ముగిసిన మునిసిపోల్స్ ప్రచారం
ABN, First Publish Date - 2021-04-28T08:51:55+05:30
రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీలు, వివిధ మునిసిపాలిటీల్లోని వార్డులకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది.
- పలు చోట్ల నేతల సుడిగాలి పర్యటనలు..
- పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు.. 30న పోలింగ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీలు, వివిధ మునిసిపాలిటీల్లోని వార్డులకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. శుక్రవారం ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, ఏప్రిల్ 15 తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వార్డుల వారీగా బుధవారం సాయంత్రానికి ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చివరి రోజు కావడంతో మంగళవారం ఆయా ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు.
స్థానిక శ్రేణులతో కలిసి ప్రచారాన్ని హోరెత్తించారు. గ్రేటర్ వరంగల్‌లో టీఆర్‌ఎస్ పక్షాన మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పక్షాన ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం సందర్భంగా నేతలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శనాస్ర్తాలు సంధించుకున్నారు. ఖమ్మంలో ఈసారి ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. తన నియోజకవర్గం కావడంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం అన్నీ తానై నిర్వహించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామానాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తదితరులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, సీపీఎం నేత నున్నా నాగేశ్వరరావు, పోతినేని సుదర్శన్ ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
Updated Date - 2021-04-28T08:51:55+05:30 IST