ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరుగా పరిహారం వివక్ష కాదా!

ABN, First Publish Date - 2021-06-26T07:42:27+05:30

మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు పరిహారం చెల్లింపుల్లో ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భూములు, ఇళ్లు కోల్పోయినవారిపై సానుభూతి ఏది? 
  • ఒంటరి మహిళలు, పురుషులకు పూర్తి పరిహారమివ్వండి
  • చెక్కులు సిద్ధం చేసి, జూలై 5న కలెక్టర్‌ ఆఫీసులో పిటిషనర్లకు ఇవ్వండి 
  • తర్వాతి విచారణ దాకా ఊళ్లను ఖాళీ చేయించొద్దు.. ఇళ్లు కూల్చేయొద్దు
  • సాదాసీదాగా తీసుకుంటే ప్రాజెక్టు పనులపై స్టే ఆర్డర్‌ ఇస్తాం
  • మల్లన్నసాగర్‌ ముంపు బాధితుల కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు


హైదరాబాద్‌, తొగుట, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు పరిహారం చెల్లింపుల్లో ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ఒకే గ్రామంలోని ప్రజలకు వేర్వేరుగా పరిహారాన్ని ఎలా చెల్లిస్తారని ప్రశ్నించింది. ఇళ్లు, భూములు కోల్పోయిన బాధితుల పట్ల అధికారులు సానుభూతి చూపడం లేదని, భూసేకరణ విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదని, పరిహారం చెల్లించకుండా ఏళ్లుగా బాధితులను వేఽధింపులకు గురిచేస్తున్నారని ఆక్షేపించింది. ముంపు బాధితుల్లో ఒంటరి మహిళలు, పురుషుల పట్ల వివక్ష చూపొద్దని.. వారికి పూర్తి పరిహారం చెల్లించాలని పేర్కొంది. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పరిహారం చెల్లింపుల్లో వివక్ష చూపుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేములఘాట్‌కు చెందిన 52 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన 27 మంది, ఎర్రవల్లికి చెందిన 18 మంది ఒంటరి మహిళలు, పురుషులు 2019లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. 


ఈ వ్యాజ్యాల విచారణకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్రీన్‌బెంచ్‌ శుక్రవారం మరోసారి కేసును విచారించింది. పిటిషనర్లందరికీ పరిహారానికి సబంధించి చెక్కులన్నింటినీ సిద్ధం చేసి, జూలై 5న ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేసింది. అదేరోజు కార్యాలయానికి పిటిషనర్లు వస్తారని, వారికి అక్కడే చెక్కులను అందజేయాలని సూచించింది. ఆ రోజు మరో పని ఉందనే కారణంతో చెక్కుల పంపిణీని జిల్లా కలెక్టర్‌ వాయిదా వేయరాదని స్పష్టం చేసింది. కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లే పిటిషనర్లు తమవెంట తగిన గుర్తింపు కార్డులు తీసుకుని వెళ్లాలని సూచించింది. తదుపరి విచారణదాకా పిటిషినర్లను గ్రామాల నుంచి ఖాళీ చేయించవద్దని, వారి ఇళ్లు కూల్చొద్దని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏ. రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి. నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పనులు నిలిచిపోరాదని, అయితే భూసేకరణ విషయంలో అధికారుల తీరు అందుకు అనుగుణంగా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న ఆధునిక  పరిజ్ఞానంతో క్షణాల్లో సమాచారం పొందే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వారాలకు వారాలు గడువు కోరడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ‘మీరు సాదా-సీదాగా తీసుకుంటే ప్రాజెక్టుపై స్టే ఆదేశాలు ఇస్తాం. ఆ తర్వాత కోర్టులను తప్పుబడితే ప్రయోజనం ఉండదు’ అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేసింది. 


గడువు కోరడంపై ధర్మాసనం అసంతృప్తి

 పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్‌. రవికుమార్‌ వాదించారు. పిటిషనర్లకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పరిహారం చెల్లింపులో అధికారులు వివక్ష చూపుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది రాధీవ్‌రెడ్డి వాదిస్తూ భూసేకరణ చట్టం 2013 లేదా ప్రభుత్వం జారీచేసిన జీవో 120 ప్రకారం పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మూడు వారాలు గడువు కావాలని కోరారు. ఈ వాదనలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘గత విచారణ సందర్భంగా తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అయినా మళ్లీ గడువు కోరడం ఏమిటి’ అని నిలదీసింది.  ఇదే ఒరవడి కొనసాగిస్తే సంబంధిత అధికారులను కోర్టుకు పిలవాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘సామాన్యుల బాధలు చూడాలి. పరిహారం కోసం ఏళ్ల తరబడి వేచిచూసేలా చేయరాదు. గతంలో చేసిన చెల్లింపులు మాదిరిగానే పిటిషనర్లకు చెల్లించాలి. ప్రజలను అధికారులు వేధింపులకు గురిచేస్తున్నట్లు పత్రికల్లో వస్తున్న కథనాలు చూస్తున్నాం. అధికారుల చర్యలవల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వక తప్పడం లేదు’ అని వ్యాఖ్యానించింది. 


సంతోషంగా ఉంది

హైకోర్టు తీర్పు సంతోషాన్నిచ్చింది. పరిహారం కోసం ఇన్ని దినాలు సరిగా తిండితిప్పలు లేకుండా ఏడ్చుకుంట కూర్చున్నం. నాకు నలుగురు కూతుళ్లు. మూడో కూతురు భర్త చనిపోవడంతో బిడ్డను తీసుకొనొచ్చి నా దగ్గరే పెట్టుకున్న. ఆమెకు ఇక్కడే ఆధార్‌, ఓటుహక్కు ఉన్నాయి. పరిహారం కోసం గ్రామపెద్దల చుట్టూ తిరిగినా రాదన్నారు. న్యాయం కోసం హైకోర్టులో కేసు వేసినం. 

-రేతి రాములమ్మ, వేములఘాట్‌  


కోర్టుకు వెళ్లని బాధితులకూ ఇయ్యాలె

ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందనే దానికి కోర్టు తీర్పు నిదర్శనం. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పక్షాన ఏళ్లుగా పోరాటం చేస్తున్నం. గ్రామంలో 963 రోజులు దీక్షలు చేశాం. ఏటిగడ్డ కిష్టాపూర్‌ వాసులు వేసిన సీసీ 383/2019 కేసు తీర్పులో మల్లన్నసాగర్‌ ముంపుగ్రామాల వారికి ప్రతి కుటుంబానికి రూ.7.5 లక్షల ప్యాకేజీ, 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ. 5.04 లక్షలు ఇవ్వాలని పేర్కొంది. అపుడే అందరికీ పరిహారం ఇవ్వాల్సిన అధికారులు గ్రామంలో కొందరికి ఇయ్యలేదు. దీంతో జూలై 2019లో బాధితుల తరఫున హైకోర్టును ఆశ్రయించాం. ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో నిర్వాసితులకు అనుకూలంగా తీర్పురావడం గొప్ప విషయం. కోర్టుకు వెళ్లని బాధితులకూ ఆర్‌అండ్‌ఆర్‌ అందజేయాలి. 

  -హాయతొద్దీన్‌, వేములఘాట్‌

Updated Date - 2021-06-26T07:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising