వారితో మాట్లాడాక ఒత్తిడి తగ్గేది
ABN, First Publish Date - 2021-05-22T16:55:32+05:30
కొవిడ్ మొదటి దశ నుంచీ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాను. కానీ కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడే కొవిడ్ సోకి...
ఆస్పత్రిలో ఒకరికొకరం ధైర్యం చెప్పుకునేవాళ్లం
టిమ్స్‌లో వైద్యులు చికిత్సతో పాటు ధైర్యం పెంచేవారు
15 రోజుల్లో కోలుకున్నాం
కరోనాను జయించిన దంపతుల మనోగతం
హైదరాబాద్/సైదాబాద్: కొవిడ్ మొదటి దశ నుంచీ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాను. కానీ కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడే కొవిడ్ సోకి ఉంటుంది. ఫిబ్రవరి రెండో వారంలో సాధారణ జ్వరం, జలుబు, ఒంటినొప్పులు మొదలయ్యాయి. టెంపరేచర్ 100కు మించకపోవడంతో మామూలు జ్వరంగా భావించి మందులు వాడాను. ఇంట్లో షుగర్ పరీక్ష చేసుకోగా, హెచ్చుతగ్గులు వచ్చాయి. ఐదు రోజులకు మా ఆవిడకు జలుబు, గొంతు నొప్పితో పాటు వాసన కోల్పోయింది. మోతీనగర్‌లోని కుమారుడి ఇంటికి వెళ్లి రోజువారీగా వాడే బీపీ, షుగర్, గుండె సంబంధించిన మందులతో పాటు పారాసిటమాల్ వాడుతూ విశ్రాంతి తీసుకున్నాం. అయినా జ్వరం తగ్గలేదు. కుటుంబ సభ్యులు కరోనా పరీక్ష చేయిస్తే పాజిటివ్ వచ్చింది. మాతో పాటు కుమారుడికి, మనుమడు, మనుమరాలికి సోకింది. దీంతో తీవ్ర భయం వేసినా ఏ మాత్రం తొణకలేదు. గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరేందుకు సిద్ధమవుతున్నాం. ఇంతలో టిమ్స్‌లో చికిత్స తీసుకుని కోలుకున్న మా అన్నయ్య కుమారుడు, కోడలి సూచనతో మమ్మల్ని కూడా కుటుంబసభ్యులు టిమ్స్‌లో చేర్పించారు. ఫిబ్రవరి 22న ఆస్పత్రిలో చేరాం. అప్పటికి అక్కడ కేవలం 60 మంది మాత్రమే ఉన్నారు. మా ఇద్దరికీ కలిపి ఓ రూం ఇచ్చారు. నాకు రెండేళ్ల క్రితం గుండెలో స్టంట్ వేశారు. దీంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షించేవారు. రోజూ ఉదయం బీపీ, షుగర్, ఆక్సిజన్ పల్స్ చెక్ చేసేవారు. కొవిడ్ మందులతో పాటు షుగర్, బీపీ మందులు ఇచ్చేవారు. నర్సులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. స్నానం చేసేందుకు వేడి నీళ్లు ఇచ్చేవారు.
మొదట్లో ఆందోళన చెందాం
ప్రభుత్వ ఆస్పత్రి అనగానే మొదట్లో కంగారుపడ్డాం. ఎలా బయటపడతామో అని భయం వేసింది. వైద్యులు, వైద్య సిబ్బంది భరోసాతో ధైర్యం వచ్చింది. ఖాళీ సమయాలలో యూట్యూబ్‌లో టీవీ సీరియల్స్ చూసేవాళ్లం. టిమ్స్‌లో అందించిన చికిత్సతో కోలుకున్నాం. ఆస్పత్రి నుంచి వచ్చాక నెల రోజులు విశ్రాంతి తీసుకుని వైద్యుల సూచనలు పాటించి పూర్తిగా కోలుకున్నాం. ఆస్పత్రిలో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు రోజూ ఫోన్ చేసే మాట్లాడేవారు. మేమున్నామంటూ ధైర్యం చెబుతూ యోగక్షేమాలు తెలుసుకునేవారు. వారితో మాట్లాడిన తర్వాత ఒత్తిడి తగ్గేది.
మంచి ఆహారం అందించారు
ఉదయం అల్పాహరంలో ఇడ్లీ, ఉప్మా, బొండాలు, మధ్యాహ్నం భోజనంలో ఎగ్, రాత్రి భోజనంలో చపాతీతో పాటు రైస్ ఇచ్చేవారు. వారంలో రెండు రోజులు లంచ్‌లో చికెన్ బిర్యానీ పెట్టేవారు. ఉదయం, సాయంత్రం టీ, రోజూ డ్రై ఫ్రూట్స్ ఇచ్చేవారు. షుగర్ లెవల్స్ అధికంగా ఉండటం వల్ల టీ తాగేవాళ్లం కాదు. కొన్ని సార్లు కుటుంబసభ్యులు పండ్లు, కర్రీస్ సెక్యూరిటీ సిబ్బందికి ఇస్తే వాళ్లు మాకు పంపించేవాళ్లు. ప్రతీ గదిలో మినరల్ వాటర్ అందుబాటులో ఉంచారు. 15 రోజుల పాటు వైద్యులు, సిబ్బంది జాగ్రత్తగా చూసుకున్నారు.
డిశ్చార్జి అయ్యాక..
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక 10 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నాం. అనంతరం కూతుళ్ల వద్ద నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఆరోగ్యవంతులయ్యాం. ఉదయాన్నే బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్, టీ బిస్కెట్, 9 గంటలకు టిఫిన్, 11 గంటలకు పసుపు వేసిన పాలు, మధ్యాహ్నం భోజనంలో కోడిగుడ్డు సలాడ్స్, రెండు రకాల కూరగాయలతో పౌష్టికాహారం అందించేవారు. సాయంత్రం 4 గంటలకు డ్రైఫూట్స్, రాత్రి 9 గంటలకు కోడిగుడ్డు, రెండు రకాల కూరలతో రెండు చపాతీలు పెట్టేవారు. 10 గంటలకు పాలు తాగి పడుకునేవాళ్లం. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఉప్పల్‌లోని మా ఇంట్లో ఉంటున్నాం. 15 రోజుల క్రితం వ్యాక్సిన్ తీసుకున్నాం. కరోనా వచ్చిందని ఆందోళన చెందకుండా మనోధైర్యంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే జయించవచ్చు.
Updated Date - 2021-05-22T16:55:32+05:30 IST