చీకట్లు నింపిన దీపావళి
ABN, First Publish Date - 2021-11-04T08:27:26+05:30
పండగ కోసం మనమనడు, కూతురు, అల్లుడు ఇంటికొస్తే వారితో కలిసి సంబురాలు చేసుకోవాలనుకున్న ఆ కుటుంబానికి పెనువిషాదం మిగిలింది.
- చెట్టును ఢీకొట్టిన కారు.. చిన్నారి సహా నలుగురి దుర్మరణం
- పటాకులు కొనేందుకు వెళ్లి తిరిగివస్తుండగా ఘటన
- కామారెడ్డి జిల్లాలో విషాదం
- వేర్వేరు ఘటనల్లో మరో ముగ్గురి మృతి
తాడ్వాయి/ ఎల్లారెడ్డి, నవంబరు 3: పండగ కోసం మనమనడు, కూతురు, అల్లుడు ఇంటికొస్తే వారితో కలిసి సంబురాలు చేసుకోవాలనుకున్న ఆ కుటుంబానికి పెనువిషాదం మిగిలింది. పూజ సామగ్రితో పాటు పటాకులు కొనేందుకు కారులో వెళ్లి తిరిగివస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో అదుపుతప్పిన వాహనం చెట్టుకు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు మృత్యువాతపడ్డారు. కామారెడ్డి జిల్లాలో ఈ విషాదం జరిగింది. ఎల్లారెడ్డికి చెందిన వీరపేట శ్రీనివాస్ (60) బంగారం వ్యాపారి. తన కుమార్తెను పిట్లంకు చెందిన ఆనంద్‌కుమార్ (31)కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశాడు. ఈ దంపతులకు నాజోజు (4) అనే కుమారుడు ఉన్నాడు. దీపావళి పండుగకు శ్రీనివాస్ ఇంటికి రెండు రోజుల క్రితం కూతురు, అల్లుడు వచ్చారు. పండుగ సామాను కొనేందుకు శ్రీనివాస్, తన సోదరుడు వీరపేట్ జగన్‌రావు చారి (55), అల్లుడు ఆనంద్‌కుమార్, మనుమడు నాజోజుతో పాటు మరో నలుగురు కుటుంబీకులు మాందాస్, యశ్వంత్, శ్రీహర్ష, అమర్‌కాంత్‌తో కలిసి కారులో బుధవారం మధ్యాహ్నం కామారెడ్డికి వెళ్లారు. అంతా కొనుగోలు చేశాక ఆనందంగా ఎల్లారెడ్డికి తిరుగుముఖం పట్టారు.
వీరి ప్రయాణిస్తున్న వాహనం తాడ్వాయి మండలం ఎర్రపహడ్ శివారు వద్ద ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో అదుపు తప్పి, చెట్టును ఢీకొట్టింది. కారును నడిపిస్తున్న ఆనంద్‌కుమార్‌తో పాటు వాహనంలో ఉన్న వీరపేట శ్రీనివాస్, వీరపేట్ జగన్‌రావు చారి, నాజోజు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు వాహనాన్ని నెమ్మదిగా నడపాలని కుటుంబీకులు చెబుతున్నా.. ఆనంద్ వినకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతి కష్టమ్మీద మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. కాగా మరో రెండు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి వద్ద ట్రాక్టర్ బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న గుగులోతు అనిత (27) అనే యువతి మృతిచెందింది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం కళ్యాణి లో క్షీరసాగర్ (47), బుద్దవంత్ సచిన్ (22) చెరువులో ఎడ్లను కడిగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు.
Updated Date - 2021-11-04T08:27:26+05:30 IST