ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సన్మానాలు సరే..సొమ్ములేవీ!?

ABN, First Publish Date - 2021-02-28T08:04:30+05:30

అది బీఆర్కే భవన్‌.. శనివారం సాయంత్రం! పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయంలో మూడు దశాబ్దాలపాటు సేవలు అందించిన సాగునీటి పారుదల శాఖ సహాయ కార్యదర్శి ఒ.శ్రీదేవి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రిక్తహస్తాలతోనే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌
  • పదవీ విరమణ రోజు అందని ఆర్థిక ప్రయోజనాలు
  • ముఖ్యమంత్రి ఆదేశించినా అమల్లోకి రాని విధానం
  • ఆరు నెలల ముందే జీపీఎఫ్‌ సొమ్ము ఫ్రీజ్‌
  • గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ డబ్బులూ ఇవ్వట్లే
  • శనివారం రిటైరైన నలుగురికి అందని బెనిఫిట్స్‌
  • రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరిదీ ఇదే పరిస్థితి
  • సన్మానాలు, సత్కారాలు, కార్లలో దింపడంతోనే సరి
  • ఉద్యోగులు, అధికారుల్లో నిరాశ, నిస్పృహలు

ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలనూ పదవీ విరమణ చేసిన రోజునే ప్యాకేజీ చెక్కు రూపంలో అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కానీ, ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. కొన్నిచోట్ల సన్మానాలు చేసి సాదరంగా ఇళ్లకు పంపుతున్నారు. మరికొన్నిచోట్ల అది కూడా లేదు. ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రం ఉద్యోగులంతా ఎప్పట్లాగే కార్యాలయాల చుట్టూ తిరగక తప్పని పరిస్థితి!!


హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): అది బీఆర్కే భవన్‌.. శనివారం సాయంత్రం! పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయంలో మూడు దశాబ్దాలపాటు సేవలు అందించిన సాగునీటి పారుదల శాఖ సహాయ కార్యదర్శి ఒ.శ్రీదేవి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ బీఎన్‌ఎస్వీ ప్రసాద్‌, రోడ్లు భవనాల శాఖ వ్యక్తిగత కార్యదర్శి కె.ఉమారాణి, వైద్య ఆరోగ్య శాఖ సెక్షన్‌ అసిస్టెంట్‌ ఆర్‌.కిషన్‌లాల్‌ పదవీ విరమణ చేశారు. అందుకే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షతన శనివారం వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దండిగా పూల దండలు వేశారు. శాలువాలు కప్పారు. ఘనంగా సత్కరించారు. ప్రభుత్వానికి వారు అందించిన సేవలను, వారి పనితీరును కొనియాడారు. శేష జీవితంలో వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం, సాదరంగా ప్రభుత్వ వాహనాల్లోనే వారి వారి ఇళ్ల వద్ద దింపి వచ్చారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ముఖ్యమంత్రి నిర్దేశించిన సూచనలను పాటించారు.


కానీ, సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు వారికి అక్కడికక్కడే ఆర్థిక ప్రయోజనాలను మాత్రం అందించలేదు. జీపీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, గ్రాట్యుటీతో కూడిన ప్యాకేజీ చెక్కును ఇవ్వలేదు. రిక్తహస్తాలతోనే వారిని ఇళ్లకు పంపారు. ఇప్పుడు సచివాలయంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. పదవీ విరమణ చేసిన వారిని కొన్నిచోట్ల ఘనంగా సన్మానించి, ప్రభుత్వ వాహనంలోనే ఇళ్లకు పంపుతున్నారు. కానీ, నెలలు గడిచినా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం అందడం లేదు. ఇక, పింఛను అందాలంటే నెలలు, ఏళ్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 


