాణలో రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుండటంతో నీటిపారుదల శాఖలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్‌ఎం) విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఈఎన్‌సీతోపాటు సీఈ, ఎస్‌ఈ, ఈఈ, డీఈఈ స్థాయి యంత్రాంగాన్ని సమకూర్చింది. గత జనవరిలో పురుడుపోసుకున్న ఈ విభాగానికి ఏకంగా రూ.350 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించగా... తాజాగా మరో రూ.246 కోట్ల అదనపు నిధులను ప్రభుత్వం నుంచి కోరారు. ఈ నిధులతో నిరంతరం క్షేత్రస్థాయిలో గేట్ల మరమ్మతులు చేసున్నారు. వాస్తవానికి ఏడాది కిందటి దాకా రూ.200 కోట్ల దాకా నిధులు నిర్వహణకు వస్తుండగా... ప్రత్యేక విభాగంతో రూ.596 కోట్లకు పైగా సమకూర్చినట్లయింది. ఏప్రిల్, మే, జూన్‌లలోనే ఈ విభాగం అన్ని ప్రాజెక్టుల గేట్లతోపాటు కాలువల గేట్లను కూడా పరిశీలన చేయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రధాన ప్రాజెక్టులకు 1500కు పైగా గేట్లు ఉండగా.. చిన్నాచితక ప్రాజెక్టులు, కాలువలకు 15 వేల దాకా గేట్లు ఉన్నాయ ని లెక్కలు తీశారు. రానున్న ఏడాదిలోపు గేట్ల డ్రాయిం గ్ పూర్తిచేసి, ఒకే సారూప్యం, ఒకే సైజులో ఉన్న కొన్ని గేట్లను అవసరమైతే అందుబాటులో ఉంచుకోవాలనే యోచనతో కూడా ప్రభుత్వం ఉంది.
కట్టలు తెగిన అనుభవాలెన్నో!
తెలంగాణలో పులిచింతల లాంటి అనుభవాలు గతంలో కూడా ఉన్నాయి. కరీంనగర్‌లోని పాలెంవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది. డి జైన్‌లలో లోపాలే దీనికి కారణమని తర్వాత గుర్తించారు. నాగార్జునసాగర్ జలాశయం కుడికాల్వ గేటు కూడా గతఏడాది విరిగిపోయింది. దాంతో ఏడునెలల పాటు నీళ్లు వృధాగా పోయాయి. 2009 నాటి వరదకు ప్రాజెక్టు స్పిల్‌వేపై గుంతలు ఏర్పడ్డాయి. 2019 అక్టోబరులో మూసీ ప్రాజెక్టు గేటు కూడా వరదలకు కొట్టుకుపోయింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టు కట్ట 2019 డిసెంబరులో తెగిపోయింది. ఆసియాలోనే ఆటో సైఫన్ విధానంలో కట్టిన రబ్బర్ డ్యామ్ ఇది. జలాశయంలో నీళ్లు నిండితే... ఆటోమేటిగ్గా దిగువకు వెళ్లేలా దీనిని డి జైన్ చేశారు. అయితే కట్ట తెగి.. నీళ్లన్నీ వృధా అయ్యాయి. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గేటు 2018 సెప్టెంబరులో ఊడిపోయింది. ములుగు జిల్లాలోని గుండ్లవాగు ప్రాజెక్టు కట్ట కూడా 2006లో తెగిపోయింది.
Updated Date - 2021-08-11T07:33:50+05:30 IST