అవస్థల ‘స్లాట్’!
ABN, First Publish Date - 2021-05-07T09:58:52+05:30
కొవిడ్ టీకాల కొరత గ్రామీణ ప్రజానీకానికి కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. కొవిన్‌లో వ్యాక్సిన్ బుక్ చేసుకోవడం తెలియక చాలామంది అవస్థలు పడుతున్నారు. రిజిస్ట్రేషన్, స్లాట్ బుక్ చేసుకున్నా కొందరి సెల్‌ఫోన్లకు సంక్షిప్త సమాచారం
టీకాల కోసం ‘కొవిన్’లో బుకింగ్‌తో తిప్పలు
రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడంతో.. గ్రామీణుల వెతలు
నమోదు చేసుకున్నా.. ఫోన్లకు మెసేజ్‌లు రాని వైనం
రెండో డోసు వారికి సకాలంలో దొరకని స్లాట్
రూరల్ పీహెచ్‌సీల్లోనూ వారానికి సరిపడా బుకింగ్‌లు
అర్బన్‌లోనైతే 15 రోజుల వరకు..
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్/హైదరాబాద్, మే 6 : కొవిడ్ టీకాల కొరత గ్రామీణ ప్రజానీకానికి కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. కొవిన్‌లో వ్యాక్సిన్ బుక్ చేసుకోవడం తెలియక చాలామంది అవస్థలు పడుతున్నారు. రిజిస్ట్రేషన్, స్లాట్ బుక్ చేసుకున్నా కొందరి సెల్‌ఫోన్లకు సంక్షిప్త సమాచారం రావడం లేదు. ఏప్రిల్ 30 వరకు సర్కారు దవాఖానాలకు ఆధార్ కార్డుతో వెళితే టీకాలిచ్చారు. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉండటంతో.. జనం రద్దీని నివారించేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే ఇస్తున్నారు. కేంద్రానికి 100 మందికే టీకాలు వేస్తుండటంతో పంపిణీ మందగిస్తోంది.
కొవాగ్జిన్ రెండో డోసుకు..
కొవాగ్జిన్ రెండో డోసు కోసం ఎదురుచూసే వారికి నరకం కనిపిస్తోంది. ప్రస్తుతం స్లాట్ బుక్ చేసుకుంటేనే టీకా ఇస్తామని వైద్య శాఖ చెబుతోంది. ఆ స్లాట్‌లలో కొవిషీల్డ్ టీకాయే ఉంటోంది. తొలుత సమీపంలోని పీహెచ్‌సీలలో కొవాగ్జిన్ అందుబాటులో ఉన్నవారు దాన్ని తీసుకున్నారు. రెండో డోసుకు వచ్చేసరికి ఆ పీహెచ్‌సీలలో కొవాగ్జిన్ ఉండట ం లేదు. ఎప్పుడు అందుతుందో తెలియదని వైద్యాధికారులు చెబుతున్నారు. స్లాట్స్‌లో కొవాగ్జిన్ లేకపోవడం, రెండో డోసు సమయం మించిపోతుండటంతో కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలా ప్రభుత్వ కేంద్రాల్లో 10-15 రోజులకు స్లాట్స్ బుక్ అయిపోయాయి. రెండో డోసు వేసుకోవాలంటే ఖాళీగా ఉండటం లేదు. 15-20 రోజుల తర్వాతి స్లాట్సే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉండేవారు సొంత జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో బుక్ చేసుకుంటున్నారు.
మే 20 తర్వాతే చూపుతుండటంతో..
మెల్లమెల్లగా టీకా బుక్ చేసుకునే పద్ధతిని ప్రజలకు వైద్య శాఖ అలవాటు చేస్తోంది. ముందస్తు రిజిస్ట్రేషన్ లేని వారికి టీకా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో.. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా, తెలిసినవారి ద్వారా కొవిన్ పోర్టల్‌లో నమోదు చేయించుకుంటున్నారు. అలా చేసుకోలేనివారు మీ సేవ, ఇంటర్నెట్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటివి చేసుకోలేని వారు, అటుఇటు తిరగలేక ఇంటిపట్టునే ఉంటున్నారు. రెండు రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో కూడా వారం పది రోజుల స్లాట్లు బుక్ అవుతున్నాయి. ఉదాహరణకు గురువారం కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే వచ్చే శుక్రవారం టీకా తీసుకునేందుకు స్లాట్ బుక్ అవుతోంది. హైదరాబాద్ విషయానికొస్తే తొలి డోసు తీసుకున్న పలు టీకా కేంద్రాలను కొవిన్ పోర్టల్‌లో చూపించడం లేదు. సమీపంలోని ఇతర కేంద్రాల్లో బుక్ చేసుకుందామంటే మే 20 తర్వాతే చూపుతున్నాయి. చేసేదేం లేక ఎంత దూరమైనా సరే, ఎక్కడ స్లాట్ అందుబాటులో ఉంటే అక్కడ బుక్ చేసుకుంటున్నారు.
ప్రైవేటుకు అనుమతి ఇచ్చినా ప్రారంభం కాలేదు
రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాకు అనుమతినిచ్చింది. అయితే చాలా ఆస్పత్రులు సొంతంగా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 145 ప్రైవేటు టీకా కేంద్రాలున్నాయి. అపోలో లాంటి ఆస్పత్రులు ఇప్పటికే వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి టీకాలు కొనుగోలు చేసుకున్నాయి. వాటిల్లో స్లాట్ ఓపెన్ కావడంతో వచ్చే పది రోజులకు బుకింగ్ అయ్యాయి. ఇక మరికొన్ని ఆస్పత్రులు టీకాల కోసం కంపెనీలకు ఇండెంట్ పెట్టాయి.
Updated Date - 2021-05-07T09:58:52+05:30 IST