నిజానికి, ఏళ్లతరబడి ప్రభుత్వానికి సేవలు అందించి, పదవీ విరమణ చేసిన వారిని వేధించరాదని కేసీఆర్‌ నిర్దేశించారు. ‘‘ప్రతి ఉద్యోగి, అధికారి ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్‌ అయ్యేవరకూ వారికి సంబంధించిన రికార్డ్‌ అంతా సిద్ధంగా ఉండాలి. పదవీ విరమణ పొందే రోజునే ఆయనకు వర్తించే ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ ఒక ప్యాకేజీగా అందించాలి. రిటైర్‌ అయిన రోజున ఒక సన్మాన సభను ఏర్పాటు చేసి, పూలదండ వేసి, శాలువా కప్పి, ఘనంగా సత్కరించాలి. అనంతరం ప్రభుత్వ వాహనంలో గౌరవప్రదంగా ఇంటి వద్ద దింపాలి. 30 ఏళ్లపాటు ప్రభుత్వ సేవకుడిగా పని చేసినందుకు ఆయనకు మనం గౌరవం ఇవ్వాలి. అది మన సంస్కారం’’ అని గత ఏడాది సెప్టెంబరు 14న శాసనసభలో ప్రకటించారు. ఈ మేరకు ఓ విధానాన్ని రూపకల్పన చేస్తామని చెప్పారు. దాంతో, ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమైంది. పదవీ విరమణ చేసిన రోజున సంతోషంగా ఇళ్లకు వెళ్లవచ్చని, పింఛన్‌, గ్రాట్యుటీ, జీపీఎఫ్‌ సొమ్ము కోసం ఉన్నతాధికారుల చుట్టూ నెలలు, ఏళ్ల తరబడి తిరగాల్సిన శ్రమ ఉండదని భావించారు. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కేసీఆర్‌ ఇచ్చిన భరోసా ఎక్కడా అమలు కావడం లేదు. ఏ ఒక్క అధికారికి, ఉద్యోగికి పదవీ విరమణ పొందిన రోజున ఆర్థిక ప్రయోజనాల్లో ఒక్కదానినీ అందించడం లేదు. ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితే నెలకొనడం పట్ల వారిలో తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఉద్యోగి సొంతంగా జమ చేసుకున్న జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) సొమ్మును కూడా క్లెయిమ్‌ చేసుకునే పరిస్థితి ఉండడం లేదు. ప్రతి నెలా ఉద్యోగి తన వేతనం నుంచి కొంత సొమ్మును జీపీఎ్‌ఫలో జమ చేసుకుంటారు. అంతే సొమ్మును ప్రభుత్వం కూడా జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తుంది. 


రిటైరైన రోజున దీనిని ఉద్యోగికి అందించాలి. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. కానీ, రిటైర్మెంట్‌కు ఆరు నెలల ముందు నుంచే జీపీఎఫ్‌ ఖాతాలను ఆయా శాఖలు ఫ్రీజ్‌ చేస్తున్నాయి. దానిని ఉద్యోగి క్లెయిమ్‌ చేసుకోకుండా నిలిపి వేస్తున్నాయి. పదవీ విరమణ చేసిన రోజున ఇస్తామని చెబుతున్నారు. కానీ, ఇవ్వడం లేదు. అలాగే, రిటైర్మెంట్‌ రోజునే లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ సొమ్మును అందించాలి. ఒక్కో ఉద్యోగి, అధికారికి 300 సెలవుల డబ్బును అందించాలి. ఒక ఉద్యోగి రిటైరయ్యే నాటికి ఆయన జీతం రూ.70 వేలు ఉందనుకుంటే.. దానికి 10 రెట్ల మేర అంటే.. దాదాపు రూ.7 లక్షలు లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ సొమ్ము అందాలి. ఇప్పుడు దీనిని కూడా ఇవ్వడం లేదు. ఇక, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.12 లక్షల గ్రాట్యుటీ అమల్లో ఉంది. రిటైరైన రోజునే దీనిని కూడా చెల్లించాలి. ఇలా మొత్తం మీద.. ఉద్యోగి, అధికారి స్థాయి, వేతనాన్ని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఆర్థిక ప్రయోజనాలు పదవీ విరమణ రోజునే అందాలి. కానీ, ఇవేవీ ఇవ్వడం లేదు. పైగా, నెలల తరబడి వాటిని ఇవ్వకుండా సతాయిస్తున్నారు. రిటైరైన తర్వాత కూడా ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇక. పింఛను విషయంలోనైతే ఇబ్బందులు మరీ ఎక్కువ. పదవీ విరమణ పొందగానే ఉద్యోగికి చివరి వేతనంలో 50 శాతం పెన్షన్‌ను అమలు చేస్తారు. ఇది అమల్లోకి రావాలంటే ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. విద్యుత్తు బోర్డు, జలమండలి, బ్యాంకుల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి. తమ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన రోజే.. అన్ని ప్రయోజనాల చెక్కులను వారి చేతుల్లో పెట్టి సత్కరిస్తారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం సీఎం ఆదేశించినా... ప్యాకేజీ విధా నం అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-02-28T08:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising